– వచ్చే మూడ్రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు
– ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ
– మిగతా జిల్లాలకు ఎల్లో…
– ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షం
– మంగపేటలో 11.45 సెంటీమీటర్ల వాన
– మహబూబ్‌నగర్ వరకు విస్తరించిన నైరుతి రుతుపవనాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి డాక్టర్ కె.నాగరత్న హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం.. జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, జనగాం, సిద్దిపేట, గురువారం..జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలుండటంతో ఆరెంజ్ హెచ్చరిక జారీ చేశారు. మిగతా జిల్లాలకు ఎల్లో హెచ్చరిక విడుదల చేశారు. రాబోయే 48 గంటల పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగరంలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఉదయం వేళలో పొగమంచు ఎక్కువగా ఉంటోంది. సాయంత్రం, రాత్రి సమయాల్లో వానలు పడే సూచనలున్నాయి. నైరుతి రుతుపవనాలు విస్తరణ ఆశాజనకంగా ఉంది. మంగళవారం దక్షిణ తెలంగాణలోని మహబూబ్‌నగర్ వరకు వ్యాప్తి చెందాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అయితే, దానికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తెలంగాణకు దూరంగా తరలిపోతున్నందున పెద్దగా ప్రభావం ఉండదు. రాష్ట్రంలో మంగళవారం ఉదయం 8:30 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు 529 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మంగళవారం పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. 23 ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం ఖాసీంపేటలో అత్యధికంగా 11.45 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది.
అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలు
మంగపేట(ములుగు) 11.45 సెంటీమీటర్లు
ఖాసీంపేట(కరీంనగర్) 11.43 సెంటీమీటర్లు
్లగుండాల(భదాద్రి కొత్తగూడెం) 11.35 సెంటీమీటర్లు
మల్లూర్(ములుగు) 10.90 సెంటీమీటర్లు
నాంపల్లి (రాజన్నసిరిసిల్ల) 10.78 సెంటీమీటర్లు
గూడూరు(జనగామ) 10.30 సెంటీమీటర్లు
తిరుమలాపూర్(జగిత్యాల) 10.28 సెంటీమీటర్లు
జాజిరెడ్డిగూడెం(సూర్యాపేట) 10.28 సెంటీమీటర్లు
ఫణిగిరి(సూర్యాపేట) 9.75 సెంటీమీటర్లు
మర్రిగడ్డ(రాజన్నసిరిసిల్ల) 8.78 సెంటీమీటర్లు
ఉట్నూర్(ఆదిలాబాద్) 8.2 సెంటీమీటర్లు
వానలే వానలు…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES