Thursday, January 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబ్యాంకుల ప్రయివేటీకరణ వినాశకరమైన ఆలోచన

బ్యాంకుల ప్రయివేటీకరణ వినాశకరమైన ఆలోచన

- Advertisement -

– జాతీయ ప్రయోజనాలకు ముప్పు
– ప్రజల కష్టార్జితానికి ప్రభుత్వ బ్యాంకుల్లోనే భద్రత
బ్యాంకు ఉద్యోగుల సంఘం జాతీయ కార్యదర్శి బిఎస్‌. రాంబాబు
– కెనరా బ్యాంకు ఉద్యోగి రాష్ట్ర వ్యాప్త జనజాగృతి సైకిల్‌ యాత్ర ప్రారంభం
నవతెలంగాణ -సుల్తాన్‌ బజార్‌

దేశంలో ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రయివేటీకరణ వినాశకరమైన ఆలోచన అని, ఇది భారతదేశ ఆర్థిక సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసి జాతీయ ప్రయోజనాలకు తీవ్ర ముప్పు కలిగిస్తుందని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) కార్యదర్శి బిఎస్‌. రాంబాబు అన్నారు. ఈ ప్రతిపాదనను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. బ్యాంకుల ప్రయివేటీకరణ పౌరుల ప్రయోజనాలకు కాదు.. కేవలం కార్పొరేట్‌ శక్తులకు లాభం చేకూర్చేందుకేనని విమర్శించారు. ”ప్రభుత్వరంగ బ్యాంకులను కాపాడుకుందాం-దేశాన్ని రక్షంచుకుందాం” అనే నినాదంతో కెనరా బ్యాంకు ఉద్యోగి జి.ఉమామహేష్‌ నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్త జనజాగృతి సైకిల్‌ యాత్రను మంగళవారం హైదరాబాద్‌ కోఠి, సెంట్రల్‌ బ్యాంకు వద్ద ఏపీ-తెలంగాణ బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య (ఏపీటీబీఈఎఫ్‌) అధ్యక్షులు టి.రవీంద్రనాథ్‌ జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏఐబీఈఏ జాతీయ కార్యదర్శి మాట్లాడుతూ.. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చేపట్టిన బ్యాంకుల జాతీయీకరణ సామాన్య ప్రజలకు బ్యాంకింగ్‌ సేవల ద్వారాలను తెరిచిందని గుర్తు చేశారు. అంతకుముందు బ్యాంకింగ్‌ రంగం కొద్ది మంది సంపన్నులకే పరిమితమై ఉండేదన్నారు. బ్యాంకుల జాతీయీకరణ తరువాత పేద రైతులు, మహిళలు, చిన్న వ్యాపారులు, రోజువారీ కూలీలు సహా అణగారిన వర్గాలు ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నాయని వివరించారు. ప్రస్తుతం అదానీ, అంబానీ వంటి కార్పొరేట్లకు మోడీ ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరిస్తూ వారి లబ్ది కోసమే ప్రయివేటీకరణను ముందుకు తీసుకొస్తోందని తెలిపారు. అనేక ప్రయివేటు బ్యాంకుల్లో నిధుల దుర్వినియోగం జరిగి అవి కుప్పకూలిన ఘటనలు ఉన్నాయని వివరించారు. ప్రజల కష్టార్జితమైన పొదుపు ప్రభుత్వరంగ బ్యాంకుల్లోనే భద్రంగా ఉంటుందని చెప్పారు. ప్రయివేటీకరణ ప్రతిపాదనను తక్షణమే ఉపసంహరించుకొని, ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేసి ఉద్యోగ భద్రతకు, ప్రజల నిధులకు ముప్పు లేకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదని అన్నారు. లేకుంటే ప్రజలను భాగస్వామ్యం చేస్తూ పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వరంగ బ్యాంకుల వల్ల లాభాలు, ప్రయివేటీకరణ వల్ల జరిగే నష్టాలను ప్రజలకు వివరిస్తూ ‘ప్రభుత్వరంగ బ్యాంకులను కాపాడుకుందాం – దేశాన్ని రక్షంచుకుందాం’ అన్న నినాదంతో కెనరా బ్యాంకు ఉద్యోగి చేపట్టిన జనజాగృతి సైకిల్‌ యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
ఏపీటీబీఈఎఫ్‌ అధ్యక్షులు టి.రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రయివేటీకరించడం దుర్మార్గమన్నారు. ఈ చర్య దీర్ఘకాలంలో ప్రజా సంపద నష్టానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రయివేటీకరణను విరమించుకొని, తగిన ఉద్యోగ నియామకాలు చేపట్టి, మెరుగైన సేవల కోసం ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీటీబీఈఎఫ్‌ సంయుక్త ప్రధాన కార్యదర్శి పివి.కృష్ణారావు, ఉప ప్రధాన కార్యదర్శులు సమద్‌ ఖాన్‌, పి.ఉదరు భాస్కర్‌, మధుసూదన్‌, అజరు, సంయుక్త కార్యదర్శి నల్లపురెడ్డి, ఏఐబీఓఏ సంయుక్త కార్యదర్శి బీఎన్‌ఆర్‌ నాయక్‌, ఏపీటీబీఈఎఫ్‌ నేతలు జానకిరామ్‌, నిహారిక, సాయి వాణి, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -