Magazines

పీఆర్సీపై సానుకూల నిర్ణయం

47 నిమిషాల క్రితం

Positive decision on PRC
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 07, 2026 | 3 నిమిషాల చదవడం

రెవెన్యూ శాఖలో సమూల సంస్కరణలు
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం
తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు
61 ఏండ్లు పైబడిన వీఆర్‌ఏ వారసుల నియామకాలు : వంగ రవీందర్‌‌రెడ్డి ఉద్యోగ విరమణలో మంత్రి పొంగులేటి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
రాష్ట్రంలో రెవెన్యూ శాఖలో సమూల సంస్కరణలు చేపడుతున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రెవెన్యూ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువగా, పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ఉద్యోగుల అనుభవం, సూచనలు, సహకారం ఎంతో అవసరమని చెప్పారు. ఉద్యోగ సంఘాలు కోరుతున్న పీఆర్సీ అంశంపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకునే దిశగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. మంగళవారం హైదరా‌బాద్‌ రవీంద్రభారతి లో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) రాష్ట్ర అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం సేవలందించిన వంగ రవీందర్ రెడ్డి ఉద్యోగ విరమణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి పొంగులేటి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు మంచి పనులు చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అనేక సంస్కరణలను క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేయడంలో రెవెన్యూ ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. రెవెన్యూ శాఖలో సంస్కరణలు కేవలం అధికారులు లేదా ప్రభుత్వ పెద్దల ఆలోచనలతో మాత్రమే సాధ్యం కావనీ, గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు పనిచేస్తున్న ఉద్యోగుల సూచనలు, అనుభవాలు కలిస్తేనే సమర్థవంతమైన మార్పులు సాధ్యమవుతాయని వివరించారు. “వందకు వంద శాతం సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పను. కానీ సాధ్యమైనన్ని సంస్కరణలు తీసుకొచ్చి రెవెన్యూ వ్యవస్థను ట్రాక్‌పైకి తీసుకువస్తున్నామని మాత్రం ధైర్యంగా చెప్పగలను” అని మంత్రి స్పష్టం చేశారు.​
అప్పుడే నిజమైన సార్థకత
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మారుమూల గ్రామాలు, గూడేలు, తండాల్లో నివసించే చివరి వ్యక్తికి అందినప్పుడే నిజమైన సార్థకత ఉంటుందని మంత్రి పొంగులేటి అన్నారు.
రెవెన్యూ ఉద్యోగులు నిబద్ధతతో పనిచేస్తేనే ప్రభుత్వం రూపొందించే విధానాలకు పూర్తి స్థాయిలో ఫలితాలు వస్తాయని చెప్పారు. ఉద్యోగుల వ్యక్తిగత, సేవా సంబంధిత సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొన్ని అంశాల్లో పరిమితులు ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. తాను రెవెన్యూ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి పెండింగ్‌లో ఉన్న వేలాది ఉద్యోగుల వైద్య బిల్లులను పరిష్కరించానని గుర్తు చేశారు. ఉద్యోగుల పదోన్నతుల విషయంలోనూ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని వివరించారు. సుమారు 15 మందికి ఐఏఎస్ కన్ఫర్మేషన్‌తోపాటు, వివిధ స్థాయిల్లో పెద్ద ఎత్తున పదోన్నతులు కల్పించడం పట్ల సంతోషంగా ఉందన్నారు.
ఉద్యోగులు భయాలకు గురికావొద్దు
ప్రభుత్వ ఉద్యోగులు ఎలాంటి భయాలకు గురికావాల్సిన అవసరం లేదని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఏ ఒక్క ఉద్యోగిపైనా కక్షపూరితంగా వ్యవహరించే విధానం ఈ ప్రభుత్వానికి లేదన్నారు. నిష్పక్షపాతంగా, నిస్వార్థంగా విధులు నిర్వహించే ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా చేసే ఆరోపణలు, విమర్శలకు ఉద్యోగులు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా కల్పించడం, 61 ఏండ్లు పైబడిన వీఆర్‌ఏల వారసుల నియామకాలు, మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు, తహశీల్దార్లకు సొంత జిల్లాలకు బదిలీ కల్పించే అంశం, రెవెన్యూ ఉద్యోగుల ఇతర సర్వీసు సమస్యలను ట్రెసా ప్రతినిధులతో చర్చించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వంగ రవీందర్ రెడ్డి సేవలను మంత్రి అభినందించారు.
ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన అంశాలపై మరోసారి ఉద్యోగ సంఘాలతో చర్చిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో అధ్యక్షులు మారం జగదీశ్వర్, టీజీవో అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, అధికారులు ఏనుగు నరసింహారెడ్డి, వి విక్టర్, కె చంద్రకళ, సిహెచ్ కృష్ణమూర్తి, మఠం శివశంకర్, కె లక్ష్మయ్య, కె చంద్రమోహన్, ట్రైసా రాష్ట్ర అధ్యక్షులు కె గౌతమ్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఎల్ రామన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్