Monday, May 19, 2025
Homeట్రెండింగ్ న్యూస్చరిత్ర చెక్కిన విప్లవ శిల్పం

చరిత్ర చెక్కిన విప్లవ శిల్పం

- Advertisement -

”ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో…
ఎక్కడ మనిషి సగర్వంగా తలెత్తుకుని తిరగగలడో…
ఎక్కడ ప్రపంచం ముక్కలు ముక్కలై మగ్గిపోదో…
ఎక్కడ మన చదువూ, విజ్ఞానం మూఢనమ్మకాలలో ఇంకిపోదో…
ఎక్కడ మనిషి తోటి మనిషిని దోచుకోడో…
అక్కడికి, ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి ప్రభూ నా దేశాన్ని నడిపించు”


అంటాడు విశ్వకవి రవీంద్రుడు. ఈ దేశాన్ని ఆ స్వేచ్ఛా స్వర్గానికి నడిపించడానికా అన్నట్టుగా ఆ రోజు కాలం రెండు ఉదయాలను ప్రసవించింది. ఒకటి సూర్యోదయం.. రెండవది సుందరయ్యోదయం.. అలా చరిత్రాత్మకమైన ‘మే’ దినం 1913న ఈ కారణం చేతనూ ప్రసిద్ధిగాంచింది.
సుందరయ్య కేవలం కాదొక పేరు.. ఈ దేశ విముక్తి పోరు.. విప్లవ సుగుణాల సంగమం. అతడొక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త.. కాకలుతీరిన కమ్యూనిస్టు నాయకుడు.. అసాధారణ కార్యశీలి.. అసమాన ధైర్యశాలి.. ఓ కవి.. రచయిత.. మేధావి.. ఓ గెరిల్లా యోధుడు.. గొప్ప వ్యూహకర్త.. ఉద్యమకారుడు.. ఓ యుద్ధ నిపుణుడు.. పాలనాదక్షుడు.. ఇలా అనేకుడు. మంచి కమ్యూనిస్టు ఎలా ఉండాలో తెలుసుకోవడానికి లీషావ్‌చీ పుస్తకం చదువుతాం. కానీ, అసంఖ్యాకులైన శ్రామిక ప్రజలు సుందరయ్యను చదువుతారు. అంతటి అత్యున్నత కమ్యూనిస్టు దిగ్గజమతడు.


”సుందరయ్య కమ్యూనిస్టుగా మారి ఉండకపోతే ఏం జరిగేది..?” అన్న ప్రశ్న ఆ రోజుల్లో ఓ ప్రముఖ పత్రికలో పతాకశీర్షిక! ఆ ప్రశ్నకు సమాధానం కూడా రాసారు వారు. ”భారత ప్రధాని అయ్యుండేవాడు.. లేదా అఖిల భారత కాంగ్రెస్‌కు అధినేత అయ్యుండేవాడు” అని. అది నిజమే అయ్యుండవచ్చు … (అప్పట్లోనే ఆయన ఏఐసీసీ సభ్యుడు) కానీ దానికి ఆ తరువాత సుందరయ్యే చక్కని వివరణ ఇచ్చాడు. ఏమనీ..? ”సుందరయ్య కమ్యూనిస్టు అయ్యుండకపోతే ఏం జరిగేదంటే…ఆరోజు కాకపోతే మరుసటి రోజో ఆ మరుసటి రోజో తప్పకుండా కమ్యూనిస్టే అయ్యుండేవాడు” అని. నిజంగానే ఆయన భారతదేశానికి ప్రధానమంత్రో, ఆంధ్రదేశానికి ముఖ్యమంత్రో కావాలని కోరుకుంటే కావడం పెద్ద విశేషమేమీ కాదు! కానీ ఆయన అధికారం తనకు కోరు కోలేదు. ప్రజలకు కోరుకున్నాడు. దోపిడీ పీడనల నుంచీ, అసమానతలూ అణచివేతల నుంచీ భారత ప్రజల విముక్తి కోరుకున్నాడు. అందుకే ఆయన ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు. ఓ చరిత్రగా నిలిచిపోయాడు.


స్వాతంత్రోద్యమంలో ఉధృతంగా కొనసాగుతున్న సుందరయ్యను ‘కమ్యూనిస్టు ప్రణాళిక’ విశేషంగా ప్రభావితం చేసింది. అప్పటికే సామ్యవాద సిద్ధాంతాన్ని అధ్యయనం చేస్తూ, జైలులో భగత్‌సింగ్‌ అనుచరులతో చర్చిస్తూ, ప్రపంచ పరిణామాలను, విముక్తి పోరాటాలను గమనిస్తున్న సుందరయ్య.. అమీర్‌ హైదర్‌ఖాన్‌ పరిచయం తరువాత, ఈ దేశ ప్రజల శ్రేయస్సు సోషలిజంలోనే దాగుందని గుర్తించాక దేశంలో కమ్యూనిస్టుపార్టీ నిర్మాణానికి పూనుకున్నాడు. ఒకవైపు స్వాతంత్రోద్యమంలో ముమ్మరంగా పాల్గొంటూనే మరో వైపు కమ్యూనిస్టు కృషి ప్రారంభించాడు. విప్లవ పార్టీ నిర్మాణానికి సంకల్పించాడు. ”మన క్రమశిక్షణ అత్యంత కచ్చితమైనది. అత్యంత తీవ్రమైనది. మిలటరీ క్రమ శిక్షణ కంటే కూడా విలక్షణమైనది. ఎందుకంటే అది స్వచ్ఛందంగా అంగీకరించి పాటించేది కాబట్టి” అన్న లెనిన్‌ మాటలను ఆచరణలో నిజం చేస్తూ ఉక్కు క్రమశిక్షణ గల పార్టీని నిర్మించారాయన. కానీ ఏ పరిస్థితుల్లో..? ఎలాంటి రోజుల్లో..? అప్పటికి దేశంలో సోషలిజం ఓ వింత. ఆచరణ సాధ్యంకాని ఊహ. సమానత్వ మన్నది ఓ కల. దున్నేవాడికే భూమి, పేదలకు భూపంపకం, కనీస వేతనాలు, కార్మిక హక్కులవంటివన్నీ సమాజంలో విచ్ఛిన్నకర పోకడలని భావించే కాలమది! మరోవైపు కాంగ్రెస్‌ తప్ప మరే పార్టీ ఏర్పడినా అది జాతీయోద్యమాన్ని చీల్చడానికేననే భావనలు ప్రచారంలో ఉన్న రోజులవి! ఇటు వంటి అనేక ప్రతికూలతల మధ్య, ఈ విపత్కర పరిస్థితులను ఓ సవాలుగా తీసుకుని దేశానికో ‘విప్లవపార్టీ’ని నిర్మించారు సుందరయ్య. సోవియట్‌ విప్లవస్ఫూర్తితో, తన అద్వితీయ నాయకత్వ ప్రతిభతో దేశవ్యాపితంగా లక్షలాదిమందిని ఆ కర్తవ్యానికి కదిలించాడు. ఎకే గోపాలన్‌, ఇయంఎస్‌ నంబూద్రిపాద్‌, మాకినేని బసవపున్నయ్య వంటి మహామహులనేకులు ఈ విప్లవోద్యమానికి సుందరయ్య ద్వారా ప్రభావితులైన వారే. అలా తన 72ఏండ్ల జీవితంలో 60ఏండ్లు ఈ కర్తవ్యానికే ధారపోసాడు.

స్యాతంత్య్రోద్యమంలోకి ప్రవేశించడానికి ముందే, పన్నెండేండ్ల పసిప్రాయంలోనే, ఓ మోతుబరి కుటుంబంలో పుట్టి కూడా కుల వ్యవస్థనూ అంట రానితనాన్నీ, అసమానతలనూ భరించలేకపోయాడంటే అతడి హృదయమెత గొప్పదై ఉండాలి..! భూస్వామ్యం తిరుగులేని శక్తిగా రాజ్యమేలుతున్న ఆ రోజుల్లో దానిని సవాలు చేయడానికి ఎంత సాహసం కావాలి..! ఆ సాహసమే చైతన్యమై అతడిని విప్లవకారునిగా మార్చింది. ఆ దృక్పథమే విస్తృతమై అతడిని కమ్యూనిస్టుగా మలిచింది. సుందరయ్యను కమ్యూనిస్టులకు మాత్రమే కాక దేశభక్తులైన ఎందరికో ఇష్టుడిగా నిలిపింది. భారత ప్రజలందరి ప్రేమానురాగాలను పొందింది. ఇదెలా సాధ్యమైందంటే.. ఎవరు ఏడవగలరు సాటి మనిషి కన్నీళ్లను చూసి? ఎవరు పోరాడగలరు తోటి మనిషి కష్టాలను తీర్చ? ఒక్క కమ్యూనిస్టులు తప్ప.. అది నిరూపించాడాయన. ఊపిరి బిగబట్టి ఆ తల్లి తనను ప్రసవించినపుడు అందరిలాగే అతను కూడా పాలకోసమే ఏడ్చి ఉండవచ్చు… కానీ ఊహ తెలిసాక నిత్యం ప్రజలకోసమే పరితపించాడు. మానవత్వం రూపుదాల్చిన మహాద్భుతమై మురిపించాడు.. దండాలు పెట్టే చేతులతో జెండాలు పట్టించి, చెప్పుకింది బతుకుల్ని నిప్పుల్లా మండించాడు. ఏడవటమే తప్ప ఎదిరించడం తెలియని పీడితులకు పిడికిళ్లు బిగించడం నేర్పించాడు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటమై సాగాడు.
సుందరయ్య జీవితాన్నీ తెలంగాణ రైతాంగ పోరాటాన్నీ వేరుచేసి చూడలేం. ఎందుకంటే ఆ చారిత్రక పోరాటం భారత కమ్యూనిస్టు ఉద్యమంలోనే కాదు, సుందరయ్య జీవితంలోనూ ఓ మహోన్నత భాగం. ఆ వీరోచిత పోరాటంలో సుందరయ్య పాల్గొనడమే కాదు, రాజకీయ నాయకత్వాన్నీ అందించి సారథ్యం వహించాడు. రాజకీయ విధానాలు జనబాహుళ్య నినాదాలుగా మారితే అవి ఎంతటి మహోజ్వల పోరాటమవుతాయో చేసి చూపించాడు. ఒక విప్లవ నినాదం సామాన్యుడి ఆయుధంగా మారినప్పుడు ఆ మట్టి మనుషుల నుంచే మహావీరులు పుట్టుకొస్తారు. తెలంగాణ సాయుధ పోరాటం చేసిందదే.

ఈ తెలంగాణ మాగాణంలో ఆ విప్లవాల విత్తనాలు జల్లి వీరగాథల్ని పండించిన ప్రజాయుద్ధ సేనాని సుందరయ్య. ఆ సాయుధ పోరు నిర్వహణలో తానొక ఆయుధమై తిరుగాడుతుంటే ఈ అడవి అతడిని కడుపులో దాచుకుంది. ఈ నేల అణువణువూ ఆయనకు నీరాజనం పలికింది. అలా సుందరయ్యతో తెలంగాణది, తెలంగాణతో సుందరయ్యది విడదీయలేని విప్లవ బంధం.
ప్రజాక్షేత్రంలోనే కాదు, పార్లమెంటరీ రంగంలోనూ అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పిన సవ్యసాచి అతడు. భారత పార్లమెంటుకు తొలి ప్రతిపక్ష నాయకుడిగా, మార్క్సిస్ టుపార్టీకి తొలి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్విహించి కూడా ఆ తరువాత ఆంధ్రప్రదేశ్‌ శాసనసభాపక్ష నేతగా, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శిగా పని చేయడానికి వెనుకాడని నాయకుడతను. ఇప్పటికీ పార్లమెంటరీ విలువల గురించి చెప్పాల్సి వస్తే కమ్యూనిస్టేతరులే కాదు, కమ్యూనిస్టు వ్యతిరేకులు సైతం ప్రస్తావిచే పేరు సుందరయ్య. పార్లమెంటుకు కాలినడకనా, సైకిల్‌పైనా వెళ్లగలిగిన నిరాడంబరత, ప్రజల తరపున ప్రభుత్వాన్ని నిలదీయగలిగిన నిబద్ధత ఆయన సొంతం. ఆయన నిరాడంబరత సౌకర్యాలను అనుభవించే అవకాశాలు లేక కాదు. ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకు ఆ అవకాశాలు పుష్కలం..! కానీ అవి తనను ప్రజలకు దూరం చేస్తాయని భావించారాయన. నిజమైన నాయకుడికి గౌరవం, గుర్తింపు, ప్రజాభిమానం అలాంటి హంగూ ఆర్భాటాల నుంచి కాక నిజాయితీతో కూడిన నిబద్ధత, అంకితభావం నుంచే లభిస్తాయని నిరూపించదలచుకున్నారాయన. ఒకరోజు ఓ సాధారణ వ్యక్తి మండుటెండలో ఓ పాత సైకిల్‌పై చెమటలు కక్కుతూ ఓ విలాసవంతమైన భవన ప్రాంగణంలోకి ప్రవేశించాడట.. అక్కడున్న ఓ చెట్టుకింద సైకిల్‌ స్టాండ్‌ వేసి, క్యారల్‌కున్న ఫైళ్ల కట్ట చేతిలోకి తీసుకుని సరాసరి ఆ భవనంలోకి వెళ్లిపోయాడట.. సెక్యూరిటీ అధికారులెవ్వరూ అడ్డు చెప్పకపోగా లేచి నిల్చుని దారి చూపడం అక్కడున్నవారందరినీ ఆశ్చర్యపరిచింది..! ఓ అరగంట తరువాత ఆ వ్యక్తి బయటకొస్తుంటే.. అతడిని సాగనంపడానికి తెల్లని ఖద్దరూ నల్లని చలువ కండ్లద్దాలూ ధరించిన ఆ ప్రముఖుడు తన అధికారగణంతో సహా బయటకి రావటం మరింత ఆశ్యర్యపరిచింది..! ఎండ మండిపోతోంది కారులో వెళ్లండని ఆ పెద్దాయనంటే కాదని ఆ సామాన్యుడు తన సైకిలెక్కి వెళ్లిపోయాడట. ఆ పెద్దాయన రాష్ట్ర ముఖ్యమంత్రి కాగా ఆ సైకిలెక్కిన సామాన్యుడు ప్రతిపక్షనేత సుందరయ్య..! అదీ సుందరయ్య వ్యక్తిత్వం.


ఏ కోణం నుంచి చూసినా ఆయన జీవితం శిఖర సమానమైన దిగానే దర్శనమిస్తుంది. ఆయన జీవనయానంలో అది స్వాతంత్య్ర సంగ్రామమైనా, సాయుధ పోరాటమైనా, పార్టీ నిర్మాణమైనా, పార్లమెంటరీ రాజకీయాలైనా ప్రతి దశలోనూ ఆయన ప్రజలతో మమేకమైన తీరే మనలను ఉత్తేజపరుస్తుంది. అతని ఔన్నత్యం హిమగిరి శిఖరం… అతని ఆలోచన సాగర గర్భం..అతని ఆవేశం ప్రళయభీకరం.. అతని ప్రేమ అనంత వినీలాకాశం.. దోపిడీపై అతని పోరాటం ప్రచండ ఝంఝూ మారుతం… వెరసి ఆయన జీవితం ప్రపంచానికే ఓ విప్లవ సందేశం అనడంలో అతిశయోక్తి లేదు. అయితే కేవలం నిరాడంబర జీవనశైలో లేక నిబద్ధతతో కూడిన అతని పోరాట పటిమో, లేక ఆయన సుగుణాలో మాత్రమే సుందరయ్యను అంతటి మహోన్నతుడిని చేయలేదు.. ఈ దేశానికి కమ్యూనిస్టు చైతన్యం అవసరమైన వేళ.. ఆ చారిత్రక సందర్భం రూపుదిద్దిది సుందరయ్యను. సమాజ గమనంలో చరిత్ర అనేక సందర్భాలనూ అవకాశాలనూ అందిస్తుంది. వాటిని అందిపుచ్చుకుని తదనుగుణంగా తమను తాము నిర్మించుకోవడమే విప్లవకారుల లక్షణం. సుందరయ్య చేసిందీ, ఆయన జీవితం నుంచి నేర్చు కోవాల్సిందీ అదే. చరిత్ర గమనంలో ఓ సంపూర్ణ మానవుణ్ణి కలగన్నాడు సుందరయ్య. ఆ కల సాకారానికి తల్లీ తండ్రీ, ఇల్లూ వాకిలీ, కులం మతం, ఊరు పేరు అన్నీ వదులుకుని… అదిగో నా ఆప్తులు అంటూ ఈ భూగోళాన్ని తమ శిరస్సులపై మోస్తున్న అసంఖ్యాక శ్రామికశక్తిని ఆలింగనం చేసుకున్నాడు. అందుకే 1985 మే 19న ఆయన మరణం యావత్‌ శ్రామికలోకాన్నీ కదిలించింది. కృష్ణాతీరాన్ని అశేష జనవాహిని కన్నీటివరదలో ముంచెత్తింది. అరుణ పతాకమై రెపరెపలాడుతూ.. దీపస్తంభమై వెలుగులు చిమ్ముతూనే ఉంది..
– రాంపల్లి రమేష్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -