నవతెలంగాణ-హైదరాబాద్: ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ పై భారత్ వాయుసేనలు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో తుర్కియే పాకిస్థాన్‌కు మద్దతుగా నిలిచి డ్రోన్లు, క్షిపణులే కాకుండా జవాన్లు కూడా పంపి పెద్ద తప్పిదమే చేసింది. ఈక్రమంలో బాయ్‌కాట్ టర్క్ స్లోగన్‌తో సోషల్ మీడియా వేదికగా భారత్‌లో ఉద్యమం ఊపందుకుంది. దీంతో తుర్కియే దేశానికి చెందిన పలు రకాల పండ్లు, మార్బుల్స్, టైల్స్, పలు రకాల వస్తువుల వాడకంపై ఇండియన్స్ ఆనాసక్తి కనబర్చుతున్నారు. మహారాష్ట్రకు చెందిన ఆపీల్ వ్యాపారులు టర్కీకి చెందిన ఆపిల్ పండ్ల విక్రయాలను నిలిపివేశారు. అంతేకాకుండా తుర్కియే పర్యాటరంగంపై కూడా తీవ్ర ప్రభావం పడింది. ఆదేశానికి విహారయాత్రకు వెళ్లే ఇండియన్స్.. బుకింగ్‌లన్ని రద్దు చేసుకున్నారు. అదేవిధంగా ఆదేశానికి ఎయిర్ సర్వీసులు కూడా తగ్గిస్తున్నట్లు పలు విమాన సర్వీస్ సంస్థలు ప్రకటించాయి. తాజాగా పంజాబ్‌లోని లవ్లీ యూనివర్సీటీ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. తుర్కియే , అజర్‌బైజాన్‌లోని విశ్వవిద్యాలయం సంస్థలతో ఆరు విద్యా భాగస్వామ్యాలను అధికారికంగా ముగించింది. ఇటీవల తలెత్తిన పరిణామాలతో జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఉమ్మడి పరిశోధన ప్రాజెక్టులు, ద్వంద్వ డిగ్రీ కార్యక్రమాలు రెండు దేశాల సంస్థలతో అన్ని ఇతర విద్యా సహకారాలను వెంటనే రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. భారతదేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే ఏ సంస్థతోనూ తాము ఎప్పటికీ కలిసి పనిచేయమని, తమ చర్యతో ఒక శక్తివంతమైన సందేశాన్ని పంపుతున్నామని లవ్లీ యూనివర్సిటీ వీసీ డా. అశోక్ మిట్టల్ అన్నారు.
అంతకుముందు జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU) జాతీయ భద్రతా సమస్యలను పేర్కొంటూ తుర్కియేలోని మలత్యలోని ఇనోను విశ్వవిద్యాలయంతో తన విద్యా ఒప్పందాన్ని నిలిపివేసింది. ఇదే దారిలో, హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దు విశ్వవిద్యాలయం (MANUU) కూడా నిలిచింది. టర్కీలోని యూనస్ ఎమ్రే ఇన్స్టిట్యూట్‌తో చేసుకున్న విద్యాపరమైన అవగాహన ఒప్పందాన్ని (MoU) తక్షణమే రద్దు చేస్తున్నట్లు మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం ప్రకటించింది.