పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన ఎప్పుడు?
బీఆర్‌ఎస్, బీజేపీల మధ్య లోపాయికారీ ఒప్పందమా? రాజకీయ వర్గాల్లో చర్చ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వచ్చే ఏడాది ఫిబ్రవరి, లేదా మార్చిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే 71 నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అందుకే ఈ ఎన్నికలను అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలిచేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను గతనెలలోనే ప్రకటించింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ నుంచి సామ రామ్మోహన్‌రెడ్డి, వరంగల్-ఖమ్మం-నల్లగొండ నుంచి రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి ప్రచారం మొదలుపెట్టారు. బీఆర్‌ఎస్, బీజేపీ మాత్రం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. దసరా పండుగ సందర్భంగా ఆ రెండు పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తాయని అందరూ ఆశించారు. అదీ జరగలేదు. ఎందుకు ఈ జాప్యం జరుగుతోందన్న చర్చ జరుగుతున్నది. బీఆర్‌ఎస్, బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన ఎప్పుడు అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఆ రెండు పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం కోసమే ఆలస్యం అవుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీజేపీ అధిష్టానం నుంచి స్పష్టత వచ్చాకే రెండు పార్టీల అభ్యర్థులను ప్రకటించే అవకాశమున్నట్టు తెలుస్తున్నది.
ఓట్ల నమోదుపై ప్రత్యేక దృష్టి
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం ఓట్ల నమోదు ప్రక్రియ సాగుతున్నది. వచ్చేనెల ఆరో తేదీ వరకు ఓట్ల నమోదు కోసం గడువున్నది. దీంతో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఓట్ల నమోదుపై ప్రత్యేక దృష్టిసారించాయి. బీఆర్‌ఎస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జీలను ప్రకటించింది. ఓటర్ల నమోదు, బీఆర్‌ఎస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలను నిర్వహిస్తున్నారు. అభ్యర్థులపై అందరి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 1,53,745 మంది, వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 2,01,966 మంది కలిపి 3,55,310 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు.
వచ్చేనెల 25న పట్టభద్రుల ఓటర్ల జాబితాను ఈసీ ప్రకటిస్తుంది. డిసెంబర్ 10 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తుంది. అదేనెల 30న తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తుంది.
అభ్యర్థులపై కసరత్తు ముమ్మరం
రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు బీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తును ముమ్మరం చేశాయి. బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసేందుకు పలువురు అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నారు. పార్టీ అధిష్టానం కూడా పలువురి పేర్లను పరిశీలిస్తున్నది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ నుంచి కాసాని వీరేశ్, నాగేందర్‌గౌడ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారితోపాటు మాజీమంత్రి వి శ్రీనివాస్‌గౌడ్, బీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ పేర్లను కూడా పరిశీలిస్తున్నట్టు తెలిసింది. నల్లగొండ-వరంగల్-ఖమ్మం నుంచి ఏనుగుల రాకేశ్‌రెడ్డి పేరు దాదాపు ఖరారు అయినట్టుగా తెలుస్తున్నది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు, పవన్‌కుమార్‌రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. నల్లగొండ-వరంగల్-ఖమ్మం నుంచి సుందర్‌రాజు, తూటుపల్లి రవికుమార్, అశోక్‌గౌడ్ పేర్లు పరిశీలినలో ఉన్నాయి. పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సుంకరి బిక్షంగౌడ్ నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బీజేపీతో సంప్రదింపులు జరుగుతున్నట్టు తెలిసింది.






కామెంట్‌లు (0)