Magazines

దసరా సెలవుల్లో ఆస్తులపై బలవంతపు చర్యలు వద్దు

1 గంట క్రితం

holidays
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 16, 2026 | 1 నిమిషాల చదవడం

కక్షిదారుల ప్రయోజనాల పరిరక్షణకు హైకోర్టు ఆదేశాలు

హైకోర్టు బార్ అసోసియేషన్ వినతిపై స్పందన


నవతెలంగాణ-హైదరాబాద్‌
దసరా కోర్టు సెలవుల సమయంలో వివాదాల్లో ఉన్న ఆస్తులపై బలవంతపు చర్యలు చేపట్టకుండా చూడాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఆస్తుల నుంచి వ్యక్తులను బలవంతంగా ఖాళీ చేయించడం, ఇప్పటికే ఉన్న నిర్మాణాలను కూల్చివేయడం వంటి చర్యల వల్ల బాధితులు తమ హక్కులను పరిరక్షించుకునేందుకు న్యాయస్థానాలను ఆశ్రయించడంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో ఈ ఆదేశాలు వెలువడ్డాయి. ఈ మేరకు హైకోర్టు బార్ అసోసియేషన్ చేసిన విజ్ఞప్తిపై న్యాయస్థానం పైవిధంగా స్పందించింది. అక్టోబర్‌ 17 నుంచి 25 వరకు దసరా కోర్టు సెలవులు ఉన్న నేపథ్యంలో, ఈ సమయంలో ఆస్తులకు సంబంధించి ఎలాంటి బలవంతపు చర్యలూ చేపట్టకుండా తగిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం సూచించింది. ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సంబంధిత జిల్లా కలెక్టర్లందరికీ, హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా) సహా సంబంధిత అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని పేర్కొంది.కోర్టు సెలవుల సమయంలో ఆకస్మికంగా ఖాళీ చేయించడం, నిర్మాణాలను కూల్చివేయడం వంటి చర్యలు జరిగితే, బాధితులు తక్షణ న్యాయసహాయం పొందడం కష్టతరమవుతుందని బార్ అసోసియేషన్ న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చింది. సాధారణ న్యాయస్థానాల కార్యకలాపాలు నిలిచివున్న సమయంలో ఇటువంటి చర్యలు జరిగితే, ఆస్తి హక్కులు, న్యాయపరమైన ప్రయోజనాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. శ్రవణ్‌ కుమార్‌.. కక్షిదారుల ప్రయోజనాల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్