Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంలాస్‌ ఏంజెల్స్‌లో నిరసనల హోరు

లాస్‌ ఏంజెల్స్‌లో నిరసనల హోరు

- Advertisement -

– ఆకస్మిక ఇమ్మిగ్రేషన్‌ దాడులపై ఆందోళన
– అణచివేత చర్యలతో అడ్డుకున్న పోలీసులు
లాస్‌ ఏంజెల్స్‌:
అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌ నగరంలో అధికారులు జరిపిన ఆకస్మిక ఇమ్మిగ్రేషన్‌ దాడులు నిరసనలకు దారితీశాయి. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు భాష్పవాయు గోళాలు, పెప్పర్‌ స్ప్రే, ఫ్లాష్‌ బ్యాంగ్‌ గ్రెనేడ్లను ప్రయోగించారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ వలసదారు లపై ఉక్కుపాదం మోపుతుండడంతో ఆగ్రహ జ్వాలలు మిన్నంటుతున్నాయి. అనేక మంది నిరసనకారులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రభుత్వ ఏజెంట్లు కొందరు శుక్రవారం మధ్యాహ్నం ఓ హోల్‌సేల్‌ బట్టల దుకాణంలో ప్రవేశించి అనేక మంది ఉద్యోగులను నిర్బంధించారు. దీంతో అక్కడికి చేరుకున్న ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా ప్రభుత్వ ఏజెంట్లు హెచ్చరించడంతో ఆందోళనకారుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రభుత్వ ఏజెంట్లను ఓ వ్యక్తి ‘పందులు’ అని సంబోధిస్తూ కేకలు వేశాడు. మరొకరు వారిని ఫాసిస్టులుగా అభివర్ణించారు. నిరసన తెలుపుతున్న వారిని చెదరగొట్టేందుకు పోలీసులు ఫ్లాష్‌ బ్యాంగ్‌ గ్రెనేడ్లు విసిరారు. నిర్బంధించిన వలసదారులను వ్యాన్లలో కుక్కి అక్కడి నుంచి తరలించారు. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో వందలాది మంది ప్రదర్శనకారులు లాస్‌ ఏంజెల్స్‌ ఫెడరల్‌ భవనం వద్దకు చేరుకున్నారు. దాడులు ఆపాలని, సర్వీస్‌ ఎంప్లాయీస్‌ ఇంటర్నేషనల్‌ యూనియన్‌కు చెందిన కాలిఫోర్నియా యూనిట్‌ అధ్యక్షుడు డేవిడ్‌ హర్తాను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. దాడులను చిత్రీకరిస్తున్న కార్మిక నేత హర్తాపై పోలీసులు జులుం ప్రదర్శించడంతో ఆయన గాయపడ్డారు. అనంతరం ఆయనను అరెస్ట్‌ చేశారు. రాత్రి సమయంలో పోలీసులు రెచ్చిపోయి నిరసనలను అణచివేసేందుకు సిద్ధపడ్డారు. కొందరు నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో ప్రజలు గుమిగూడడాన్ని చట్టవిరుద్ధంగా అధికారులు ప్రకటించారు. అక్కడ నుంచి వెళ్లకపోతే అరెస్టులు తప్పవని హెచ్చరించారు. కాగా లాస్‌ ఏంజెల్స్‌లోని మూడు ప్రదేశాలలో నాలుగు తనిఖీలు నిర్వహించామని అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఐసీఈ) ప్రతినిధి యస్మీన్‌ పిట్స్‌ ఓ కీఫ్‌ తెలిపారు. మొత్తంగా 44 మందిని అరెస్ట్‌ చేశామని చెప్పారు. అక్రమ వలసదారులను దేశం నుంచి బహిష్కరించాలన్న ట్రంప్‌ నిర్ణయానికి అనుగుణంగా లాస్‌ ఏంజెల్స్‌లో అధికారులు తనిఖీలు జరుపుతున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad