Magazines

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ రాజీనామా చేయాలి

48 నిమిషాల క్రితం

CEC Gyanesh Kumar must resign.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 07, 2026 | 3 నిమిషాల చదవడం

10న దేశవ్యాప్తంగా నిరసనలు
రాష్ట్రంలో వెయ్యి కేంద్రాలో కాగడాల ప్రదర్శనలు
విలేకర్ల సమావేశంలో సీఐటీయూ, రైతు,
వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాజ్యాంగం పట్ల ఏ మాత్రం విశ్వాసం ఉన్నా సీఈసీ జ్ఞానేష్‌‌కుమార్‌ ‌రాజీనామా చేయాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్‌, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, తెలంగాణ రైతు సంఘం ఉపాధ్యక్షులు ప్రొఫెసర్‌ అరిబండి ప్రసాదరావు డిమాండ్‌ ‌చేశారు. మంగళవారం హైదరాబాద్‌‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా వెంకట్‌ ‌మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ కుమార్‌ ‌రాజీనామా చేయాలంటూ సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు ఈ నెల 10న దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయని చెప్పారు. ‘సర్‌’ను రద్దు చేయాలనీ, తొలగించిన అర్హత కలిగిన ఓట్లన్నింటినీ తిరిగి చేర్చాలనీ, ఎన్నికల వ్యవస్థను పూర్తిగా సంస్కరించాలనీ, 2023కి ముందు ఉన్న ఎన్నికల కమిషన్ నిబంధనలనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. జ్ఞానేశ్ కుమార్‌ చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా కొనసాగడం దేశానికి, దేశ ప్రజలకు, భారత రాజ్యాంగానికి అవమానకరమని చెప్పారు. కోర్టులు వ్యాఖ్యానాలు చేస్తున్నా, ప్రజలు తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నా, రాజ్యాంగాన్ని రక్షించాల్సిన రాష్ట్రపతి మౌనంగా ఉండటం దేశానికి మంచిది కాదని తెలిపారు. జ్ఞానేశ్ కుమార్‌ చేపట్టిన చర్యలు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్నాయన్నారు. 75 ఏండ్ల స్వాతంత్ర్య భారత ప్రజాస్వామ్య అస్తిత్వానికి ఉల్లంఘన జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తొలగించిన ఓట్లపై న్యాయపరమైన అంశాలను కూడా ప్రస్తావిస్తూ, ఓటును తొలగించడం అంటే శరీరం నుంచి ఆత్మను తీసేయడం లాంటిదని, అది రాజ్యాంగంపై దాడి అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉజ్జల్‌ ‌భూయాన్ వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఓటును తీసేస్తే మనిషి శరీరం ఉన్నా హృదయం లేనట్టేనని ఆయన పేర్కొన్న విషయాన్ని ఉటంకించారు. తొలగించిన ఓట్లలో వలస కూలీలు, అసంఘటిత కార్మికులు, వ్యవసాయ కార్మికులు, వృత్తిదారులు, దళితులు, మైనారిటీలు, గిరిజనులు, ఓబీసీలు ఉన్నారని చెప్పారు. సమాజంలో ఉత్పత్తికి ప్రధాన కారకులుగా ఉన్న వర్గాలు తమ ఓటు ప్రాధాన్యతను గుర్తించి రాజ్యాంగ ప్రక్రియలో భాగస్వాములు అవుతున్న సమయంలో వారి ఓట్లను లేకుండా చేయడం ఆందోళన కలిగిస్తున్నదన్నారు.ఓటును తొలగించడం అంటే ప్రజాస్వామ్యాన్ని తొలగించడం, నియంతృత్వాన్ని తీసుకురావడమేనని చెప్పారు. ఆధిపత్య భావజాలాలకే హక్కు ఉందని, సాధారణ ప్రజలకు ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగం లేదని చెప్పే విధంగా ఓట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని కాగితం మీద ఉంచి నియంతృత్వాన్ని తీసుకురావడానికి జరుగుతున్న ప్రక్రియను అడ్డుకుంటామని హెచ్చరించారు.
వెయ్యి కేంద్రాలో కాగడాల ప్రదర్శనలు
ఓటు హక్కును తొలగించే ప్రక్రియను బీజేపీ కుట్రపూరితంగా చేపడుతోందని పాలడుగు భాస్కర్ విమర్శించారు. ఇప్పటివరకు సర్‌ పేరుతో జరిగిన ఓటర్ వెరిఫికేషన్, నమోదు ప్రక్రియలో తొలగించిన ఓటర్లను తిరిగి ఓటర్ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఓటర్ల తొలగింపుకు కారణమైన ఫామ్-6లో చేసిన మార్పులను ఉపసంహరించుకోవాలన్నారు. స్వయం ప్రతిపత్తి, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్‌లోని సభ్యుల ప్రజాస్వామ్యబద్ధమైన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా, మోడీ కనుసన్నల్లో దుర్మార్గానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలనీ, లేదంటే తొలగించాలని డిమాండ్‌ ‌చేశారు. రాష్ట్రంలో వెయ్యి కేంద్రాలు ఈ నెల 10న కాగడాలతో నిరసన తెలపనున్నామని చెప్పారు.

నైతిక బాధ్యతతో జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ ‌రాజీనామా చేయాల్సిందేనని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి నాగయ్య, ఆర్‌ ‌వెంకట్రాములు డిమాండ్‌ ‌చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కనుసన్నల్లో బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని, రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నదని విమర్శించారు. రాజ్యాంగ సంస్థల్లో బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తులను పావులుగా ఉపయోగించుకునే పరిస్థితి దాపురించిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు, ప్రజాతంత్రవాదులు, ఓట్ల తొలగింపుతో బాధితులైన అసంఘటిత రంగ కార్మికులు, బలహీన వర్గాలు, వలస కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ పోరాటంతో కేంద్ర ప్రభుత్వం తలొగ్గకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.అరిబండి ప్రసాదరావు మాట్లాడుతూ దేశంలో కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయని, అందులో భాగంగానే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసే కార్యక్రమాన్ని చేపట్టారని విమర్శించారు. ఎన్నికల కమిషన్ ఒక్క మనిషిపై ఆధారపడదని, ముగ్గురితో కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, ఏకాభిప్రాయం లేనప్పుడు మెజారిటీ నిర్ణయం చేయాల్సి ఉంటుందని తెలిపారు. అధికారిక సమాచారం ఉన్నప్పటికీ ఈ సూత్రాన్ని పాటించకుండా వాయిదాలు వేస్తూ రావడం ప్రజాస్వామ్యానికి హానికరమని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, ముఖ్యంగా పేదల ఓటు హక్కులను రక్షించడానికి పోరాటం తప్పదన్నారు. విలేకర్ల సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీ రమ, కార్యదర్శి జె వెంకటేశ్‌, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొప్పిని పద్మ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్