నవతెలంగాణ-హైదరాబాద్: (ఎన్డీయే) ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్(67) పేరును ఖరారు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై డీఎంకే స్పందించింది. రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందిన వ్యక్తి అయినప్పటికీ ఈ నిర్ణయం వల్ల తమ రాష్ట్రానికి ప్రయోజనం ఉండదని ఆ పార్టీ సీనియర్ నేత టీకేఎస్ ఇళంగోవన్ అన్నారు. తమకు ఎలాంటి ప్రయోజనం లేనప్పుడు రాధాకృష్ణన్ అభ్యర్థిత్వానికి మద్దతివ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఉప రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఇండియా బ్లాక్ తీసుకున్న నిర్ణయానికే తమ పార్టీ కట్టుబడి ఉంటుందని స్పష్టంచేశారు.
కొంతకాలంగా తమిళనాడు ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. పాఠశాలల్లో త్రిభాషా విధానం, కేంద్ర నిధుల్లో కోత, భాషా వివాదం, రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి (RN Ravi) ప్రవర్తన వంటి విషయాల్లో ఇరువైపుల నుంచి పరస్పర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దక్షిణాది రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను కేంద్రం హరిస్తోందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పలుమార్లు ఆరోపిస్తున్నారు.