– టెస్కో షోరూంల పని తీరును మెరుగుపరచాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
చేనేత కార్మికుల వ్యక్తిగత రుణాల వెరిఫికేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని వ్యవసాయ, చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. వెంటనే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని సూచించారు. గురువారం హైదరాబాద్‌లోని సచివాలయంలో చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పని తీరుపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా జౌళిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ జౌళి శాఖ అమలు చేస్తున్న వివిధ పథకాలకు సంబంధించిన పురోగతిని మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్ల నుంచి అవసరమైన వస్త్రాల కోసం సెప్టెంబర్ నెలలోగానే ఆర్డర్లు తెప్పించుకోవాలని కోరారు.
ఇప్పటికే ఆరర్లు ఇచ్చిన ప్రభుత్వ శాఖలకు దుస్తుల పంపిణీ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. టెస్కో నుంచి సంఘాలకు వస్త్రాల ఉత్పత్తికి వర్క్ ఆర్డర్లను వెనువెంటనే అందజేయాలని కోరారు. సకాలంలో వస్త్రాల ఉత్పత్తి జరిగేటట్టుగా చర్యలు తీసుకోవాలన్నారు. టెస్కో షోరూంల పనితీరును మెరుగుపరిచి లాభాల బాటలో నడిపించేందుకు తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు. నష్టాలలో ఉన్న టెస్కో షోరూంలను లాభాలలో ఉన్న షోరూంల్లో విలీనం చేయాలని సూచించారు. అనంతరం భారత ప్రభుత్వం చేనేత, జౌళి మంత్రిత్వ శాఖ ప్రకటించిన జాతీయ చేనేత పురస్కారం-2024కి ఎంపికైన యాదాద్రి జిల్లా, సంస్థాన్ నారాయణపురం మండలం, పుట్టపాక గ్రామానికి చెందిన గజం నర్మద, గూడ పవన్‌ను మంత్రి తుమ్మల శాలువతో సన్మానించారు. సమావేశంలో చేనేత జౌళిశాఖ అడిషన్ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.