Magazines

ఎల్‌నినో క్యాన్స‌ర్‌లాంటిది

2 గంటల క్రితం

Elinol
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 23, 2026 | 4 నిమిషాల చదవడం

దానిపై వాస్త‌వాల‌ను ప్ర‌జ‌ల‌కు విడ‌మ‌రిచి చెబుదాం

ప్ర‌తీరోజూ ఒక బులెటిన్ విడుద‌ల చేస్తాం

సంక్రాంతి నుంచి మే వరకు మంత్రులు, ప్ర‌జా ప్ర‌తినిధులు గ్రామాల్లోనే ఉండాలి

లేదంటే చ‌ర్య‌లు త‌ప్ప‌వు

యూనిట్ కు రూ. 15 పెట్టినా కరెంట్ దొరికే పరిస్థితి లేదు

ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ పొదుపు పాటించాలి :ఎల్‌నినోపై స‌మావేశంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి


న‌వ‌తెలంగాణ బ్యూరో - హైద‌రాబాద్
ఎల్‌నినోకు సంబంధించిన విష‌యాల‌ను దాచిపెట్ట‌ట‌ మంటే.. క్యాన్స‌ర్ ను దాచిపెట్ట‌టమేన‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అందువ‌ల్ల అన్ని విష‌యాల‌నూ ప్ర‌జ‌ల‌కు విడ‌మ‌రిచి చెప్పాల‌ని ఆయ‌న సూచించారు. ఇందుక‌నుణంగా వ‌చ్చే సంక్రాంతి నుంచి మే వ‌ర‌కు మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇత‌ర ప్ర‌జా ప్ర‌తినిధులంద‌రూ గ్రామాల బాటప‌ట్టాల‌ని, అక్క‌డే ఉండాలని ఆయ‌న ఆదేశించారు. అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. ప్రజా ప్రతినిధులు గ్రామాల్లో ఉన్నారో లేదో తెలుసుకునే ప‌ర్య‌వేక్ష‌ణ బాధ్య‌త‌ను మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావుకు అప్ప‌గిస్తున్నామ‌ని తెలిపారు. అలా లేని వారిపై మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి చ‌ర్య‌లు తీసుకుంటార‌ని సీఎం హెచ్చ‌రించారు. శుక్ర‌వారం హైద‌రాబాద్‌లోని ప్ర‌జా భ‌వ‌న్‌లో టీపీసీసీ ఆధ్వ‌ర్యంలో ఎల్‌నినో, ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌పై చ‌ర్చించేందుకు ప్ర‌త్యేక స‌మావేశాన్ని నిర్వ‌హించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, పీసీసీ అధ్య‌క్షుడు మ‌హేశ్ కుమార్‌గౌడ్‌తోపాటు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్య‌క్షులు, ఇత‌ర ముఖ్య నాయ‌కులు ఈ భేటీకి హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి వారికి ప‌లు అంశాల‌పై దిశా నిర్దేశం చేశారు. ఎల్ నినో తో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని సీఎం ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. సాగు, తాగు నీటి లభ్యత తగ్గిపోతుందని, దాంతో విద్యుత్ వినియోగం పెరుగుతుందని హెచ్చ‌రించారు. అయినా ఎల్‌నినోను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొనేందుకు శాయ‌శ‌క్తులా కృషి చేస్తున్నామ‌ని వివ‌రించారు. ప్రకృతి వైపరీత్యాలు మూడురకాలని... వ‌రదలు, కరువు, భూకంపాలతో క్షణాల్లో భారీ నష్టం వాటిల్లుతుందని.. ఏదైనా మనం దాని తర్వాతే ఉపశమన చర్యలు చేపట్టగలమ‌ని తెలిపారు. వరదలు, సునామీలు అంతే వేగంగా వస్తాయని, అయితే కొన్ని గంటల ముందు మనకు కొన్ని సూచనలు క‌న‌బ‌డ‌తాయ‌ని పేర్కొన్నారు. కానీ కరువు ప్రారంభమైనప్పుడు మొదట మనకు దాని ప్రభావం తెలియదని, నెమ్మది నెమ్మదిగా అది మ‌న‌ల‌ను కబళిస్తుందని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వం వైపు నుంచి తాము గ‌త ఆరు నెలల నుంచి ప్రజలను అప్రమత్తం చేస్తున్నామ‌ని వివ‌రించారు.


ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువంటూ బీఆర్ ఎస్ నేత‌లు విమ‌ర్శిస్తున్నార‌ని, ఎల్ నినో అనేది తెలంగాణలోనే కాదు ఇంగ్లాండ్, అమెరికా దేశాలు, మన దేశంలో మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లోనూ ఉందని గుర్తు చేశారు. అన్ని చోట్లా తాగునీటికి ఇబ్బందులు త‌లెత్తుతున్నాయ‌ని గుర్తు చేశారు. మ‌హారాష్ట్ర‌లోని కొన్ని ప్రాంతాల్లో రేష‌న్ బియ్యం మాదిరిగా నీటిని స‌ర‌ఫ‌రా చేస్తున్నార‌ని తెలిపారు. ఎల్‌నినో నేప‌థ్యంలో వచ్చే జులై వరకు తాగు నీటి కష్టాలు మ‌న‌ల్ని వెంటాడ‌తాయ‌ని సీఎం ఈ సంద‌ర్భంగా హెచ్చ‌రించారు. ఎండ వేడి పెరిగి ప్రజలు ఇండ్లల్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉండ‌బోద‌ని సీఎం ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ నేప‌థ్యంలోనే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నాయకత్వంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. సరైన సమాచారం అందించేందుకు వీలుగా ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావును నోడల్ ఆఫీసర్ గా నియమించామ‌న్నారు. ఆయ‌న ఆధ్వ‌ర్యంలో ఎల్ నినోపై ప్రతీ రోజు ఒక బులెటిన్ విడుదల చేస్తామ‌ని వివ‌రించారు. ఎంపీ చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి గాంధీ భ‌వ‌న్‌లో హెల్ప్ డెస్క్ నిర్వ‌హిస్తార‌ని తెలిపారు.

కేసీఆర్ మాట‌లు న‌మ్మినోళ్లు శ్మ‌శానాల్లో...

బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు తాము మాత్రమే తెలివైన వాళ్ల‌మ‌ని అనుకుంటున్నార‌ని సీఎం ‌రేవంత్‌‌రెడ్డి దుయ్య‌బ‌ట్టారు. కరోనా సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హెచ్చరిస్తే వాళ్లకు మాస్కులు ఇవ్వాలంటూ కేసీఆర్ ఎద్దేవా చేశార‌ని విమ‌ర్శించారు. క్రోసిన్ వేసుకోండంటూ సీఎం హోదాలో కేసీఆర్ అవహేళన చేశార‌ని పేర్కొన్నారు. ఆయన మాటలు నమ్మి మాస్కులు పెట్టుకోకుండా ఉన్న‌వారు కనుమరుగయ్యారని చెప్పారు. వాటిని నమ్మని మనం ఈ రోజు ఇక్కడ కూర్చున్నామంటూ పేర్కొన్నారు. కరోనా సమయంలో శ్మశానాల్లో చోటు సరిపోలేదని సీఎం ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వేల కిలోమీటర్లు నడిచి త‌మ త‌మ గ్రామాలకు చేరుకున్నారని చెప్పారు.

​​తాగునీటి కోసం టోల్ ఫ్రీ నెంబ‌రు..
ప్ర‌స్తుతం రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో నీరు చాలా త‌క్కువ‌గా ఉంద‌ని సీఎం తెలిపారు. అందువ‌ల్ల మున్ముందు తాగునీటి క‌ష్టాలు మ‌రింత ఎక్కువ‌వుతాయ‌ని హెచ్చ‌రించారు. మ‌రోవైపు పశు సంపదను కాపాడుకోవాలని సూచించారు. వాటికి అవసరమైన పశు గ్రాసం, నీటి వసతులు కల్పించాల‌ని ఆదేశించారు. హైదరాబాద్ తో పాటు నగరాలు, గ్రామాల్లో తాగు నీటి సమస్య రాకుండా చూడాల‌ని కోరారు. ఇందుకోసం టోల్ ఫ్రీ నంబ‌రును ఏర్పాటు చేయాల‌న్నారు. ఆ నంబ‌రుకు వ‌చ్చే స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని ఆదేశించారు.

​చెప్పుకోవ‌టంలో వెనుక‌బాటు...
ప్ర‌స్తుతం నీరు, బొగ్గు లేకున్నా ప్ర‌భుత్వం క‌రెంటును కొనుగోలు చేసి ఇస్తోంద‌ని సీఎం రేవంత్‌‌రెడ్డి తెలిపారు. అయితే ఈ విష‌యాన్ని ప్ర‌జ‌ల‌కు చెప్పుకోవ‌టంలో పూర్తిగా వెనుబ‌డిపోయామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. భూమి లేని పేదలు, కూలీలకు ప్రతి రోజూ పని దొరకాలి.. వారు కడుపు నిండా తినాలనే లక్ష్యంతో సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్...మ‌హాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని ప్రారంభించార‌ని తెలిపారు. ప్ర‌ధాని మోడీ దానికి ఏ పేరు పెట్టుకున్నా...ఏ పేరు మార్చు కున్నా అది ఉపాధి హామీ చట్టమేనని స్పష్టం చేశారు. ఉపాధి హామీలో పొలాలకు రోడ్లు వేయాలి, చెరువులు, కుంటలు, కాలువలు బాగు చేయాల‌ని సూచిం చారు. ప్రతీ చేతికి పని కల్పిం చాల‌న్నారు. వడ దెబ్బ ప్రభా వంతో ప్రజలు ప్రాణాలు పో కుండా జాగ్రత వహించాల‌ని ఆదేశించారు.

కొల్ల‌గొట్ట‌టానికే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్
రూ.ల‌క్ష‌ల కోట్లు కొల్ల‌గొట్ట‌టానికే కేసీఆర్ హ‌యాంలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను నిర్మించ‌ త‌ల‌పెట్టారని ముఖ్యమంత్రి విమ‌ర్శించారు. బొగ్గు లేని దామరచర్ల లో యాదాద్రి ప్లాంట్ కట్టడంతో ఏటా బొగ్గు రవాణా పేరిట ప్ర‌భుత్వంపై రూ. 2 వేల కోట్ల భారం పడుతోందని వాపోయారు. విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకునేందుకే సింగరేణిలో లేని జీ-9 బొగ్గు తో బీ.హెచ్‌.ఈ.ఎల్ ద్వారా విద్యుత్ తయారీ మిషనరీని ఏర్పాటు చేయించార‌ని దుయ్య‌బ‌ట్టారు. అయినా నాలుగేండ్లలో పూర్తి కావాల్సిన యాదాద్రి ప్లాంట్ ను ప‌దేండ్ల‌లో కూడా పూర్తి చేయ‌లేక‌పోయార‌ని ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వ‌చ్చాక నానా క‌ష్టాలు ప‌డి దాని నిర్మాణాన్ని పూర్తి చేశామ‌న్నారు. సింగరేణితో పాటు కోల్ ఇండియా దగ్గర, నైనీ లోనూ జీ-9 బొగ్గు లేదని వివ‌రించారు. దీంతో ఇప్పుడు జీ 12, జీ 13 బొగ్గుతో యాదాద్రి ప్లాంట్ ను నడుపుతున్నామ‌ని చెప్పారు. విదేశాల నుంచి బొగ్గును దిగుమతి చేసుకునేందుకు, ప్రతిమ శ్రీనివాస్ కు రూ. లక్ష కోట్లు కట్టబెట్టేందుకు కేసీఆర్ హ‌యాంలో కుట్రలు ప‌న్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్