రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో భూముల విషయంలో జరిగిన రికార్డు ఆఫ్ రైట్స్‌లో జరిగిన తప్పి దాలు సరిదిద్దుతామని ప్రకటించింది.అయితే గతప్రభుత్వం రైతుల భూముల స్థిరీకరణ కనితెచ్చిన ”ధరణి” పోర్టల్‌ను పూర్తిగా రద్దుచేసి, దాని కనుసన్నల్లోనే ”భూభారతి” చట్టాన్ని తెచ్చింది. ఎవరు ఏ చట్టం తెచ్చినా అవినీతి రహిత, తప్పులు లేని రెవెన్యూ రికార్డుల వ్యవస్థనుగానీ ఇంతవరకు తెచ్చిన ప్రభుత్వాలు ఏవీ సంపూర్ణంగా స్థిరీకరణ చేయలేదు. అయితే నూతనంగా సుదీర్ఘ కసరత్తు అనంతరం తెచ్చిన ”భూభారతి” ఆపని చేయగలుగుతుందా? భూరికార్డుల ప్రక్షాళన సాధ్యమేనా? ప్రక్షాళన పేరుతో రెవెన్యూ వ్యవస్థ మరింత అవినీతి ఊబిలో కూరుకుపోతుందా!? ఇత్యాది ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకునే ముందు అసలు మన రెవెన్యూ వ్యవస్థ పూర్వపరాల్లోకి వెళ్లాలి. తెలంగాణా రెవెన్యూ వ్యవస్థలో ”బిడ్డసచ్చినా పురిటి వాసన పోలేదన్న”’ సామెత లాగా మన రెవెన్యూ వ్యవస్థ మీద మనదేశాన్ని పరిపాలించిన బ్రిటిష్, మన రాష్ట్రాన్ని ఏలిన నిజాం నవాబుల అవశేషాలు నేటికీ కనిపిస్తున్నాయి. తహశీల్దార్, కలెక్టర్ లాంటి భూమి శిస్తు వసూలు చేసే ఉన్నతాధికారుల హోదాలు, నేడు భూమిశిస్తు వసూలు లేకపోయినా అదే పేర్లతో కొనసాగడం అది బ్రిటిష్ వలస సంస్కృతిలో అంతర్బాగమే! ఇకపోతే తెలంగాణా రెవెన్యూ రికారుల్లో నేటికీ తొంభై శాతం పదాలు ఉర్దూ పదాలే ఉంటాయి.అడంగళ్, పహణీ, రబీ, ఖరీఫ్ ఇలాంటి పేర్లు ఇప్పటికీ భూ రికార్డుల్లో వాడుతున్నాము. ఇకపోతే భూసమగ్ర సర్వే అనేది శతాబ్దకాలంగా జరగకపోవడం అనేది అనేక భూకమతాల మార్పులు చేర్పులు భూరికార్డులు అవకతవకలకు కేంద్రబిందువుగా మారింది. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తెలంగాణా నిజాం రాచరికం నుండి విముక్తి జరిగిన తర్వాత 1954-55లో సమగ్ర భూసర్వే జరిగినప్పటికీ అప్పటికే ఉన్న నిజాం రెవెన్యూ రికార్డులు, సర్వే నెంబర్లను ఆధారంగా చేసుకోవడమే జరిగింది.అటు తర్వాత వచ్చిన రెవెన్యూ మార్పులు కూడా భూరికార్డుల ప్రక్షాళనలో పారదర్శకత లేదు!?
2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత సాదాబైనామాలు(తెల్లకాగితం అగ్రిమెంట్లు)పట్టాలు చేసుకునే అవకాశం కల్పించారు. దీంతో రెవెన్యూ శాఖలో అక్రమ వసూళ్లు పర్వం పెరిగిపోవడం, భూరికార్డులు తారుమారు కావడంతో చిర్రెత్తి పోయిన కేసీఆర్ ఉన్నపళంగా విఆర్‌ఏలను తొలగించి వేశారు. ధరణి పోర్టల్ తెచ్చి పట్టాదారు పాసుపూస్తకాలు పంపిణీ చేశారు.అయితే కేసీఆర్ ఆర్‌ఓఆర్‌లో వందల ఏండ్లుగా రెవెన్యూ రికార్డుల్లో వస్తున్న, అనుభవించారు అనే కాలం తొలగించి కేవలం పట్టాదారు కాలం మాత్రమే ఉంచడం వలన అనేక అనర్థాలు తలెత్తాయి. తెలంగాణాలో ఓ ప్రత్యేక స్థితి ఉంది. వేలాది ఎకరాల భూస్వాములు వదిలివేసిన భూములు, భూదానోద్యమ భూములు, దేవాదాయ శాఖ భూములు పేదలు అనుభవదారులుగా అనేక ఏండ్లుగా సేద్యం చేస్తున్నారు. అనుభవదారు కాలం తొలగించడంతో సేద్యం చేసే వేలాది రైతులు భూమి హక్కులు రికార్డుల నుండి బేదాఖలయ్యాయి.దీంతో పట్టాదారులు తిరిగి కబ్జాల్లోకి రావడంతో గందరగోళం,వివాదాలు ఏర్పడ్డాయి. కోర్టుకేసులు పెరిగిపోయాయి. అంతేకాక తెలంగాణా ప్రభుత్వం వచ్చేవరకు నిర్వహించిన గ్రామస్థాయి రికార్డుల జమాబందీ లేకపోవడం, ధరణి వెబ్‌సైట్ వచ్చిన తర్వాత అంతకుముందు రెవెన్యూ కార్యాలయాలు నిర్వహించిన అడంగల్ పహణీ(నిరంతర భూ రికార్డులు)అఫ్‌డేట్ సైతం 2017నుండి నిలిచిపోవడం, ధరణి పోర్టల్‌లో తప్పులు సరిదిద్దే అవకాశం మండల రెవెన్యూ, డివిజన్ స్థాయి అధికారులకు లేక పోవడంతో రెవెన్యూ రికార్డుల్లో గందరగోళం చోటు చేసుకుంది. చిన్న చిన్న వివాదాలు కూడా పరిష్కారానికి నోచుకోక న్యాయస్థానాల్ని ఆశ్రయించాల్సిన దుస్థితి రైతులకు ఏర్పడింది.
ఇక ప్రస్తుత రెవెన్యూ రికార్డులు గ్రామస్థాయి నుండి ప్రక్షాళన జరగాల్సి ఉంది. తెలంగాణా గ్రామీణ ప్రాంతాల్లో భూములు, స్వాధీనంలో ఉన్న రైతుకు భూమి రికార్డుల్లో లేదు? రికార్డుల్లో భూమి ఉండి కొన్నిచోట్ల భౌతికంగా అక్కడ భూమి లేదు?అది కబ్జాలో కూడా లేదు. ప్రభుత్వ, ఇనాం, దేవాదాయ, చెరువు శిఖం భూములు పట్టాభూములుగా మారిపోయాయి.అవినీతి మూలంగా అనేకమంది రైతుల భూములు సాదా బై నామాలు, పట్టాదారు చనిపోయిన సందర్భంలో వారి సంతకాలు ఫోర్జరీ చేసి భూరికార్డులు తప్పుల తడకలు చేశారు. రైతులను గుప్పిట్లో పెట్టుకుని అవినీతి క్రీడలకు తెరలేపారు.వారిది వీరికి, వీరిది వారికి రాసేశారు? అనేక ఏండ్లుగా సర్వేలేకపోవడం, భూకమతాలు విభజన మూలంగా వైశాల్యంలో చోటుచేసుకున్న మార్పులు ఎక్కువ తక్కువ కొలతలతో ఉన్నాయి.దీన్ని సమగ్ర సర్వే చేయాల్సిన అవసరం ఉన్నది. నిజాం కాలంనాటి సర్వే నెంబర్ స్థానంలో కొత్తది ఇచ్చి పారదర్శకంగా పని జరిపిన సందర్భంలో మాత్రమే గ్రామీణ భూరికార్డుల ”రైట్స్‌ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్” పూర్తి ప్రక్షాళన సాధ్యమవుతుంది. భూభారతి చట్టం తెచ్చిన నూతన తెలంగాణా ప్రభుత్వంపైన చాలా పెద్ద బాధ్యత ఉంది.సమగ్ర భూసర్వే, నూతన సర్వే నెంబర్లను ఇవ్వడం, పారదర్శకంగా భూరికార్డులు రూపకల్పన, భూభారతి హక్కు పత్రాలు పంపిణీ, రెవెన్యూశాఖలో తిరిగి అవినీతి అందలం ఎక్కకుండా చూడడం ఇవన్నీ ఇప్పుడున్న ప్రభుత్వం ముందున్న సవాళ్లు. అయితే గ్రామీణ భూసమస్యపై అవగాహన ఉన్న, ప్రస్తుతం వీఆర్‌ఓ, వీఆర్‌ఎలుగా ఉన్న వారిని నేరుగా గ్రామ రెవెన్యూ సిబ్బందిగా తీసుకోవడంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ ఎందుకు మీనమేషాలు లెక్కిస్తుందో అర్థం కాదు?
ప్రస్తుతం ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న వారికి అపారమైన రెవెన్యూ అనుభవం ఉంది.వారికి పరీక్ష పెడతామనడంలో అర్థం లేదు? పూర్వ విఆర్‌ఓలు జీరో సర్వీసులో జాయిన్ కావాలి లాంటి నిబంధనలతో రెవెన్యూశాఖ తన పనిని తానే సంక్లిష్టం చేసుకుంటుంది. ఇప్పటికైనా ఒకప్పుడు అవినీతిలో అగ్రతాంబూలం అందుకొన్న రెవెన్యూ శాఖకు పూర్తి భూతాళాలు అప్పగించేటప్పుడు రైతులు, పట్టాదారులతో ప్రతివిషయం అనుసంధానం చేస్తూ ఉత్తర్వులు రూపొందించాల్సి ఉంటుంది. అవినీతి ఆరోపణలు వచ్చిన సందర్భంలో పైఅధికారుల విచారణ తూతూ మంత్రం తంతుకు సమస్యను అప్పగిస్తే అవినీతి తిమింగలాలు తిరిగి రెవెన్యూ శాఖను భ్రష్టు పట్టించడానికి ఎంతో సమ యం పట్టదు? కనుక రెవెన్యూశాఖలో అవినీతి లేకుండా భూ యజమాని, రైతుకు ప్రతిఏటా తమ సాగుభూముల వివరాలు, విస్తీర్ణం తెలియ జేసే చర్యలు చేపట్టాలి.ఏమైనా అవినీతి ఫిిర్యాదులు వచ్చినప్పుడు విచారణ జరిపి చర్యలు తీసుకునే విధంగా పారదర్శక రెవెన్యూ విధానం తేవాల్సిన అవసరం ఉంది.అదే విధంగా వారసులు భూమిని తమ పేరుతో మార్చుకునే సందర్భంలో అమ్మకం కొనుగోలు లాగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కాకుండా ఖర్చులేని సరళ ప్రక్రియ తేవాలసిన అవసరం ఉంది.సాగుభూములకు ప్రభుత్వ విలువ నిర్ధారించడంలో కూడా శాస్త్రీయత లేదు? ప్రభుత్వానికి నిధులు అవసరం అయిన ప్రతిసారీ భూ విలువలు వెంటవెంటనే పెంచడం సరైంది కాదు! దానికి ఒక కొలమానంతో కూడిన కాలపరిమితి అవసరం!? నామినల్ భూమి శిస్తు వసూలు చేయడం వలన రైతు భూమికి రక్షణ చేకూరుతుంది.అయితే కౌలురైతు నిర్ధారణకు సైతం శాశ్వత ప్రాతిపదిక రూపొందిం చాల్సిన అవసరం ఉంది.ఎందుకంటే రోజురోజుకూ కౌలురైతుల సంఖ్య రాష్ట్రంలో పెరిగిపోతున్నది. రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన అనేది ప్రభుత్వం ముందున్న పెద్ద సవాల్!? కనుక ఇకనైనా రైతుల భూరికార్డులు పారదర్శకంగా ఉండి.అవినీతి రహిత, పైరవీ అవసరం లేని రెవెన్యూ వ్యవస్థ అవసరం. కేవలం ”భూభారతి ”పేరుమార్పుకు పరిమితం కాకుండా వినూత్న మార్పులకు రెవెన్యూ వ్యవస్థలో శ్రీకారం చుట్టాలి.
ఎన్.తిర్మల్
9441864514
భూరికార్డుల ప్రక్షాళన: ప్రభుత్వానికి ఓ సవాల్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES