నవతెలంగాణ న్యూఢిల్లీ: లోక్ సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి ఈసీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపుపై తీవ్రంగా మండిపడిన ఆయన, దీనిని ప్రజాస్వామ్యంపై పడిన హైడ్రోజన్ బాంబుగా వర్ణించారు. గురువారం మీడియాతో మాట్లాడిన రాహుల్, ఇది కేవలం ఓ జాబితా సమస్య కాదని, లక్షలాది మంది ఓటర్ల హక్కులపై జరుగుతున్న కుట్రగా అభివర్ణించారు. ఎన్నికల ప్రక్రియలో తేడాలు, అక్రమాలు సరిచేయాల్సిన సమయం వచ్చిందని, ఈ చీకటి రాజకీయం గురించి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు.
వ్యక్తులతో సంబంధం లేకుండా సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి కేంద్రీకృత పద్ధతిలో ఓటర్ల తొలగింపులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఓట్లను తొలగించడానికి ప్రతి బూత్ నుండి మొదటి పేరును ఆటోమేటెడ్ ప్రోగ్రామ్ ఎంచుకుందని, రాష్ట్రం వెలుపలి నుండి మొబైల్ నంబర్‌లను నకిలీ దరఖాస్తులను దాఖలు చేయడానికి ఉపయోగించారని ఆయన పేర్కొన్నారు. ఇది స్థానిక పార్టీ కార్యకర్తల పని కాదని, పెద్ద ఎత్తున, కేంద్రీకృత సమన్వయంతో కూడిన ఆపరేషన్ అని రాహుల్ గాంధీ నొక్కి చెప్పారు.
కర్ణాటకలోని ఆలంద్ నియోజకవర్గంలో 6,000 ఓట్లను నకిలీ లాగిన్‌ల ద్వారా తొలగించారు. ఈ ప్రక్రియలో సాఫ్ట్‌వేర్ ఉపయోగించి, నకిలీ అప్లికేషన్‌లు, తప్పుడు ఫోన్ నంబర్లు ఉపయోగించి దాఖలు చేశారని రాహుల్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశం ఉన్న బూత్‌లను లక్ష్యంగా చేసుకుని ఈ ఓట్ల తొలగింపు జరిగిందని రాహుల్ గాంధీ అన్నారు. ఈ చర్యలు తమ పార్టీని బలహీనపరచడానికి జరిగాయని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అలాంటి ప్రజాస్వామ్య విధ్వంసకులను రక్షిస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు.