గుండెపోటుతో మృతి కవులు, రచయితల దిగ్భ్రాంతి నవతెలంగాణ కార్యాలయంలో సంతాప సభ
ఘన నివాళులర్పించిన సీజీఎం ప్రభాకర్, బుకహేౌజ్ ఎడిటర్ ఆనందాచారి
కడదాకా కమ్యూనిస్టుగానే జీవించారంటూ కొనియాడిన వక్తలు
హైదరాబాద్‌లో అంత్యక్రియలు పూర్తి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రముఖ సాహితీవేత్త, రచయిత, ప్రజాశక్తి, నవతెలంగాణ బుక్ హౌజ్, ఎడిటోరియల్ బోర్డులో సుదీర్ఘకాలం పని చేసిన తంగిరాల చక్రవర్తి(61) శనివారం ఉదయం హైదరాబాద్‌లోని బాలాపూర్‌లో గుండె పోటుతో హఠాన్మరణం చెందారు. తెల్లవారుజామున ఎడమ భుజం నొప్పితోపాటు గుండెల్లో మంటగా ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న సమయంలోనే మరోసారి తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆయన ఆస్పత్రిలోనే కన్నుమూశారు. ఆయనకు భార్య లక్షీ ప్రసన్నకుమారి, కుమారుడు సాయిసుందర్ ఉన్నారు. తంగిరాల భౌతికకాయాన్ని శనివారం మధ్యాహ్నం 3 గంటల వరకు బాలాపూర్‌లోని ఆయన ఇంటి వద్ద ఉంచారు. తర్వాత స్థానిక శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.
తంగిరాల చక్రవర్తి విజయవాడ దగ్గర్లోని కపిలేశ్వరపురంలో 1964 సెప్టెంబరు 18న జన్మించారు. తండ్రి నాటకరంగ ప్రముఖుడు తంగిరాల వెంకటశివరామకృష్ణ ప్రసాద్. చక్రవర్తి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ.పట్టా పుచ్చుకున్నారు. తెలుగు సాహిత్యంలో కథ, కవిత, నాటకం, వ్యాసం, నవల, గ్రంథసమీక్ష, విమర్శ మొదలైన ప్రక్రియలలో మూడు దశాబ్దాలుగా కృషి చేస్తున్నారు. తండ్రి పేరు మీద తంగిరాల మెమోరియల్ ట్రస్ట్‌ను ప్రారంభించి ప్రతి ఏటా ఒక నాటకరంగ ప్రముఖుడిని సత్కరిస్తూ వచ్చారు. 25 ఏండ్లపాటు ఆ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహించారు. ఆకాశవాణి విజయవాడ, హైదరాబాద్ కేంద్రాలతోపాటు లండన్ తెలుగు రేడియోలో ప్రసంగాలు చేశారు.
చివరి వరకు కమ్యూనిస్టుగానే…
తంగిరాల చక్రవర్తి చివరి వరకు కమ్యూనిస్టుగానే జీవించారని పలువురు వక్తలు కొనియాడారు. శనివారం ఆయన మరణ వార్త తెలియగానే హైదరాబాద్‌లోని నవతెలంగాణ ప్రధాన కార్యాలయంలో సంతాపసభను నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. చివరి వరకు సంస్థ కోసం ఆయన చేసిన సేవలను ఉద్యోగులు, సిబ్బంది గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా సీజీఎం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజాశక్తి, నవతెలంగాణ బుక్ హౌజ్‌ల్లోనూ, ఎడిటోరియల్ బోర్డు సభ్యులుగా తంగిరాల ఎంతో నిబద్ధతతో పని చేశారని చెప్పారు. ఉద్యోగిగా రిటైర్డ్ అయినా సంస్థ కోసం సేవలందించారని గుర్తు చేశారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకుని ఉద్యోగులు, సిబ్బంది ముందుకెళ్లా లని ఆకాంక్షించారు. బుకహేౌజ్ ఎడిటర్ కె.ఆనందాచారి మాట్లాడుతూ తంగిరాల హఠాన్మరణం అత్యంత బాధాకరమన్నారు. నవతెలంగాణ ఉద్యోగిగా పని చేస్తూనే సాహితీవేత్తగా ఆయన విస్తృత సేవలందించారని స్మరించుకున్నారు.
తెలంగాణ, ఆంధ్రాలో కవిగా, రచయితగా, నాటకకర్తగా పేరు గడించారని తెలిపారు. రెండేండ్ల క్రితం నవతెలంగాణలో పదవి విరమణ పొందినా… సంస్థతో తన అనుబంధాన్ని కొనసాగించారని పేర్కొన్నారు. ఆయన మరణం సాహితీ లోకానికి తీరని లోటని పేర్కొన్నారు. 10 టీవీ మాజీ ఎండీ కె.వేణుగోపాల్ మాట్లాడుతూ తంగిరాల ప్రజాశక్తి, నవతెలంగాణలో ఆద్యంతం నిబద్ధతతో పని చేశారని అన్నారు. వ్యక్తిగతంగా చాలా సౌమ్యుడిగా ఉన్నా.. పార్టీ నియమ నిబంధనల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించేవారని తెలిపారు. కార్యక్రమంలో నవతెలంగాణ జనరల్ మేనేజర్లు ఎ.వెంకటేశ్, లింగారెడ్డి, కె.భరత్, మేనేజర్లు రేణుక, వీరయ్య, పలువురు విలేకర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆయన భౌతిక కాయానికి నవతెలంగాణ సీజీఎం ఫ్రభాకర్, బుకహేౌజ్ ఎడిటర్ కె.ఆనందా చారి, స్టేట్ బ్యూరో చీఫ్ బీవీఎన్ పద్మరాజు, బోర్డు సభ్యులు కె. నరహరి, అనంతోజు మోహనకృష్ణ, వేణుమాధవ్, బసవపున్నయ్య, సలీమా, నవతెలంగాణ జనరల్ మేనేజర్లు నరేందర్, రఘు, శశిధర్‌తోపాటు బ్యూరో సభ్యులు, పలువురు ఉద్యోగులు, సిబ్బంది నివాళులర్పించారు. ఆచార్య కొలకలూరి ఇనాక్, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారి, రచయితలు కూర చిదంబరం, జె.విద్యాధర్‌రావు, రఘువీర్ ప్రతాప్, వెంకటదాసు, గజవెల్లి సత్య భాస్కర్, కిషోర్, సాహితి కిరణం సంపాదకులు పొత్తూరి సుబ్బారావు, సీపీఐ(ఎం) మీర్‌పేట నాయకులు, కార్యకర్తలు తంగిరాల భౌతికకాయానికి నివాళులర్పించారు.
ఎస్.వీరయ్య, తెలకపల్లి రవి నివాళి
తంగిరాల మరణం పట్ల సీపీఐ (ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య, సాహితీ స్రవంతి గౌరవాధ్యక్షులు తెలకపల్లి రవి తీవ్ర సంతాపాన్ని వెలిబుచ్చారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తంగిరాల భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
తెలంగాణ సాహితీ సంతాపం
తెలంగాణ సాహితీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తంగిరాల చక్రవర్తి మరణం సాహితీ లోకానికి, ముఖ్యంగా తెలంగాణ సాహితీకి తీరని లోటని రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వల్లాభాపురం జనార్థన, ఆనందాచారి పేర్కొన్నారు. ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే రాష్ట్ర కేంద్రంలో ఉన్న తెలంగాణ సాహితీ నాయకులు తంగిరాల ఇంటికి వెళ్లి భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆ సంఘం హైదరా బాద్ నగర నాయకులు నస్రీన్ ఖాన్, శరత్ సుదర్శి, మేరెడ్డి రేఖ, ముజాహిద్ తంగిరాలకు నివాళులర్పించారు.
రాంపల్లి రమేశ్, సుధాభాస్కర్ సంతాపం
తంగిరాల మరణం పట్ల నవతెలంగాణ ఎడిటర్ రాంపల్లి రమేశ్, మాజీ ఎడిటర్ ఆర్.సుధాభాస్కర్ సంతాపాన్ని ప్రకటించారు. ఆయన మరణం సాహితీ రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. తంగిరాల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.