నవతెలంగాణ-హైదరాబాద్: ఏండ్ల తరబడి సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాలని ట్రంప్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఉక్రెయిన్, రష్యా అధ్యక్షులతో ఇప్పటికే పలుమార్లు భేటీ అయ్యారు. దీంతో ఇరుదేశాల మధ్య కొంతమేరకు కాల్పుల విరమణతో ట్రంప్ విజయం సాధించారు. శాశ్వత పరిష్కారం దిశగా ట్రంప్ తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల పుతిన్‌తో ట్రంప్ ఫోన్ కాల్‌లో మాట్లాడారు. ఆ సమయంలోనే హంగరీలో మరోసారి భేటీ అవ్వాలని ఇరువురు నేతలు నిర్ణయించుకున్నారు. అయితే ఈ సమావేశం వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెరికా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
ఇరుదేశాల అధ్యక్షుల సమావేశానికి ముందు అమెరికా, రష్యా విదేశాంగ మంత్రులు మార్కో రూబియో, సెర్గీ లావ్రోవ్‌ల మధ్య సమావేశం జరగాల్సి ఉంది. అయితే ఇది నిరవధికంగా వాయిదా పడిందని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. అధ్యక్షుల సమావేశానికి సంబంధించి ఏర్పాట్లలో భాగంగా నిర్మాణాత్మక చర్చలు జరిపేందుకుగాను వీరు భేటీ కావాల్సి ఉందని రష్యా తెలిపింది.
ఈ సమావేశం నిలిచిపోవడానికి గల కారణాలు స్పష్టంగా తెలియలేదు. ఈ క్రమంలోనే రూబియో, లావ్రోవ్‌లు సోమవారం ఫోన్‌లో మాట్లాడుకున్నారు. యుద్ధానికి శాశ్వత పరిష్కారం ఇచ్చేందుకు.. రష్యా, అమెరికాల మధ్య సహకారానికి సంబంధించి ఈ భేటీ ప్రాముఖ్యతను రూబియో చెప్పినట్లు స్టేట్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.