ముఖ్యమంత్రి సభలో
తిట్లు తప్ప చేసిందేమీ లేదు
కేటీఆర్ నియోజకవర్గంలో
మౌలిక వసతుల లేమి
రాజన్న ఆలయంలో కాంక్రీట్‌కు బదులు
కృష్ణశిలతో నిర్మాణాలు చేపట్టాలి
నర్మాల లింక్ ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేయాలి
కొనుక్కుంటారో.. అడుక్కుంటారో.. 24 గంటల విద్యుత్ ఇవ్వాల్సిందే : టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత
నవతెలంగాణ - వేములవాడ
: ‘‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిరిసిల్ల పర్యటనలో తిట్లు తప్ప నిధులు ఇవ్వలేదు.. ఆయన రేవంతుద్దీన్ కాదు.. అబద్ధాలుద్దీన్.. ‘యువ సామ్రాట్’ కేటీఆర్ సైతం తన నియోజకవర్గాన్ని గాలికొదిలేశారు’’ అని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కొనుగోలు చేస్తారో.. అడుక్కుంటారో తెలియదు.. నవంబర్ నెలాఖరు వరకు రైతులకు 24 గంటల విద్యుత్ ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు.
రాజన్న ఆలయంలో కోడెలకు సరైన ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు అందకపోవడం, మరణించిన అనంతరం శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించకపోవడం బాధాకరమన్నారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి, ఎంపీ బండి సంజయ్ స్పందించాలని డిమాండ్ చేశారు. రాజన్న ఆలయాభివృద్ధికి ఉన్న రూ.250 కోట్ల నిధులతో కాంక్రీట్ నిర్మాణాలు కాకుండా, ఆగమశాస్త్ర సంప్రదాయాలకు అనుగుణంగా కృష్ణశిలతో శాశ్వత నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. రాజన్న చెరువు దుర్గంధాన్ని తొలగించి, అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మించాలని అన్నారు. రూ.5 కోట్లతో నిర్మించిన మార్కెట్లను వినియోగంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
బోరుబావులపై ఆధారపడిన సిరిసిల్ల జిల్లా రైతులకు విద్యుత్ కోతలు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. మిడ్‌మానేరు-అప్పర్ మానేరు నర్మాల లింక్ ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేసి 1.10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని, లేనిపక్షంలో పాదయాత్రలు, సైకిల్ యాత్రలు చేపడతామని హెచ్చరించారు. రుద్రంగి రిజర్వాయర్ (0.5 టీఎంసీలు), ధూమ్పేట వరద కాలువ ఆధారిత లిఫ్ట్ పనులను వేగవంతం చేయాలని కోరారు. సెస్‌ను ఎన్పీడీసీఎల్లో విలీనం చేసి రైతులకు అన్యాయం చేశారని విమర్శించారు. సెస్‌లో జరిగిన రూ.32 కోట్ల అవినీతి, ఎన్నికల ముందు జరిగిన అగ్నిప్రమాద ఘటనపై సిట్టింగ్ జడ్జితో స్వతంత్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గల్ఫ్‌లో మరణించిన 112 మంది కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలన్నారు. నేరళ్ల బాధితులకు 3 ఎకరాల భూమి, ఉద్యోగం, రూ. కోటి పరిహారం ఇవ్వాలని, సిరిసిల్ల ఎస్పీ దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు.
కొత్త అక్రిడిటేషన్ నిబంధనలతో జర్నలిస్టుల గొంతు నొక్కాలని చూస్తున్నారని, ఉర్దూ మీడియాను చిన్నచూపు చూడొద్దని అన్నారు. వేములవాడ, సిరిసిల్ల జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. బీడీ కార్మికుల కోసం కేటాయించిన 15 పడకల ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణం ఎక్కడ ఆగిందో ప్రభుత్వం చెప్పాలన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి సెగ్మెంట్లోనూ ప్రధాన రాజకీయ పార్టీలకు టీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తుందని చెప్పారు.
కేటీఆర్ నియోజకవర్గంలోనూ
మౌలిక వసతుల లేమి
సిరిసిల్ల నియోజకవర్గంలో మాజీ మంత్రి కేటీఆర్ వైఫల్యాలను కవిత ఎండగట్టారు. కేటీఆర్‌ను ‘యువ సామ్రాట్’గా చెప్పుకునేవారు, ఆయన నియోజక వర్గంలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీలో ల్యాబ్‌లు లేక విద్యార్థులు జగిత్యాలకు వెళ్లాల్సిన పరిస్థితిపై ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. మెడికల్ కాలేజీలో ఒకే గదిలో 16 మంది విద్యార్థులు ఉంటున్నారని, 140 మంది విద్యార్థినులకు ఒకే వాటర్ ఫిల్టర్ ఉంచడం, అర్ధరాత్రి బస్సు సౌకర్యం లేక ఆటోల్లో వెళ్లాల్సి రావడం సిగ్గుచేటన్నారు. సమావేశంలో రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు సంకపల్లి సుమలత శర్మ, నియోజకవర్గ ఇన్చార్జి ఎమ్‌డి అబ్దుల్ మజీద్, జిల్లా నాయకులు మల్లేష్ యాదవ్, ఉమ్మడి జిల్లా ముఖ్య నాయకులు ఉన్నారు.






కామెంట్లు (0)