రాష్ట్ర ప్రభుత్వ విప్ డాక్టర్ రాంచంద్రు నాయక్
గిరిజన హక్కులను కాపాడుకుందాం: మాజీ ఎమ్మెల్యే జూలకంటి ఘనంగా ఠానూనాయక్ నంగారా ఉత్సవాలు
ప్రారంభమైన టీజీఎస్ రాష్ట్ర నాలుగో మహాసభలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కనుమరుగవుతున్న సంస్కృతిని పరిరక్షిం చేందుకు ఉత్సవాలు దోహదపడతాయని తెలంగాణ గిరిజన సంఘం (టీజీఎస్) రాష్ట్ర నాలుగో మహాసభల ఆహ్వాన సంఘం చైర్మెన్, రాష్ట్ర ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రు నాయక్ అన్నారు. రెండు రోజులపాటు జరిగే తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర నాలుగో మహాసభలు శనివారం హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా(రవీంద్రనాయక్ నగర్)లో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు ఠానూ నాయక్ పేరుతో నంగారా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామచంద్రు నాయక్ మాట్లాడుతూ ఠానూ నాయక్ ఉత్సవాల్లో రాష్ట్రవ్యాప్తంగా గిరిజన కళా కారులు, ఆటపాటలతో పాల్గొనడం సంతోషక రమన్నారు. గిరిజన సంస్కృతి రోజురోజుకు కనుమరుగవుతున్న తరుణంలో ఇలాంటి ఉత్సవాలు పెద్ద ఎత్తున జరగాల్సిన అవసర ముందని తెలిపారు.
గిరిజనులు, బలహీనులపై దాడి : జూలకంటి రంగారెడ్డి
ఠానూ నాయక్ లాంటి మహనీయుల పోరాటాల ఫలితంగా కొన్ని హక్కులను అనుభవిస్తున్నామని మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. నేటికి ప్రభుత్వాలు రాబందుల్లా గిరిజనులు, బలహీనుల హక్కులపై దాడి చేస్తున్నాయని విమర్శించారు. ఠానూ నాయక్ స్ఫూర్తితో ఆ రాజ్యాలను బొంద పెట్టాలని పిలుపునిచ్చారు. అందుకోసం తెలంగాణ గిరిజన సంఘం మహాసభల్లో లోతుగా చర్చించి తీర్మానాలు తీసుకుని కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ఠానూ నాయక్ విగ్రహాన్ని హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చేవెళ్ల డిక్లరేషన్ ను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. భవిష్యత్తులో లంబాడీ గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కలిసి వచ్చే గిరిజన సంఘాలతో రాష్ట్ర వ్యాప్త ఐక్య ఉద్యమ కార్యాచరణ చేపడుతున్నట్టు తెలిపారు.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో 4 వేల మంది అమరులయ్యారనీ, 10 లక్షల ఎకరాల భూమి పంపిణీ జరిగిందనీ, వెట్టిచాకిరీ రద్దు, సంఘం పెట్టుకునే హక్కు తదితర కొన్ని సౌకర్యాలు దక్కాయని ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి గుర్తు చేశారు. బ్రిటీష్ సామ్రాజ్యవాదులను తరిమికొట్టి, నిజాం పాలకులను గద్దె దించాక స్వాతంత్ర్య భారతదేశంలో కేంద్రం, రాష్ట్రాల్లో ఏర్పడ్డ ప్రభుత్వాలు గిరిజన వ్యతిరేక విధానాలతో వేధించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలు, కష్టజీవుల పక్షం కాకుండా కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్నాయని మండిపడ్డారు. పోరాటాలకు తలొగ్గి అటవీ హక్కుల చట్టం, రిజర్వేషన్ల అమలు, భూపంపిణీ కొంత మేరకు చేసినా ఇప్పటికీ గిరిజనులు కనీస సౌకర్యాలకు దూరంగా నెట్టబడుతూనే ఉన్నారని చెప్పారు.
విద్య, వైద్యం, ఇండ్లు, ఉపాధి సమస్యలను పరిష్కరించకపోగా కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఓటును కూడా తొలగించేందుకు కుట్ర చేసిందని జూలకంటి విమర్శించారు. ఓటు తొలగింపునకు తెగబడటంతో దేశంలోని విద్యార్థులు, యువత తిరుగుబాటు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ గిరిజన సంఘం పోడు భూములు, రిజర్వేషన్ల అమలు కోసం, సబ్ ప్లాన్ నిధుల మళ్లింపునకు వ్యతిరేకంగా పోరాడిందని గుర్తుచేశారు. భవిష్యత్తులోనూ అదే పోరాటాన్ని కొనసాగించాలని కోరారు. పేదలపై పన్నులు వేయడం, సమాజంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడం, బలహీనవర్గాల మధ్య చిచ్చు పెట్టడం, కార్పొరేట్లకు కొమ్ముకాయడమే పనిగా పెట్టుకున్న బీజేపీకి బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.
అంతకుముందు ఫలక్ నామా ఫరూక్ నగర్ ఆర్టీసీ బస్టాండ్ నుంచి రవీందర్ నాయక్ కాలనీ వరకు గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలతో నిర్వహించిన ప్రదర్శన ప్రజలను ఆకట్టుకుంటుంది. గిరిజన సాంప్రదాయ ఆటలు, పాటలు పాడుతూ, నినాదాలు చేస్తూ వందలాది మందితో ఉత్సాహంగా ప్రదర్శన సాగింది. అనంతరం నిర్వహించిన సభా కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి కళాకారులు, చిన్నారులు కళా ప్రదర్శనలిచ్చారు. బంజారా భాషలో సాగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రాందాస్ తేజ, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎం.ధర్మ నాయక్, ఆర్.శ్రీరాం నాయక్, ఎం.బాలు నాయక్, భూక్యా వీరభద్రం, వీరన్న, భీమాసాహెబ్, అశోక్, రామ్ కుమార్, కృష్ణా నాయక్, కిషన్ నాయక్, ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ అబ్బాస్, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌బాబు, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోటరమేశ్, అనగంటి వెంకటేశ్, వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు, ఉపాధ్యక్షులు బుర్రిప్రసాద్, తెలంగాణ రైతు సంఘం సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, ప్రొఫెసర్ శంకర్ నాయక్, సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు సంజీవ్ నాయక్, ఎల్ హెచ్ పీఎస్ జాతీయ అధ్యక్షులు దాస్ రాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)