అడుగంటిన రిజర్వాయర్లు, భూగర్భ జలాలు
ప్రజారోగ్యానికి ముప్పు
రాష్ట్రంలో పెరిగిన వైరల్ ఫీవర్ కేసులు
విస్తరిస్తున్న టైఫాయిడ్
ఆందోళన కలిగిస్తున్న రాష్ట్ర నివేదికలు
ఈ గ్రామాలకు ముప్పు: 11,122 గ్రామాల్లో నీటి నాణ్యతా ప్రమాణాలు ప్రమాదకరంగా ఉన్నట్టు గుర్తించారు. వాటిలో అత్యధికంగా 7,220 గ్రామాల్లో ఉప్పు శాతం, 3,085 గ్రామాల నీటిలో ఇనుము, 372 గ్రామాల్లో నైట్రేట్, 272 గ్రామాల్లో ప్రమాదకర ఆర్సెనిక్ రసాయనం, 128 గ్రామాల్లో ఫ్లోరైడ్, 45 గ్రామాల్లో హెవీ మెటల్స్ సమస్యలు ఉన్నట్టు నమోదైంది.
నవతెలంగాణ - హైదరాబాద్‌బ్యూరో
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు ముఖం చాటేశాయి. ఫలితంగా జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటాయి. ప్రభుత్వం ఉన్న నీటిని శుద్ధి చేసి, ప్రజలకు తాగునీటిని సరఫరా చేస్తున్నది. కానీ అడుగంటిన జలాశయాల్లోని నీరు పూర్తిగా కలుషితం కావడంతో వాటిని ఎంత శుద్ధి చేసినా, హానికరమైన రసాయనాలు, బ్యాక్టీరియా తాగునీటిలో కనిపిస్తూనే ఉంది. గ్రేటర్ హైదరాబాద్‌లో వాటర్‌బోర్డు రోజూ తాగునీటిని పరీక్షిస్తుంది. కానీ ఆ ఫలితాలను ప్రజలకు అందుబాటులో ఉంచట్లేదు. అదే సమయంలో వైరల్ ఫీవర్, టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా జ్వరాలతో బాధపడుతున్న పేషెంట్లతో రాష్ట్రంలోని ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం ఉండటంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల నుంచి నీటి శుద్ధి నమూనా వివరాలను కోరింది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలోని జల్‌జీవన్ మిషన్‌కు లెక్కలు ఇచ్చింది. ఆ లెక్కలు ఆందోళన కలిగిస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు. తెలంగాణలో 4.70 లక్షల నీటి వనరుల పరీక్షల్లో 53,712 నమూనాల్లో వివిధ రకాల రసాయనాలు మోతాదుకు మించి ఉన్నట్టు వెల్లడైంది. అలాగే 31,125 శాంపిల్స్‌లో
నిర్దేశిత పరిణామం కంటే ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉన్నట్టు తేలింది. రాష్ట్రంలోని 11,122 ప్రాంతాల్లో నీటిలో లవణీయత (ఉప్పుశాతం) పెరిగింది. సాధారణంగా మంచినీటిలో లవణీయత గాఢత 0.5 శాతం కంటే తక్కువ ఉంటుంది. కానీ వర్షాభావ పరిస్థితులతో అడుగంటిన జలాశయాల నీటిలో ఉప్పు (సోడియం క్లోరైడ్) తో పాటు మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం కూడా అధికంగా ఉన్నట్టు వెల్లడైంది. భూగర్భ జలాలు అడగంటడంతో చెరువులు, బావులు, బోరు నీటిలో కూడా ఉప్పు శాతం పెరిగినట్టు గణాంకాలు చెప్తున్నాయి. ఈ కలుషిత నీరు తాగడం వల్ల ఎంటరిక్ ఫీవర్‌గా పిలిచే 'టైఫాయిడ్' పెరిగినట్టు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిది. దీనికి సంబంధించిన అధికారిక గణాంకాలను వెల్లడించేందుకు వైద్యారోగ్యశాఖ సంసిద్ధత వ్యక్తం చేయలేదు. కేవలం ఎంటరిక్ ఫీవర్ (టైఫాయిడ్) కేసులు పెరిగాయని కేంద్రానికి సమాచారం ఇచ్చింది. అదే సమయంలో ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో జ్వర పీడితుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్టు తెలుస్తుంది. ఔట్ పేషెంట్ కేసులతో పాటు ఇన్ పేషెంట్ కేసులు కూడా భారీగా పెరిగాయి. జ్వరాలకు సంబంధించిన టెస్టులు చేయడం పెరిగింది. జూలై, ఆగస్టు నెలల్లో మొత్తం జ్వరాల అడ్మిషన్లు గత ఏడాదితో పోలిస్తే తగ్గినప్పటికీ, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో పెరుగుదల ఉన్నదని ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రయివేటు ఆస్పత్రులు, చిన్న చిన్న క్లినిక్స్ ద్వారా చికిత్సలు తీసుకుంటున్నవారి డేటా ప్రభుత్వం దగ్గర లేదు. నీటిలో పరిమితికి మించి కాలుష్య కాంపోనెంట్స్ ఉంటే ప్రజారోగ్యానికి ముప్పే అని వైద్యులు చెప్తున్నారు. నీటికి కాచి వడబోసి తాగినా, కొంతవరకే ఉపశమనం ఉంటుందనీ, నీటిలోని కాలుష్య మూలకణాల నిర్మూలన జరగదని చెప్తున్నారు. అందువల్ల ప్రభుత్వం అలాంటి నీటిని సరఫరా చేయడం మానేయాలని సూచిస్తున్నారు. ఆర్‌ఓ ప్లాంట్లు కొంతవరకు తాగునీటిలో కాలుష్య కారకాలను వేరు చేస్తాయని చెప్తున్నారు.
ఇవీ నీటి పరీక్షలు
తాగునీటి నాణ్యత కోసం 14 రకాల పరీక్షలు నిర్వహిస్తారు. క్లోరైడ్, ఖనిజాలు, ఈ- కోలి బ్యాక్టీరియా, ఫ్లోరైడ్, ఫ్రీ రెసిడ్యువల్ క్లోరిన్, ఐరన్, నైట్రేట్, పీహెచ్ శాతం, సల్ఫేట్, నీటిలో కరిగి ఉన్న మొత్తం ఖనిజాలు, లవణాలు, లోహాల శాతం, నీటిలో ఆమ్లత్వాన్ని తట్టుకునే శక్తి, టోటల్ కోలిఫార్మ్ బ్యాక్టీరియా, నీటి మొత్తం కాఠిన్యత, బురద శాతం వంటి పరీక్షలు నిర్వహిస్తారు. అయితే తెలంగాణలో తాగునీటి నాణ్యతపై ప్రభుత్వ గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో భారీ స్థాయిలో నీటి పరీక్షలు జరుగుతున్నప్పటికీ.. పరీక్షల్లోనే వేల సంఖ్యలో నీటి వనరులు నిర్దేశిత ప్రమాణాలకు మించి రసాయన, బ్యాక్టీరియాలజికల్ కాలుష్యంతో ఉన్నట్లు అధికారిక రికార్డులు వెల్లడిస్తున్నాయి. నీటి నాణ్యత లోపాలను సకాలంలో గుర్తించి పరిష్కరించకపోతే నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల ముప్పు పెరిగే అవకాశం ఉన్నదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
జల జీవన్ మిషన్ ఆందోళన
జల జీవన్ మిషన్ వాటర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (డబ్ల్యూక్యూఎమ్‌ఐఎస్) లో ఈనెల 6వ తేదీ నమోదైన గణాంకాల ప్రకారం తెలంగాణలో 4,70,318 నీటి వనరులు, సరఫరా పాయింట్లు, స్టాండ్‌పోస్టులు, ప్రభుత్వ, ప్రయివేటు నీటి వనరులను పరీక్షించారు. వాటిలో 53,712 చోట్ల రసాయన పరిమితులు, మరో 31,125 చోట్ల బ్యాక్టీరియాలజికల్ పరిమితులు స్థాయిని మించి ఉన్నట్టు నమోదైంది. పరీక్షల పరిధి విస్తఅతంగా ఉన్నా, నీటి నాణ్యతా సమస్యలు కూడా పెద్ద సంఖ్యలో నమోదై ఉన్నాయి.
ఆరోగ్యాలు ఖరాబ్
తాగునీటిలో ఫ్లోరైడ్, ఆర్సెనిక్, ఇనుము (ఐరన్), లవణీయత (సాలినిటీ) నిర్దేశిత మోతాదు కంటే ఎక్కువగా ఉంటే మానవ శరీరానికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి.
- నీటిలో ఫ్లోరైడ్ పరిమితికి మించి ఉండి, వాటిని దీర్ఘకాలం తాగితే ఫ్లోరోసిస్ అనే వ్యాధి వస్తుంది. దంతాలపై పసుపు లేదా గోధుమ రంగు మచ్చలు పడతాయి. ఎనామిల్ దెబ్బతిని పళ్లు ఊడిపోతాయి. ఎముకలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి, ఎముకలు వంగిపోవడం, మరియు చేతులు, కాళ్ళు సరిగ్గా కదల్చలేకపోవడం వంటి సమస్యలు వస్తాయి.
- ఆర్సెనిక్ అనేది నీటిలో ఉండే అత్యంత ప్రమాదకరమైన విషపూరిత రసాయనం (టాక్సిన్). నీటిలో ఇది ఎక్కువైతే చర్మంపై నల్లటి మచ్చలు చేతులు, కాళ్లు, అరచేతులపై పాలిపోయిన పొక్కులు, కాయలు ఏర్పడతాయి. సుదీర్ఘకాలం ఈ నీటిని తాగితే చర్మ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, కిడ్నీ, మూత్రాశయ క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఎక్కువ.
- నీటిలో ఇనుము (ఐరన్) మోతాదు ఎక్కువ ఉంటే నేరుగా ప్రాణాంతకం కాకపోయినా కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. కడుపునొప్పి, మలబద్ధకం వికారం, వాంతులు వంటి సమస్యలతో పాటు లివర్ (కాలేయం) దెబ్బతినడం, ప్యాంక్రియాస్ పాడై డయాబెటిస్ రావడంతో పాటు గుండె సమస్యలకు దారితీస్తుంది.
- నీటిలోఉప్పు శాతం ఎక్కువగా ఉంటే రక్తపోటు, గుండె జబ్బులు, పక్షవాతం వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే కిడ్నీ సమస్యలు ఏర్పడతాయి. ఉప్పునీరు తాగడం వల్ల దాహం తీరకపోగా శరీరంలోని కణాలు నీటిని కోల్పోయి డీహైడ్రేషన్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. అయితే నీటి నాణ్యత పరీక్షల్లో లోపాలు ఉన్న చోట్ల ప్రత్యేక శుద్ధి చర్యలు అతి తక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది.
- రసాయన కాలుష్యానికి మించి ప్రజారోగ్య పరంగా బ్యాక్టీరియాలజికల్ కాలుష్యం ప్రజల్ని భయపెడుతుంది. నీటిలో ఈాకోలి, టోటల్ కాలిఫార్మ్ వంటి సూక్ష్మజీవులు ఉన్నాయా అనే పరీక్షలు కీలకం. తెలంగాణలో నిర్వహించిన నీటి పరీక్షల్లో 31,125 శాంపిల్స్‌లో ఈ బ్యాక్టీరియా ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు వెల్లడైంది. ఈ పరీక్షల తర్వాత ఆయా గ్రామాల్లో నీటి సరఫరా నిలిపివేశారా లేక అలాగే కొనసాగుతుందా అనే వివరణ మాత్రం జలజీవన్ మిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు.
కిటకిటలాడుతున్న ఆస్పత్రులు
తాగునీటి ఎద్దడి, నీటి కాలుష్యం కారణంగా ప్రజలు వైరల్, టైఫాయిడ్ జ్వరాల బారిన పడుతున్నారు. ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో పెరుగుతున్న రోగుల సంఖ్య ఆందోళన కలిగిస్తుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో శనివారం (10వ తేదీ) ఒక్క రోజే 35,305 మంది ఔట్ పేషెంట్ విభాగంలో చికిత్స తీసుకున్నారు. అయితే వీరంతా జ్వర పీడితులు కాదు. కానీ మెజారిటీ పేషెంట్లు పలు రకాల జ్వరాలతోనే ఆస్పత్రులకు వచ్చారు. రోగ నిర్థారణ కోసం శనివారం ఓపీకి వచ్చిన వారికి 39,118 ల్యాబ్ పరీక్షలు నిర్వహించినట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.
ఫీవర్ ఆస్పత్రిలో...
జ్వరాల చికిత్సకు రాష్ట్రంలో పేరెన్నికగన్న ఫీవర్ ఆస్పత్రిలో ఈనెల మొదటి 10 రోజుల్లో 3,633 మంది పేషెంట్లు జ్వరాలతో ఔట్ పేషెంట్లు (ఓపీ)గా చికిత్స తీసుకున్నారు. వారు కాకుండా మరో 1,573 మంది ఎమర్జెన్సీ కేసులు నమోదయ్యాయి. మరో 184 మందిని ఇన్‌పేషెంట్లుగా చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు. దాదాపు 220 మందికి పైగా టైఫాయిడ్ జ్వరం నిర్థారణ అయ్యింది. శనివారం ఒక్కరోజే ఇక్కడ 322 మంది పేషెంట్లు ఓపీకి వచ్చారు. వైరల్ ఫీవర్ బాధితులు కూడా భారీగా ఆస్పత్రికి వస్తున్నారు.
పాల్వంచలో..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఈనెల మొదటి పదిరోజుల్లో వివిధ కారణాలతో ఓపీ ద్వారా 3,229 మంది చికిత్స తీసుకున్నారు. వీరిలో ఎక్కువమందికి జ్వర నిర్థారణ పరీక్షలే చేశారు.
గాంధీ, ఉస్మానియాలో...
రాజధాని హైదరాబాద్‌లో పేరెన్నికగన్న గాంధీ, ఉస్మానియా, కింగ్ కోఠి ఆస్పత్రుల్లో కూడా జ్వర పీడితుల సంఖ్య పెరిగింది. కింగ్‌కోఠి ఆస్పత్రిలో గతనెలలో (సెప్టెంబర్) మొత్తం ఓపీ రికార్డు 16,172 కాగా, ఈనెల మొదటి పదిరోజుల్లోనే 4,432 మంది పేషెంట్లు వచ్చారు. వారిలో అత్యధిక పేషెంట్లు జ్వరాలతో వచ్చినవారేనని ఆస్పత్రి సిబ్బంది చెప్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో కూడా ఈనెల మొదటి పదిరోజుల్లో 17,970 మంది, ఉస్మానియాలో 20,919 మంది ఓపీకి వచ్చారు. వారిలోనూ అత్యధిక పేషెంట్లు జ్వరాలతో వచ్చినవారేనని రికార్డుల్లో నమోదైంది. రాష్ట్రంలోని అనేక ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఎక్కువమంది నీటి సంబంధిత వ్యాధులు, జ్వరాలతోనే ఆస్పత్రులకు వస్తున్నట్టు వైద్యులు చెప్తున్నారు.






కామెంట్‌లు (0)