Magazines

ఎల్‌‌నినోపై ప్రభుత్వానికి దశదిశా ఏదీ?

1 గంట క్రితం

Does the government have any clear direction regarding El Niño?
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 13, 2026 | 3 నిమిషాల చదవడం

నీళ్లులేక పంటలు ఎండిపోతున్నా

పట్టించుకోని ప్రభుత్వం

పంటలు వేయొద్దంటే ప్రజలు ఎలా బతకాలి ?

ఉపాధి కల్పనకు ప్రత్యామ్నాయ ప్రణాళికేది ?

కరెంటు కోతలు, నీటి ఇబ్బందులపై 
సమగ్ర కార్యాచరణ ప్రకటించాలి :

మాజీమంత్రి హరీశ్‌‌రావు డిమాండ్‌

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌

ఎల్‌‌నినో ప్రభావం ఉంటుందని తొమ్మిది నెలల ముందే శాస్త్రవేత్తలు హెచ్చరించి నా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టలేదని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి టి హరీశ్‌‌రావు విమర్శించారు. ఎల్‌‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వానికి దశదిశా ఏదీ లేదని అన్నారు. సోమవారం హైదరాబాద్‌‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎల్‌‌నినో ప్రభావంతో తీవ్రమైన కరువు ఉందని చెప్పారు. నీళ్లులేక పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతులతో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం పిల్లలాట ఆడుతున్నదని అన్నారు. ఎల్‌‌నినోపై మంత్రులతో సమీక్ష ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి గోవా వెళ్లారనీ, మంత్రులు ఢిల్లీ వెళ్లారని గుర్తు చేశారు. రైతుల పట్ల, రాష్ట్రం పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో అర్థమవుతోందని చెప్పారు. ఎల్‌‌నినో ప్రభావం నేపథ్యంలో తొమ్మిది నెలలుగా రైతుల కోసం తీసుకున్న చర్యలేంటో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌‌ చేశారు.

​మళ్లీ వలసలు పోవాలా?

యాసంగిలో పంటలు వేయొద్దంటే రైతులు ఏం చేయాలని హరీశ్‌‌రావు ప్రశ్నించారు. రైతు కూలీల పరిస్థితి ఏంటని అడిగారు. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు ఎలా బతకాలన్నారు. రైతులు, కూలీలకు ఉపాధి కల్పనకు సంబంధించి ప్రభుత్వానికి ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళిక ఉందా?అని ప్రశ్నించారు. రైతులు, కూలీలు మళ్లీ వలసలు పోవాలా?అని అడిగారు. పాలమూరు జిల్లా కూలీలు ఉపాధి కోసం కర్ణాటకకు వలస వెళ్లి రోడ్డు ప్రమాదంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని వివరించారు. రైతులు, కూలీలకు ప్రభుత్వం భరోసా కల్పించాలని డిమాండ్‌ ‌చేశారు.

​ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కరెంటు కోతలు

బొగ్గు కొరతకు ఎల్‌నినోకు సంబంధం ఏంటని హరీశ్‌‌రావు ప్రశ్నించారు. నైనీ బొగ్గు గనిలోని బొగ్గును తీసుకొచ్చి ముందుగానే నిల్వలు ఎందుకు ఏర్పాటు చేసుకోలేదని అడిగారు. ముందుచూపు లేమి, వైఫల్యం, నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని చెప్పారు. అందుకే కరెంటు కోతలని విమర్శించారు. ఆరు గంటలు కూడా కరెంటు రావడం లేదన్నారు. పొలాల్లో ఉండాల్సిన రైతులు సబ్‌స్టేషన్ల ముందు ఆందోళనలు చేస్తున్నారని గుర్తు చేశారు. కరెంటు లేక నీళ్లు ఉన్నా మోటార్లు నడపలేని పరిస్థితి ఉందన్నారు. అందుకే ఇది కాలం తెచ్చిన కరువు కాదనీ, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువని విమర్శించారు. బొగ్గు లేక కరెంట్ఉత్పత్తి ఆగిపోయిందనీ, కరెంట్ లేక నీళ్లు లేవనీ, నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని విమర్శించారు. ది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు.

​మద్యం కొరత ఉండొద్దట

లిక్కర్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో ఉండాలనీ, ఎక్కడా నీటి కొరత లేదని ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతున్నారని హరీశ్‌‌రావు చెప్పారు. దసరాకు మద్యం కొరత ఉండకూడదనీ, మద్యం కంపెనీలకు నీళ్లు అందుబాటులో ఉంటాయని అంటున్నారని అన్నారు. లిక్కర్‌ ఉత్పత్తికి లేని నీటికొరత తాగునీరు, సాగునీటికే ఎందుకు ఉంటుందనీ, ప్రజలు ఎందుకు ఇబ్బందులు పడాలని ప్రశ్నించారు.

రైతు బీమా, రైతు భరోసా ఎక్కడ అని అడిగారు.

పంటలకు నీళ్లు ఇవ్వకుండా మద్యం కంపెనీలకు నీళ్లు ఇస్తున్నారనీ, దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు.

రైతుల సమస్యలను పక్కనపెట్టి ఢిల్లీ రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు.

నీళ్లు ఉన్న చోట మోటార్లు నడపాలనీ, ప్రాజెక్టులను వినియోగంలోకి తీసుకురావాలనీ, రాజకీయాలను పక్కనపెట్టి రైతుల గురించి ఆలోచించాలని కోరారు. రైతులు, కూలీలకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు.

కరెంట్ కోతలు, నీటి కొరతపై సమగ్ర కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సంజయ్, కార్పొరేషన్ల మాజీ చైర్మెన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, దూదిమెట్ల బాలరాజు యాదవ్‌, అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యులు కిషోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్