వాగ్దానం

ఈ కంటికి చీకట్లో ఎక్కడినుండి ఎక్కడికో
నడిచీ నడిచీ అలసిపోయి
ఎక్కడో విశ్రమించాను
కళ్లు తెరిచి చూస్తే
మెడకు పాములు చుట్టుకొని
బుస కొడుతున్నాయి
భుజాల మీద వాలిన నెమళ్లు
ముక్కుతో గీరుతున్నాయి
ఛాతీ మీద తాబేలొకటి కన్నీళ్లతో రోదిస్తోంది
కడుపు మీద తలపెట్టిన జింకలు
ఆకలిని చప్పరిస్తున్నాయి
వాటి గుండెల్లో ఏదో సొద ఉంది
లేచి చూడలేను గాని
సకల జీవరాశి నా పాదాల మీద పడి ఉంది
నేనేం చేయగలను
నేనో పనికిమాలిన ఓటరును
గుట్టలను తొవ్వినా అడవులను నరికినా..
భూములను అమ్ముకున్నా..
ప్రాజెక్టుల పేరిట లక్షల కోట్లు దోచుకున్నా..
ఆ కీచకులను చూస్తూ
మౌనం పాటించే దారిన పోయే దానయ్యను
ఇప్పుడు ప్రశ్న నుదుటి మీద
తుపాకీ పెట్టబడి ఉంది
ఇప్పుడు ఉరిమే గొంతు మీద
కత్తి పెట్టబడి ఉంది
ఇప్పుడు అక్షరం చుట్టూ
ఊచల కంచెలు మొలుచుకొస్తున్నాయి
ఏం చేయమంటారు
కదిలితే ప్రాణం పోతుంది
ఇంతకుముందే చెప్పానుగా
మెడ చుట్టూ సర్పాల ఉచ్చు
బిగుసుకొని ఉంది
మూగజీవులారా మీరేం బాధపడకండి
ఎంతకాలమైనా సరే
ఈ అరణ్యాన్ని గాలిస్తాను
శిథిలమైపోతున్న ఒక అమరవీరుడి
స్థూపాన్ని కనుక్కుంటాను
వెలిసిపోయిన జెండాకు నెత్తురు పులుమి
కొత్త పొద్దుగా ఎగరేస్తాను.
(హెచ్‌.సి.యు విధ్వంసాన్ని చూసి)
– మౌనశ్రీ మల్లిక్‌, 8919338546

Spread the love