నవతెలంగాణ-హైదరాబాద్: భారత్, పాకిస్తాన్‌ల మధ్య కాల్పుల తాజా పరిణామాలపై చర్చించేందుకు వెంటనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నేత ఖర్గేలు ప్రధాని మోడీకి లేఖ రాశారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, సరిహద్దు కాల్పుల్లో తాజా పరిణామాలపై పార్లమెంట్‌లో చర్చ జరపాలని లేఖలో పేర్కొన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సమిష్టి సంకల్పాన్ని ప్రదర్శించేందుకు పార్లమెంట్ ఉభయ సభలు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
”పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాల ఏకగ్రీవ అభ్యర్థనను నేను పునరుద్ఘాటిస్తున్నాను. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ మరియు అమెరికా అధ్యక్షులు ట్రంప్ మొదట ప్రకటించిన కాల్పుల విరమణపై ప్రజల తరపున వారి ప్రతినిధులుగా చర్చించడం చాలా ముఖ్యం. రాబోయే సవాళ్లను ఎదుర్కోవడానికి మన సమిష్టి సంకల్పాన్ని ప్రదర్శించడానికి కూడా ఇది ఒక అవకాశం అవుతుంది. ఈ డిమాండ్‌ను మీరు తీవ్రంగా మరియు త్వరగా పరిశీలిస్తారని ఆశిస్తున్నాను ’’ అని రాహుల్‌గాంధీ తన లేఖలో పేర్కొన్నారు.
తాజా పరిణామాలపై పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలనే అన్ని ప్రతిపక్ష పార్టీల ఏకగ్రీవ అభ్యర్థన గురించి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇప్పటికే మీకు లేఖ రాశారు. మొదటి వాషింగ్టన్ డిసి నుండి తరువాత భారత్, పాక్ ప్రభుత్వాల నుండి కాల్పుల విరమణ ప్రకటనలు వెలువడ్డాయని ఖర్గే లేఖలో పేర్కొన్నారు.