– ప్రయాణికుల భద్రతపై రక్షణ చర్యలు తీసుకోవాలి : సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్
– నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద ధర్నా
నవతెలంగాణ-సిటీబ్యూరో/సుల్తాన్ బజార్
రైల్వేల ప్రయివేటీకరణను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెంటనే ఆపాలని, ప్రయాణికుల రక్షణ, ప్రమాదాల నివారణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్ డిమాండ్ చేశారు. ఉద్యోగులకు రక్షణ కల్పించాలన్నారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన భారతీయ రైల్వేలను అదానీ, అంబానీ వంటి స్వదేశీ, విదేశీ ప్రయివేట్ కార్పొరేట్లకు కట్టబెట్టొద్దని, ప్రయాణికుల భద్రతకు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ విధానంలో భాగంగా భారతీయ రైల్వేలను స్వదేశీ, విదేశీ కార్పొరేట్ శక్తులకు అప్పనంగా కట్టబెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వేల ప్రయివేటీకరణ వల్ల సామాన్య ప్రజానీకం అతిచవకైన రవాణా సౌకర్యం కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఇప్పటికే రైల్వే యాజమాన్యం ప్యాసింజర్ రైళ్లను తగ్గించిందని, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో జనరల్ బోగీలను తగ్గించిందని వివరించారు.
వందే భారత్ ట్రైన్‌లను ప్రవేశపెట్టి టికెట్ల ధరలు అధికంగా పెంచి సామాన్య, మధ్యతరగతి ప్రజలకు వాటిని దూరం చేసిందన్నారు. రైల్వేలలో ప్రయాణికుల రక్షణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని విమర్శించారు. ఈ మధ్యకాలంలో అనేక ప్రమాదాలు జరిగి ప్రయాణికులు ప్రాణం కోల్పోయారని, ఉద్యోగస్తులూ ప్రాణం కోల్పోయారని తెలిపారు. రైల్వేలలో రక్షణ కోసం అధునాతనమైన టెక్నాలజీ రక్షక్, కవచ్ వంటివి వాడతామని ప్రభుత్వం చాలాసార్లు చెప్పినా వాటికి నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యం వహిస్తోందన్నారు.
రైల్వేలో దేశవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది కాంట్రాక్ట్ కార్మికులు పని చేస్తున్నారని తెలిపారు. వారికి చట్టపరమైన హక్కులు కల్పించకుండా రైల్వే యాజమాన్యం, కాంట్రాక్టర్లు వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనాలు చెల్లించడంలో ఈఎస్‌ఐ, పీఎఫ్, బోనస్, పే స్లిప్పులు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. హైదరాబాద్ రైల్వేస్టేషన్‌లో గతంలో 150 మంది పనిచేయగా, నేడు కేవలం 27 మందితో పని చేయించుకుంటూ పని భారం పెంచారన్నారు. వెంటనే రైల్వేల ప్రయివేటీకరణ ఆపాలని, ఉద్యోగులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు చట్టపరమైన హక్కులు కల్పించాలని కోరారు. లేనిపక్షంలో రైల్వేల రక్షణ కోసం పెద్దఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కార్మికుల హక్కుల పరిరక్షణకు ఈనెల 20న జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెలో రైల్వే ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి ఎం.వెంకటేష్, రైల్వే సీనియర్ నాయకులు శివకుమార్, ఎల్లయ్య, సీఐటీయూ నాంపల్లి జోన్ కన్వీనర్ సి.మల్లేష్, నాయకులు హర్షద్ అహ్మద్, ఎం.యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
రైల్వేల ప్రయివేటీకరణ చర్యలు ఆపాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES