నవతెలంగాణ-హైదరాబాద్ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు బుధవారం కొట్టివేసింది. గతంలో నమోదైన పరువునష్టం కేసులో శిక్ష పడటం, ఆయన పౌరసత్వానికి సంబంధించి అపరిష్కృతంగా ఉన్న ప్రశ్నలను కారణంగా చూపుతూ ఈ పిటిషన్ దాఖలైంది. అయితే, పిటిషనర్ వాదనలను తోసిపుచ్చిన న్యాయస్థానం రాహుల్ గాంధీకి అనుకూలంగా కీలక వ్యాఖ్యలు చేసింది.
రాహుల్ గాంధీ పౌరసత్వం ఆధారంగా ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసేందుకు ఎలాంటి బలమైన, అధికారిక ఆధారాలను పిటిషనర్ కోర్టు ముందుంచలేదని ధర్మాసనం స్పష్టం చేసింది. “ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసేంతటి స్పష్టమైన ఆధారాలేవీ మా ముందు ఉంచలేదు” అని కోర్టు వ్యాఖ్యానించింది. అంతేకాకుండా, రాహుల్ గాంధీ పార్లమెంటరీ కార్యకలాపాల్లో పాల్గొనకుండా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్దిష్ట నిర్ణయం తీసుకోలేదని కూడా హైకోర్టు ప్రస్తావించింది.
ఈ విచారణ సందర్భంగా రాహుల్ గాంధీ పౌరసత్వానికి సంబంధించిన అంశాన్ని ముగించడానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కాలపరిమితి నిర్దేశిస్తూ ఆదేశాలు జారీ చేయలేదని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఇక పరువునష్టం కేసుకు సంబంధించిన శిక్షపై సుప్రీంకోర్టు ఇప్పటికే స్టే విధించిందని, అందువల్ల, రాహుల్ గాంధీ పదవిలో కొనసాగే అర్హతను సవాలు చేస్తూ (కో వారంటో రిట్) దాఖలు చేసిన పిటిషన్‌కు బలం చేకూరదని న్యాయస్థానం అభిప్రాయపడింది. “అనర్హతకు సంబంధించిన ఆరోపణలపై ఇప్పటికే ఉన్నత న్యాయస్థానం రక్షణ కల్పించిన నేపథ్యంలో ఈ కోర్టు అలాంటి ఉపశమనంపై విచారణ చేపట్టదు” అని ధర్మాసనం స్పష్టం చేసింది.
శిక్షకు సంబంధించిన ప్రధాన అభ్యర్థనను పిటిషనర్ స్వచ్ఛందంగా ఉపసంహరించుకున్నారని, అందుకే ఆ పిటిషన్ భాగాన్ని “విచారణకు పట్టుబట్టడం లేదు” (నాట్ ప్రెస్డ్)గా పరిగణించి కొట్టివేస్తున్నట్లు కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తుల వల్ల ఎలాంటి స్పష్టమైన ఫలితం రాలేదని కోర్టు గమనించింది. అయితే, ఇప్పటికే చేసిన చట్టబద్ధమైన విజ్ఞప్తి ఏదైనా ఉంటే, దానిని సంబంధిత అధికారం చట్ట ప్రకారం పరిశీలించవచ్చని స్పష్టం చేసింది.
రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వంపై పిటిషన్ కొట్టివేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES