నవతెలంగాణ న్యూఢిల్లీ : దేశ రాజధానిలో వాయు కాలుష్యం తీవ్రంగా నెలకొందని, ప్రభుత్వం ఎలాంటి నియంత్రణా చర్యలు తీసుకోవడం లేదని నిరసిస్తూ ఇండియా గేట్‌కు సమీపంలో ఆదివారం నిరసనలు, ఆందోళనలు జరిగాయి. దీనిలో పొలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణ జరిగింది. అనేకమంది విద్యార్థులు గాయపడ్డారు. దీనిపై ఢిల్లీ పోలీసులు 22మందిని అరెస్టు చేశారు. వేర్వేరుగా రెండు ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేశారు. అనుమతి లేకుండానే ఇండియా గేట్ వద్ద నిరసనల నుండి వారిని పంపేయడానికి ప్రయత్నించినపుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆందోళనకారులను అక్కడ నుండి తొలగించడానికి తాము ప్రయత్నించగా, తమపై పెప్పర్ స్ప్రే ఉపయోగించారని పోలీసు అధికారులు తెలిపారు.
ఇండియా గేట్ సి హెక్సాగన్ వద్ద వారిని అడ్డగించగా వారందరూ పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్‌కు వెళ్ళారని అక్కడ వున్న అధికారులతో మరో ఘర్షణ జరిగిందని వారు చెప్పారు. అయితే నిరసనకారులు పోలీసులు కట్టుకథలు చెప్తున్నారని, ఇటీవల ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టు కమాండర్ మాద్వి హిద్మా పోస్టర్లను ప్రదర్శించినందుకే తమను టార్గెట్ చేశారని వారు స్పష్టం చేశారు. బిర్సా ముండా నుండి నేటి హిడ్మా వరకూ అడవుల కోసం పోరాడిన వారేనని అందుకే వాయు కాలుష్యం సందర్భంగా ఫొటోను ఉపయోగించారని పలువురు తెలుపుతున్నారు.



