Thursday, July 24, 2025
E-PAPER
Homeఆటలురాణించిన జైస్వాల్‌, కెఎల్‌ రాహుల్‌

రాణించిన జైస్వాల్‌, కెఎల్‌ రాహుల్‌

- Advertisement -

తొలి వికెట్‌కు 94పరుగుల భాగస్వామ్యం

మాంచెస్టర్‌: మాంచెస్టర్‌ వేదికగా ఇంగ్లండ్‌తో ప్రారంభమైన నాలుగో టెస్ట్‌తో టీమిండియా ఓపెనర్లు శుభారంభం అందించారు. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారతజట్టును కెఎల్‌ రాహుల్‌, జైస్వాల్‌ ఆదుకున్నారు. ఆ తర్వాత సాయి సుదర్శన్‌ కూడా రాణించడంతో భారతజట్టు 60 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఆ సమయానికి పంత్‌(17), సాయి సుదర్శన్‌(39) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు తొలి సెషన్‌లో ఓపెనర్లు కెఎల్‌ రాహుల్‌-జైస్వాల్‌ కలిసి 25 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 76 పరుగులు చేశారు. కేఎల్‌ రాహుల్‌ 39, యశస్వి జైస్వాల్‌ 35 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. తొలి సెషన్‌లో ఇంగ్లండ్‌ బౌలర్లు ఎంత కష్టపడినా ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయారు. రాహుల్‌, జైస్వాల్‌ ఆచి తూచి ఆడుతూ.. అందివచ్చిన బంతులను బౌండరీలకు తరలిస్తూ గట్టి పునాది వేశాఉ. వీరిద్దరూ తొలి వికెట్‌కు 94 పరుగులు జతచేశారు. రెండో సెషన్‌లో ఇంగ్లండ్‌కు ఊరట లభించింది. కెఎల్‌ రాహుల్‌(46) వికెట్‌ను క్రిస్‌ వోక్స్‌ పడగొట్టాడు. ఆ తర్వాత యశస్వి జైస్వాల్‌(58) అర్ధసెంచరీ పూర్తయ్యాక డాసన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో భారతజట్టు 120 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత ఆదుకుంటాడనుకున్న శుభ్‌మన్‌ గిల్‌(12) కూడా నిరాశపరచడంతో భారత్‌ 140 పరుగుల వద్ద మూడో వికెట్‌ కూడా కోల్పోయి కష్టాల్లో పడింది. కేవలం 46పరుగుల వ్యవధిలో భారతజట్టు మూడు వికెట్లు కోల్పోయింది. రెండో సెషన్‌లో ఇంగ్లండ్‌కు మూడు వికెట్లు దక్కాయి. కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌ ప్రస్తుతం 1-2 తేడాతో వెనుకపడి ఉంది. తొలి, మూడో టెస్ట్‌ల్లో ఇంగ్లండ్‌ విజయం సాధించగా.. భారత్‌ రెండో మ్యాచ్‌లో గెలుపొందింది.
దిగ్గజాల సరసన కేఎల్‌ రాహుల్‌
ఓపెనింగ్‌ కేఎల్‌ రాహుల్‌ ఓ అరుదైన ఘనత సాధించాడు. వ్యక్తిగత స్కోర్‌ 28 పరుగుల వద్ద రాహుల్‌ ఇంగ్లండ్‌ గడ్డపై 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన ఐదో భారత బ్యాటర్‌గా.. రెండో భారత ఓపెనర్‌గా రికార్డుల్లోకెక్కాడు. రాహుల్‌కు ముందు దిగ్గజ బ్యాటర్లు సచిన్‌ టెండూల్కర్‌(1575), రాహుల్‌ ద్రవిడ్‌(1376), సునీల్‌ గవాస్కర్‌(1152), విరాట్‌ కోహ్లి(1096) మాత్రమే ఈ ఘనత సాధించారు. వీరిలో గవాస్కర్‌ ఒక్కరే ఓపెనర్‌. నాల్గో టెస్ట్‌లో రాహుల్‌ 46 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఔటయ్యాడు. క్రిస్‌ వోక్స్‌ బౌలింగ్‌లో జాక్‌ క్రాలేకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.
అన్షుల్‌ కాంబోజ్‌ అరంగేట్రం
నాల్గో టెస్టుకు భారత జట్టులో మూడు మార్పులు చోటు చేసుకున్నాయి. కరుణ్‌ నాయర్‌ స్థానంలో సాయి సుదర్శన్‌ను తీసుకున్నారు. నితీశ్‌ రెడ్డి స్థానంలో శార్దూల్‌ ఠాకూర్‌, ఆకాశ్‌ దీప్‌ స్థానంలో అన్షుల్‌ కాంబోజ్‌కు చోటు కల్పించారు. అయితే టెస్టుల్లో కాంబోజ్‌ అరంగేట్రం చేయనున్నాడు. రైట్‌ ఆర్మ్‌ మీడియం పేసర్‌ అయిన కాంబోజ్‌.. దేశవాళీ క్రికెట్‌లో హర్యానాకు తరఫున ఆడాడు. అయితే జరిగిన రంజీ ట్రోఫీలో.. కేరళతో జరిగిన మ్యాచ్‌లో అతను ఒక ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసి రికార్డు నెలకొల్పాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -