– బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌కు తేడా ఏం లేదు
– హామీలు ఎలా అమలు చేస్తారో ముందే చెప్పాలి : రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
నవతెలంగాణ-సిటీబ్యూరో/ముషీరాబాద్
ఎన్నికల సమయంలో అమలు కాని హామీలు ఇస్తూ ప్రజలను మభ్యపెడుతుంటారని, ఇందులో బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య తేడా ఏమీ లేదని వక్తలు అభిప్రాయపడ్డారు. ‘తెలంగాణలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి విధానం ప్రజానుకూలమైనదేనా?’ అనే అంశంపై మంగళవారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పీపుల్ జాయింట్ యాక్షన్ కమిటీ(టీపీజేఏసీ), ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక(ఎన్‌ఏపీఎం) ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీజేఏసీ కన్వీనర్ హరగోపాల్ మాట్లాడుతూ.. ‘నన్ను కోసినా ఒక్క రూపాయి కూడా మీకు వేతనాలు పెంచలేను. మీ డిమాండ్లు తీర్చలేను’ అని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి అనాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఒక రాజకీయ పార్టీ అధినేతగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ఆయనపైనే ఉందన్నారు. రాజకీయ పార్టీల ఎన్నికల హామీల అమలుకు ఆర్థిక వనరులు ఎలా సమకూర్చుకుంటారో ముందే చెప్పాలని ఎన్నికల నియమావళిలో ఉన్నా.. ఏ పార్టీ పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికల కమిషన్ కూడా ఈ విషయంలో రాజకీయ పార్టీలపై ఒత్తిడి తేవడం లేదని చెప్పారు. ఏండ్ల తరబడి అధికారంలో ఉండి హామీలు అమలు చేయకుండా, ప్రతిపక్షంలోకి రాగానే గగ్గోలు పెట్టడం విచిత్రమని బీఆర్‌ఎస్‌ను ఉద్దేశించి అన్నారు. బీఆర్‌ఎస్ చేసే విమర్శల్లో నీతి, నిజాయితీ ఉండదని, కేవలం అధికార పార్టీని ఇరుకున పెట్టడమే లక్ష్యంగా ఉందని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సైతం అనేక హామీలు ఇచ్చి అమలు చేయడం లేదని విమర్శించారు. ఆయా ప్రభుత్వాలు కోరినా నిధులు ఇవ్వకుండా కేంద్రం ఇబ్బందులు పెడుతున్నదని తెలిపారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కోర్టును ఆశ్రయించే అధికారం పౌరులకు ఉంటే, రాజకీయ పార్టీలు ఒళ్లు దగ్గర పెట్టుకుని హామీలిస్తాయన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించలేదని, రిటైర్మెంట్ పెన్షన్లను ఏండ్ల కొద్ది పెండింగ్‌లో పెట్టడంతో ప్రస్తుత కాంగ్రెస్ అవి చెల్లించడానికి ఇబ్బంది పడుతున్నదని వివరించారు. పలువురు వక్తలు మాట్లాడుతూ.. మూసీ పునర్జీవం పేరుతో నిర్దిష్ట ప్రణాళిక లేకుండా పేదల ఇండ్లపైకి ప్రభుత్వం బుల్డోజర్లు పంపి కూలగొట్టిందన్నారు. వికారాబాద్ జిల్లా దామగుండం అడవిని నావీ రాడార్ స్టేషన్ కోసం కేంద్ర ప్రభుత్వానికి రాసిచ్చేశారని తెలిపారు. ఫార్మా విలేజీతో లగచర్లలో అడ్డగోలుగా భూ సేకరణకు పూనుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల అభీష్టానికి భిన్నంగా పొలాల చుట్టూ కంచెలు వేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక శాఖను నిర్వీర్యం చేస్తున్నదన్నారు. ఈ సమావేశంలో ప్రజా శాస్త్రవేత డాక్టర్ బాబూరావు, టీపీజేఏసీ కో-కన్వీనర్లు కన్నెగంటి రవి, అంబటి నాగయ్య, రవిచంద్ర, మైసా శ్రీనివాస్, డాక్టర్ వనమాల, మీరా సంఘమిత్ర, ఎన్‌ఏపీఎం, డీబీఎఫ్, ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మభ్య పెట్టడానికే హామీలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES