హాజరుకానున్న డీజీపీలు,ఐజీలు
ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్ రెడ్డి
ఉగ్రవాదం, మాదకద్రవ్యాలు, సైబర్ నేరాల కట్టడిపై చర్చ
అంతర్రాష్ట్ర నేరాల నియంత్రణ, ఉమ్మడి సహకారం, కార్యాచరణపై సమీక్ష
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
దక్షిణాది రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారుల సమావేశం శుక్రవారం హైదరాబాద్‌లో జరగనుంది. సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడం, అంతర్రాష్ట్ర నేరాల నియంత్రణకు ఉమ్మడి కార్యాచరణ రూపొందించడమే లక్ష్యంగా ఈ భేటీ నిర్వహించనున్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దక్షణాది రాష్ట్రాల ప్రాంతీయ పోలీసు సమన్వయ సమావేశం తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీజీఐసీసీసీ) నిర్వహిస్తున్నట్టు డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, కేరళం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలైన అండమాన్ నికోబార్ దీవులు, పుదుచ్చేరి, లక్షద్వీప్‌లకు చెందిన డీజీపీలు, ఐజీలు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో, సీబీనీ, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఎన్ఐఏ, సీఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్ సంస్థల అధికారులు ఇందులో పాల్గొననున్నారు. ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలీసు శాఖలు అనుసరిస్తున్న ఉత్తమ విధానాలు, పరస్పర సహకారం, సమన్వయంతో నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.
ప్రధాన అంశాలపై చర్చ
ఉగ్రవాదం, మావోయిస్టు కార్యకలాపాల అనంతర పరిస్థితులు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, అంతర్రాష్ట్ర సైబర్ నేరాలు, వ్యవస్థీకృత నేరాలు, ఆర్థిక నేరాలు, యువత నిరసనలు, మానవ అక్రమ రవాణా వంటి అంశాలు సమావేశం ఎజెండాలో కీలకంగా ఉన్నాయి. అంతర్రాష్ట్ర నేరగాళ్ల ముఠాల కదలికలు, నేరగాళ్ల సమాచార మార్పిడి, నేరాల దర్యాప్తులో ఎదురవుతున్న సమస్యలు, ఆయా రాష్ట్రాల పోలీసు విభాగాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచే మార్గాలపై సమీక్షించనున్నారు. దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న నూతన క్రిమినల్ చట్టాల అమలు తీరు, సముద్ర తీర ప్రాంతాల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ, పోలీసింగ్‌లో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం వంటి అంశాలపైనా విస్తృతంగా చర్చించనున్నారు. దక్షిణాది రాష్ట్రాలు పరస్పర సహకారంతో పనిచేస్తే సరిహద్దులు దాటి విస్తరిస్తున్న నేరాలను సమర్థంగా అరికట్టవచ్చన్న లక్ష్యంతో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు.






కామెంట్‌లు (0)