Wednesday, September 24, 2025
E-PAPER
Homeజాతీయంలేహ్‌లో ఆందోళనలు..ఘర్షణల్లో నలుగురు మృతి

లేహ్‌లో ఆందోళనలు..ఘర్షణల్లో నలుగురు మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్‌ చేస్తూ లేహ్‌ నగరంలో చేపట్టిన నిరసన కార్యక్రమాలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఘర్షణల్లో నలుగురు మృతి చెందారు. మరో 30 మందికి గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే, పోలీసులు జరిపిన కాల్పుల్లోనే నలుగురు యువకులు మృతిచెందారని, గాయపడిన వారి సంఖ్య ఎక్కువ ఉందని ఆందోళనకారులు ఆరోపించారు.

లద్దాఖ్‌కు రాష్ట్ర హోదాతోపాటు ఆరో షెడ్యూల్‌ పొడిగింపు డిమాండ్‌ చేస్తూ స్థానికంగా కొంతకాలంగా స్థానికంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సెప్టెంబర్‌ 10 నుంచి ఓ పదిహేను మంది ఆమరణ దీక్షకు దిగారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా మారడంతో సెప్టెంబర్‌ 23 సాయంత్రం వారిని ఆస్ప‌త్రికి తరలించారు. ఈ నేపథ్యంలో లద్దాఖ్‌ అపెక్స్‌ బాడీ (LAB) యువజన విభాగం తాజా నిరసనలకు పిలుపునిచ్చింది.

ఈ క్రమంలోనే లేహ్‌ నగరంలో అనేక మంది వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. వీరిని చెదరగొట్టేందుకు వచ్చిన భద్రతా దళాలపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. స్థానిక భాజపా కార్యాలయానికి, పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు. ఒక్కసారిగా పరిస్థితులు హింసాత్మకంగా మారాయి. వీటిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించిన పోలీసులు ఫైరింగ్‌ చేశారు. అనంతరం లేహ్‌ జిల్లాలో నిషేధాజ్ఞలు విధించారు.
వాంగ్‌చుక్‌ విచారం..
లేహ్‌లో చోటుచేసుకున్న హింసపై పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్‌ వాంగ్‌చుక్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శాంతియుతంగా చేపట్టిన నిరసనలు ఎలాంటి ఫలితాలు ఇవ్వకపోవడంతోనే యువత నిస్పృహ చెందారన్నారు. ఇవే తాజా ఘటనలకు దారితీశాయన్న ఆయన.. పలువురు యువకులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -