Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeమానవిసోద‌ర ప్రేమ‌కు ప్ర‌తీక రాఖీ పూర్ణిమ‌..

సోద‌ర ప్రేమ‌కు ప్ర‌తీక రాఖీ పూర్ణిమ‌..

- Advertisement -

రాఖీ, రక్షా బంధన్‌, రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగ కుటుంబ బాంధవ్యాలలోని మాధుర్యానికి చిహ్నం. సోదర సోదరీమణుల మధ్య ఆత్మీయతా అనుబంధం పెంచేది ఈ రాఖీ పండుగే. ఆడబిడ్డలు తమ సోదరులను ఇంటికి ఆహ్వానించి రాఖీ కడతారు. అక్కాచెల్లెళ్ళకు అన్నదమ్ముల అనురాగం జీవితాంతం ఉండవలసిన
బంధం. అటువంటి బంధానికి గుర్తుగా జరుపుకునే రాఖీ పండుగతో కొందరి అనుబంధం…

రాఖీ పండుగని ఒక్కప్పుడు ఉత్తర భారత దేశంలో ఎక్కువగా జరుపుకునేవారు.కాల క్రమేణా దేశవ్యాప్తంగా జరుపుకోవడం ప్రారంభించారు. సొంత సోదరులు లేకపోయినా బంధువులలో సోదర వరుస అయ్యే వారికి, సోదర భావంతో చూసేవారికి రాఖీ కట్ట వచ్చు. ఈ పండగకు ధనిక,పేద, కులం, మతం అనే భేద భావం లేదు. అందరూ సమానమే. ప్రేమ, ఆప్యాయత ఉంటే చాలు. అక్క చెల్లెల్లు సుఖ సంతోషాలతో ఉండాలని సోదరులు, తమ సోదరుల ప్రేమ ఆప్యాయతలు చిరకాలం ఇలాగే ఉండాలని, వారూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని సోదరీమణులు మనసారా కోరుకుంటారు. సోదరులు ఇచ్చిన కానుకలను ఎంతో సంతోషంగా స్వీకరించి ఆనందిస్తారు. ప్రతి ఏడాదిలా ఈ రాఖీ పండుగను కూడా అందరూ సంతోషంగా జరుపుకోవాలి. సోదరుల ప్రేమ ఆప్యాయత అక్క చెల్లెళ్లకు చిరకాలం లభించాలి.
– పాలపర్తి సంధ్యారాణి
రాఖీ ప్రత్యేకం
నాన్న ఎన్‌.వి రాఘవ లక్ష్మీనారాయణ రావు, ఉస్మానియా యూనివర్సిటీలో సివిల్‌ ఇంజనీరింగ్‌ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్‌గా చేసేవారు. అమ్మ రాఘవ సీత. నాకు ఇద్దరు అన్నయ్యలు, ఒక అక్క. ఒక తమ్ముడు. నాకు అన్నదమ్ములు, అక్క తోటి మంచి అనుబంధం ఉంది. అయితే రెండో అన్నయ్య రమణతో అనుబంధం మరింత ఎక్కువ. కారణం అన్నయ్య బాగా చదువుకున్నాడు. అతన్ని చూసే చదువు పట్ల నాకు శ్రద్ధ పెరిగింది. చదువు విషయంలో నాకు స్ఫూర్తి అన్నయ్యనే. స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగాడు. వయసులో కూడా మాకు పెద్దగా తేడా లేదు. దాంతో దెబ్బలాటలు కూడా బాగానే ఉండేవి. తను ఏది కావాలనుకుంటే నేనూ అదే కావాలని పేచీ పెట్టేదాన్ని. మాకు చదువుకోవడానికి ఒక గది మాత్రమే ఉండేది. ఆ గదిలో కూర్చుని పెద్దగా చదువుకునే వాళ్ళం, ఈ పెద్దగా చదువుకుంటున్నప్పుడు డిస్టబెన్స్‌ వల్ల దెబ్బలాడుకునే వాళ్ళం. చదువు విషయంలో చిన్నన్నయ్య చాలా సపోర్ట్‌ చేసేవాడు. పండగలన్నీ ఉన్నంతలో సరదాగా జరుపుకునేవాళ్లం. ముఖ్యంగా రాఖీ పండగ అంటే ఇది ఉత్తర భారతదేశానికి చెందింది. మేము కొన్నేండ్లు బీహార్‌లో ఉండటం వల్ల అక్కడ రాఖీ పండగ బాగా జరుపుకునే వాళ్ళు. మేము కూడా మా ముగ్గురు అన్నదమ్ములకి రాఖీ కట్టే వాళ్ళం. చిన్నతనంలో వాళ్ళ పాకెట్‌ మనీ లోంచి డబ్బులు తీసి మాకు ఇచ్చేవారు. నాకు మెడీసీన్లో సీటు వచ్చినప్పుడు అన్నయ్య చాలా సంతోషపడ్డాడు. ఎందుకంటే మా చుట్టాల్లో అమ్మాయిలు ఎవరూ మెడిసిన్‌ చేసినవాళ్లు లేరు. ఇప్పుడు ఉద్యోగాల రీత్యా దూర దూరాల్లో ఉంటున్నాం. వెళ్లి కట్టడానికి సమయం కుదరటం లేదు. ఇప్పుడు సోషల్‌ మీడియా ద్వారానే రాఖీలను పంపించుకోవడం, శుభాకాంక్షలు తెలుపుకోవడం. అయితే కష్టసుఖాల్లో మాత్రం అందరం ఒకరికొకరు తోడై ఉంటాం.
డా.పద్మావతి, గైనకాలజిస్ట్‌.
మాటల్లో చెప్పలేని అనుబంధం
మా సొంత ఊరు హైదరాబాద్‌. అమ్మ ఆదిలక్ష్మి. నాన్న సీతారామయ్య, ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్లో డ్రైవర్‌గా చేసేవారు. మేము వారికి ఇద్దరం సంతానం. నాకు ఓ తమ్ముడు. పేరు సునీల్‌ కృష్ణ. చిన్నప్పటి నుంచి నాకూ తమ్ముడికి ఎప్పుడు ఆటలు, కొట్లాటలు. ఒక్కోసారి మాట్లాడుకోకుండా ఉండేవాళ్ళం. మళ్లీ వెంటనే కలిసి పోయేవాళ్ళం. మా ఇద్దరిలో ఒక విషయం మాత్రం కామన్‌. ప్రతిరోజు నాన్న కోసం ఎదురు చూడటం. నాన్న డ్యూటీ నుంచి చాలా ఆలస్యంగా వచ్చేవారు. ఎప్పుడో కానీ ఆయన్ని చూసే అవకాశం వచ్చేది. ఇక దీపావళి పండగ వచ్చిందంటే మాత్రం వాడికేమో బాంబులు కావాలి. నాకేమో అవంటే పరమ ఎలర్జీ. నాకేమో చిచ్చుబుడ్లు, భూచక్రాలు, కాకరపువ్వొత్తులు కావాలి. రాను రాను వాడితో పాటు బాంబులు కాల్చడం నాకూ అలవాటై పోటీపడి కాల్చేవాళ్లం. ఇక సంక్రాంతి పండగొచ్చిందంటే పతంగులు ఎగరేయటం. నేను వాడితో పాటుగా పతంగులు ఎగరేయడానికి వెళ్లేదాన్ని. నన్ను ఇంట్లో తమ్ముడితో సమానంగా పెంచడం వల్ల నా ఆటలన్నీ ఇలాగే ఉండేవి. మేము ఉండే దగ్గరలో పొలాలు ఉండేవి. ఆ పొలాల్లోకి వెళ్లిపోయి పతంగులు ఎగర వేసేవాళ్లం. మా తమ్ముడి ఫ్రెండ్స్‌ అందరూ కూడా నాకు తమ్ముళ్లే. అందరం కలిసి పోటీపడి పతంగులు ఎగరేసేవాళ్లం. నేను తమ్ముడు కలిసి తొక్కుడు బిళ్ళ ఆడుకునే వాళ్లం. మగ పిల్లలు ఆడే ఆటలన్నీ నేను వాడితో ఆడే దాన్ని. అలాగే వాడు ఆడపిల్లలు ఆడే ఆటలన్నీ నాతో ఆడేవాడు. వాడికి జ్వరం వచ్చి ఇంట్లో ఉంటే పాఠాలు మిస్‌ కాకూడదని వాడి ఫ్రెండ్స్‌ దగ్గరకెళ్లి నోట్స్‌లు తీసుకొచ్చి నేనే రాసి పెట్టేదాన్ని. ఇక రాఖీ పండుగ వచ్చిందంటే పెండ్లికి ముందు మాత్రం ఇద్దరం కలిసి బయటికి వెళ్లి లంచ్‌ చేసే వాళ్లం. వాడితో పాటు ఇంకో ముగ్గురు ఫ్రెండ్స్‌ కూడా వచ్చేవాళ్లు. అక్కడ నుంచి సెకండ్‌ షో సినిమా చూసుకొని ఇంటికి వచ్చేవాళ్లం. ఇంటికి వచ్చాక చివాట్లు, తన్నులు. పెళ్లి తర్వాత సెలవులు వస్తే వాడు నా దగ్గరికి వస్తాడు. వాడికి ఇష్టమైనవన్నీ చేసిపెట్టి వాడి కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఒకవేళ రాఖీనాడు సెలవు లేక బిజీగా ఉన్నాడంటే నేనే వాడి దగ్గరికి వెళ్లి రాఖీ కట్టి వస్తాను. నాకు యాక్సిడెంటై కోమాలో ఉన్నప్పుడు, వాడు అన్నీ మానేసుకొని నా కోసం ఎంతో చేశాడు. వాడితో నాకున్న అనుబంధం మాటల్లో చెప్పలేను. వాడు ఇద్దరు పిల్లల తండ్రైనా నాకు చిన్నపిల్లాడే.
లక్ష్మీ మాధవి, సైబర్‌ క్రైమ్స్‌ ఇనిస్పెక్టర్‌
తమ్ముడితో అనుబంధం
మా సొంతూరు తూర్పుగోదావరి జిల్లాలోని శరభవరం గ్రామం. అల్లూరి సీతారామరాజు ప్రాంతం. నాన్న శరభవరంతో పాటు తొమ్మిది పల్లెలలకు గ్రామాధికారి (కరణం). మేము ముగ్గురం అబ్బాయిలం, ఐదుగురు అమ్మాయిలం. నేనే పెద్దదాన్ని. చినవీరభద్రుడు మా మూడో తమ్ముడు. ప్రపంచ సాహిత్యం గురించి విమర్శనా త్మకమైన పుస్తకాలు రాస్తూ గొప్ప కథకుడిగా, విమర్శకుడిగా, అనువాదకుడిగా, వక్తగా గుర్తింపు పొందాడు. చిన్నప్పుడు మా ఊళ్లో సంక్రాంతి వస్తే నాతో సమానంగా వాకిట్లో ముగ్గులు పెట్టేవాడు. చిత్రకారుడు కాబట్టి ముగ్గు పిండి పోత సన్నగా వచ్చి ముగ్గుగా మారేది. బయటికి వెళ్లి ఆడిన ఆటలు తక్కువ. నేను రాజమండ్రిలో లైబ్రరీ నుంచి తెచ్చుకున్న పుస్తకాలన్నీ చిన్న వయసులోనే చదివేవాడు. నేను హాస్టల్‌ నుంచి ఇంటికి వెళితే నాతోనే ఉండేవాడు. తను పదేండ్ల వయసులో మా ఊరికి చాలా దూరంగా ఉండే తాడికొండ రెసిడెన్షియల్‌ స్కూల్‌కి వెళ్లినప్పుడు బెంగపెట్టు కున్నాను. ఇంత చిన్న వాడు హాస్టల్లో ఎలా ఉంటాడో అనుకునేదాన్ని. కానీ ఆ స్కూల్లోనే ప్రపంచమంటే ఏంటో తెలుసుకున్నాడు. అయితే అప్పట్లో ఇల్లు వదిలిపెట్టిన వెళ్లిన ఆ బెంగ 60 ఏండ్లు దాటిన తర్వాత కూడా పోలేదు. అతని హోమ్‌ సిక్నెస్‌ అంతా తర్వాత కవిత్వంగా మారింది. చిన్న వీరభద్రుడే కాకుండా ఏడుగురు తమ్ముళ్లూ చెల్లెళ్లూ అందరం వాస్తవాన్ని ప్రేమిస్తూనే కవితాత్మక జీవితాన్ని ఇష్టపడతాం. ఎంతో కలివిడిగా ఉంటాం. సాహిత్యంలో నన్ను ప్రభావితం చేసింది మా అక్కనే అని చెప్తుంటాడు. అయితే గత కొన్నేండ్లుగా ప్రపంచ సాహిత్యాన్ని మధిస్తూ తనే నన్ను ప్రభావితం చేస్తున్నాడు.
వాడ్రేవు వీరలక్ష్మి దేవి, రచయిత్రి

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img