నవతెలంగాణ-హైదరాబాద్: ఫ్రాన్స్‌లో ప్రధాని ఫ్రాంకోయిస్ బేరో ప్రభుత్వానికి వ్యతిరేకంగా బుధవారం దేశవ్యాప్త ఆందోళనలు జరగనున్నాయి. ‘బ్లొక్వాన్స్ టౌట్’ నేతృత్వంలో సోషల్‌మీడియా మద్దతుదారులు పిలుపుమేరకు బుధవారం ఫ్రాన్స్ దేశవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు 600 ఆందోళనలు జరగనున్నాయి. ఈ నిరసనల్లో లక్షలాది మంది ప్రజలు పాల్గొననున్నారు. ఈ ఆందోళనలను అణగదొక్కడానికి అంతర్గత వ్యవహారాల శాఖ దాదాపు 80 వేల మంది పోలీసుల్ని మోహరించనుంది. ప్రధానంగా ఉత్పత్తి, సరఫరా కేంద్రాలు, బ్యాంకులు, పాఠశాలలు, ఆసుపత్రులను వద్ద ఆందోళనకారులు నిరసన చేయనున్నారు. బహుశా మౌలిక సదుపాయాలైన శుద్ధి కర్మాగారాలు, గిడ్డంగులు, రైల్వే స్టేషన్ల వంటివి విధ్వంసం అయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
కాగా, సోమవారం జరిగిన విశ్వాస పరీక్షలో ఫ్రాన్స్ ప్రధాని ఫ్రాంకోయిస్ బేరోకు అనుకూలంగా 194 ఓట్లు మాత్రమే వచ్చాయి. వ్యతిరేకంగా 364 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన ప్రధానిగా నియమితులైన ఎనిమిది నెలలకే పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో ఆ దేశాధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రాన్ కొత్త ప్రధానిని నియమిస్తానని ఆయన హామీ ఇచ్చారు. కానీ ఈలోపే ఫ్రాన్స్ ప్రభుత్వం తెచ్చిన బడ్జెట్ ప్రతిపాదనలను సైతం సామాజిక సంస్థలు తిరస్కరించాయి. ఆర్థిక, రాజకీయ సంక్షోభం, సమాజంలో నెలకొన్న అశాంతి వల్లే నేడు భారీ ఎత్తున ఫ్రాన్స్ వీధుల్లో నిరసనలు జరగనున్నాయి.