నవతెలంగాణ – రాయపోల్
రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన భౌతిక శాస్త్ర ప్రతిభా పోటీల్లో రాంసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని శ్రీనిధి సరికొత్త చరిత్ర సృష్టించిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజ్ కుమార్ తెలిపారు. గురువారం హైదరాబాద్ గంగా ఆడిటోరియంలో స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, ఫిజికల్ సైన్స్ ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో వందలాది మంది విద్యార్థులు పాల్గొని ప్రతిభ చాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ప్రతిభ, మేధస్సుతో పోటీలో సత్తా చాటిన శ్రీనిధి రాష్ట్ర స్థాయిలో తృతీయ బహుమతిని కైవసం చేసుకుని రాంసాగర్ పాఠశాలకు గౌరవం తెచ్చిందన్నారు. ఈ సందర్భంగా ఆమెను, గైడ్ టీచర్ నరేందర్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ అరుదైన విజయంపై ఉపాధ్యాయులు యాదయ్య, నవీన్ కుమార్, మహేష్ కుమార్, శ్యామ్ సుందర్ శర్మ, మంజుల, సుజాత, ఉమారాణి, పీఈటీ అనీఫ్, సీఆర్‌పీ స్వామి గౌడ్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామీణ పాఠశాలల విద్యార్థులు కూడా రాష్ట్రస్థాయిలో రాణించగలరని శ్రీనిధి నిరూపించిందని పలువురు అభిప్రాయపడ్డారు.



