నవతెలంగాణ హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధాని అభ్యర్థిగా ప్రియాంకా గాంధీని ఎన్నుకోవాలని ఆ పార్టీ ఎంపీ ఇమ్రాన్ మసూద్ చేసిన వ్యాఖ్యలపై ఆమె భర్త రాబర్ట్ వాద్రా స్పందించారు. పార్టీ కార్యకర్తలంతా ప్రియాంక ప్రధాని కావాలని కోరుకుంటున్నారని.. చాలా చోట్ల నుంచి ఇలాంటి డిమాండ్లు వస్తూనే ఉన్నాయని వాద్రా అన్నారు. రాజకీయాల్లో ప్రియాంక ముందడుగు వేయాలని.. తాను కూడా రాజకీయాల్లోకి రావాలని అందరూ కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం ప్రియాంక దృష్టి ప్రజా సమస్యలపైనే ఉందన్నారు.
ఇటీవల కాంగ్రెస్ నేత ఇమ్రాన్ మసూద్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రియాంకా గాంధీని ప్రధాన మంత్రిగా ఎన్నుకుంటే ఆమె తన నాన్నమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ లాగా మంచి ప్రజాదరణ సొంతం చేసుకుంటారని అన్నారు. శత్రు దేశాలకు తగిన బుద్ధి చెబుతారన్నారు. రాహుల్ గాంధీ గురించి మీడియా ప్రశ్నించగా.. వారిరువురు కలిసి పని చేస్తారని చెప్పుకొచ్చారు.



