సీఈసీ రాజీనామా చేయాలి : వామపక్షాలు, కాంగ్రెస్, టీజేఎస్, ఎస్పీ, ఆర్జేడీ డిమాండ్
కలెక్టరేట్ల ఎదుట నిరసన ర్యాలీలు.. ధర్నాలు
8న లోక్‌భవన్ ముట్టడి నవంబర్ 1న ‘చలో ఢిల్లీ’కి పిలుపు
నవతెలంగాణ- సిటీబ్యూరో/మొఫసిల్
యంత్రాంగం
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తక్షణమే బర్తరఫ్ చేయాలని, లేనిపక్షంలో ఆయనే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని వామపక్షాలు, ‘ఇండియా’ కూటమి డిమాండ్ చేశాయి. దేశంలో రాజ్యాంగ విరుద్ధంగా తొలగించిన 13 కోట్ల 30 లక్షల ఓట్లను వెంటనే పునరుద్ధరించాలని గళమెత్తాయి. రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని, సీఈసీ తీరును నిరసిస్తూ తొమ్మిది వామపక్ష పార్టీలు, కాంగ్రెస్, టీజేఎస్, ఎస్పీ, ఆర్జేడీల ఆధ్వర్యంలో పలు జిల్లాల కలెక్టరేట్లతోపాటు హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. అంతకుముందు లక్డీకాపూల్ డైమండ్ టీ స్టాల్ నుంచి హైదరాబాద్ కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం డీఆర్వో డాక్టర్ నారాయణకు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ.. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన పౌరుల ప్రాథమిక హక్కు అయిన ‘ఓటు హక్కు’ను తొలగిస్తున్న సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ను వారి జేబు సంస్థగా మార్చుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
18 ఏండ్లు నిండిన ప్రతి పౌరుడికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత కమిషన్‌పై ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసినా.. యథేచ్ఛగా ఓట్ల చోరీకి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సుప్రీంకోర్టును మోసం చేసిన ‘గజదొంగ’
సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం.వెంకటేష్, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ
సాక్షాత్తూ సుప్రీంకోర్టును సైతం బురిడీ కొట్టించిన ‘గజదొంగ’ జ్ఞానేశ్ కుమార్ అని సీపీఐ(ఎం) , సీపీఐ నాయకులు ఎం.వెంకటేష్, ఈటీ నరసింహ విమర్శించారు. నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తూ మోడీ, అమిత్ షా, ఆర్‌ఎస్‌ఎస్ ఎజెండానే అమలు చేస్తున్నారని, తక్షణమే సర్ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జిల్లాల అధ్యక్షులు సైఫుల్లా, మోతే రోహిత్, దీపక్ జాన్ మాట్లాడారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాజీలేని ఉద్యమాలు నిర్మిస్తామని, ఇందులో భాగంగా ఈనెల 8న హైదరాబాద్‌లోని లోక్‌భవన్ ముట్టడి, నవంబర్ 1న దేశ రాజధానిలో నిర్వహించే ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాలను జయప్రదం చేయాలని విపక్ష నేతలు పిలుపునిచ్చారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో..
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సీపీఐ(ఎం), కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ(ఎంఎల్) ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. సమగ్ర ఓటర్ సర్వే పేరుతో ఓటర్లను తొలగించిన సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల ఓటు హక్కు తొలగించిన వారిపై.. ఆ ప్రక్రియలో జరుగుతున్న అవకతవకులపై రాష్ట్రపతి జోక్యం చేసుకొని సమగ్ర విచారణ జరిపి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి జహంగీర్, సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి, సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర నాయకులు మామిడాల బిక్షపతి పాల్గొన్నారు.
ఉమ్మడి రంగారెడ్డిలో..
సర్ ప్రక్రియతో ఓట్ల తొలగింపులో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆయనను వెంటనే తొలగించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అలాగే వికారాబాద్ పట్టణంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీసి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
ఉమ్మడి ఆదిలాబాద్‌లో..
సర్ ప్రక్రియలో పారదర్శకతపై ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన, ధర్నా నిర్వహించారు. కుమురంభీం ఆసిఫాబాద్‌లో ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్ హరితకు వినతిపత్రం అందించారు.
కరీంనగర్‌లో భారీ ర్యాలీ..
సర్వే ప్రక్రియను వెంటనే నిలుపుదల చేయాలని, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను బర్తరఫ్ చేయాలని 'ఇండియా' కూటమి నాయకులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీల ఆధ్వర్యంలో కరీం నగర్‌లోని గీతాభవన్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.






కామెంట్‌లు (0)