శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్, చైర్మెన్ సుఖేందర్‌రెడ్డి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
శాసనసభలోని దుద్దిళ్ల శ్రీపాదరావు సెంట్రల్ హాల్‌లో గురువారం వీరయోధుడు పండుగ సాయన్న ముదిరాజ్ 174వ జయంతి, ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీం 125వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , శాసన మండలి డిప్యూటీ చైర్మెన్ బండ ప్రకాష్ , శాసన మండలి కార్యదర్శి డా. నరసింహా చార్యులు, శాసనసభ కార్యదర్శి ఆర్ తిరుపతి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. సందర్భంగా మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం వారు చేసిన పోరాటాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ కొమురం భీం ఆదివాసీల ఆరాధ్య దైవమనీ, గోండు బెబ్బులిగా ప్రసిద్ధి చెందిన గొప్ప పోరాట యోధుడని కొనియాడారు.
అడవితల్లి ఒడిలో పుట్టిన ఆత్మగౌరవానికి కొమురం భీం ప్రతీక అని, ఆదివాసీ హక్కుల కోసం ఎగిసిన తిరుగుబాటు జెండా ఆయన అని పేర్కొన్నారు. నిజాం నిరంకుశ పాలనను ఎదిరించి, పేద రైతులు, ఆదివాసీల హక్కుల కోసం చిన్న వయసులోనే పోరాటం ప్రారంభించిన ధీరుడు కొమురం భీం అని తెలిపారు. "జల్, జంగల్, జమీన్" నినాదంతో ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం ఆయన సాగించిన పోరాటం చరిత్రలో నిలిచిపో యిందన్నారు. కొమురం భీం ప్రదర్శించిన తెగువ, పోరాట పటిమ, వ్యూహ నైపుణ్యం నిజాం పాలనకే సవాల్‌గా నిలిచాయని పేర్కొన్నారు. గిరిజనులు, ఆదివాసీల విద్య, సంక్షేమం, ఉపాధి అవకాశాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. గురుకులాలు, ఆదివాసీ యువతకు ఉన్నత విద్య, విదేశీ విద్యావకాశాలు, జోడేఘాట్ అభివృద్ధి వంటి కార్యక్రమాలు కొమురం భీం ఆశయాల సాధనకు దోహదపడతాయని తెలిపారు. అలాగే పండుగ సాయన్న ముదిరాజ్ నాటి నిజాం నిరంకుశ పాలన, దొరల దోపిడీ, సామాజిక అన్యాయాలను ఎదిరించిన తెలంగాణ వీరుడని కొనియాడారు. పేదల భూములను లాక్కోవడం, బలహీన వర్గాలపై అణచివేత, మహిళల పట్ల అవమానకరమైన ప్రవర్తన వంటి అన్యాయాలను సహించకుండా పోరాడిన ధైర్యశాలి పండుగ సాయన్న అని పేర్కొన్నారు. సమాజంలోని అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం పోరాడిన మహనీయులను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని గుర్తు చేశారు.






కామెంట్‌లు (0)