నవతెలంగాణ-హైదరాబాద్: లద్దాఖ్ ఉద్యమకారుడు, వాతావరణ హక్కుల కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ అరెస్టయ్యారు. రాష్ట్రహోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ రెండు రోజుల క్రితం లద్దాఖ్‌లో ఆందోళనలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఘర్షణల్లో నలుగురు మరణించగా,100 మందికిపైగా గాయపడ్డారు. లద్దాఖ్‌లో హింసను రెచ్చగొట్టినట్టు సోనమ్ వాంగ్‌చుక్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిరసనలు జరిగిన నెండు రోజుల తర్వాత వాంగ్‌చుక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలంటూ వాంగ్‌చుక్ నాయకత్వంలో నిరాహార దీక్ష చేస్తున్న 15 మందిలో ఇద్దరు వ్యక్తుల ఆరోగ్యం క్షీణించడంతో వారిని సెప్టెంబర్ 10న దవాఖానకు తరలించిన దరిమిలా ఎల్‌ఏబీ యువజన విభాగం బంద్‌కి పిలుపు ఇచ్చింది. మంగళవారం తన 15 రోజుల దీక్షను విరమించిన వాంగ్‌చుక్ హింసకు పాల్పడవద్దని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అయితే ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. ఆ తర్వాత లెహ్‌లో బీజేపీ కార్యాలయానికి నిప్పు పెట్టిన ఆందోళనకారులు దాని ఎదుట నిలిపి ఉన్న భద్రతా సిబ్బంది వాహనాన్ని దగ్ధం చేశారు. ఈ అల్లర్లకు వాంగ్‌చుక్‌కే కారణమని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన్ని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.
వాంగ్‌చుక్ సంస్థ లైసెన్స్ రద్దు
మరోవైపు సోనమ్ వాంగ్‌చుక్ ఏర్పాటు చేసిన స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్‌మెంట్ ఆఫ్ లద్దాఖ్‌కు (SECMOL) గతంలో జారీ చేసిన ఎఫ్‌సీఆర్‌ఏ రిజిస్ట్రేషన్‌ను కేంద్ర ప్రభుత్వం గురువారం రద్దు చేసిన విషయం తెలిసిందే.