మాజీ హవల్దార్ సహా 8 మంది అరెస్టు
12 ఆయుధాలు, 1,912 బుల్లెట్లు స్వాధీనం
వివరాలు వెల్లడించిన
మల్కాజిగిరి సీపీ బి.సుమతి
నవతెలంగాణ-బేగంపేట్
హైదరాబాద్‌లోని బొల్లారం సైనిక ఆయుధాగారంలో జరిగిన చోరీ కేసును మల్కాజిగిరి పోలీసులు ఛేదించారు. చోరీకి గురైన 12 ఆయుధాలు, 1,912 బుల్లెట్లను స్వాధీనం చేసుకుని, ప్రధాన నిందితుడైన మాజీ హవల్దార్ ఉప్పుతొల్ల మల్లేశ్ అలియాస్ రాజుతోపాటు మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేసినట్టు మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి.సుమతి వెల్లడించారు. మల్కాజిగిరి డీసీపీ కార్యాలయంలో శుక్ర వారం మీడియా సమావేశంలో కేసు వివరాలను ఆమె వెల్లడించారు.
ఆగస్టు 31న ఉదయం 7.50 గంటలకు బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్ 20వ బెటాలియన్ ఆయుధాగారం, మందుగుండు సామగ్రి నిల్వ గది తాళాలను గుర్తు తెలియని వ్యక్తులు పగులగొట్టినట్టు సైనిక అధికారులు గుర్తించారు. రైఫిళ్లు, పిస్టళ్లు, మ్యాగజైన్లు, బైనాక్యులర్లు, మందుగుండు సామగ్రి చోరీకి గురైనట్టు తేలింది. లెఫ్టినెంట్ కల్నల్ మయాంక్ గోవితిర్కర్ ఫిర్యాదు మేరకు బొల్లారం పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 207/2026గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిర్దిష్ట సమాచారంతో తెలంగాణ పోలీసుల ఇతర విభాగాల సహకారం తీసుకున్న మల్కాజిగిరి పోలీసులు సెప్టెంబర్ 11న ప్రధాన నిందితుడు మల్లేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. మద్రాస్ రెజిమెంట్ 20వ బెటాలియన్‌లో హవల్దార్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన మల్లేశ్, చోరీ చేసిన ఆయుధాలను నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట సాయినగర్‌లోని తన తండ్రి ఇంట్లో దాచినట్టు గుర్తించారు. అక్కడి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని నిందితుడిని కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.
భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి
పోలీసులు స్వాధీనం చేసుకున్న వాటిలో నాలుగు ఏకే–203 రైఫిళ్లు, వాటికి సంబంధించిన ఐదు మ్యాగజైన్లు, ఇన్సాస్ రైఫిల్, మూడు మ్యాగజైన్లు, ఆరు 9 ఎంఎం పిస్టళ్లు, 12 మ్యాగజైన్లు, 6.35 బోర్ సివిల్ పిస్టల్, మ్యాగజైన్, మూడు బైనాక్యులర్లు ఉన్నాయి. 9 ఎంఎం పిస్టళ్లకు సంబంధించిన 1,156 బుల్లెట్లు, ఏకే–203 రైఫిళ్లకు సంబంధించిన 720 బుల్లెట్లు, ఇన్సాస్ రైఫిల్‌కు సంబంధించిన 36 బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఐదు మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.ప్రధాన నిందితుడు 2022లో బారక్‌పూర్‌లో పనిచేస్తున్న సమయంలో బీర్బల్ షా ద్వారా ఓబి నుంచి కొనుగోలు చేసిన నాటు తుపాకీని కూడా సెప్టెంబర్ 23న అచ్చంపేటలోని ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ తుపాకీని నేరాలకు ఉపయోగించి నట్టు ప్రస్తుత దర్యాప్తులో వెల్లడి కాలేదు. మల్లేశ్‌పై గతంలో అచ్చంపేట, అమ్రాబాద్ పోలీస్ స్టేషన్లలో ఇండ్ల చోరీ కేసులు నమోదయ్యాయి. ఓబిపై పశ్చిమ బెంగాల్‌లోని ఖర్దా పోలీస్ స్టేషన్‌లో ఆయుధాల చట్టం కింద కేసు న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉంది.
పది రోజుల పోలీసు కస్టడీలో కీలక వివరాలు
కోర్టు అనుమతితో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 1 వరకు మల్లేశ్‌ను పోలీసు కస్టడీలో విచారించగా చోరీ వెనుక కుట్ర వెలుగులోకి వచ్చింది. గతంలో తనతో పనిచేసిన కొండూరి శేషులు, వినోద్ కుమార్, కుచరకంటి ప్రవీణ్ సహకారంతో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని ప్రధాన నిందితుడు చోరీ చేశాడు. చోరీ చేసిన ఆయుధాలను పశ్చిమ బెంగాల్‌కు చెందిన అవి డే అలియాస్ ఓబి, బీర్బల్ షా కొనుగోలు చేసేందుకు అంగీకరించారు. పిస్టల్‌కు రూ.3 లక్షలు, రైఫిల్‌కు రూ.5 లక్షల చొప్పున చెల్లించేందుకు ఓబి అంగీకరించినట్టు విచారణలో తేలింది.
సాయుధ దోపిడీలకు పథకం
మల్లికార్జున్, నిరంజన్‌తో కలిసి బ్యాంకులు, నగల దుకాణాలు, సంపన్నుల వద్ద సాయుధ దోపిడీలు చేయాలన్న ఉద్దేశంతో మల్లేశ్ ఆయుధాలను సమకూర్చుకునేందుకు పథకం వేసినట్టు దర్యాప్తులో వెల్లడైంది. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో నిందితులకు ఉగ్రవాద, తీవ్రవాద సంబంధాలు గుర్తించలేదు. ప్రధాన నిందితుడు మల్లేశ్‌ను సెప్టెంబర్ 11న జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపించారు. మిగిలిన ఏడుగురు నిందితులను అరెస్టు చేసి అక్టోబర్ 3న రిమాండ్ కోసం న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నట్టు సీపీ తెలిపారు. సైనిక ఆయుధాల చోరీని ఛేదించడం, చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడం, నేరంలో ప్రమేయమున్న ఎనిమిది మంది పాత్రలను వెలుగులోకి తీసుకురావడం కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు. అరెస్టయిన వారిలో నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన ఉప్పుతొల్ల మల్లేశ్ అలియాస్ రాజు, చెమ్మకర్ నిరంజన్, ప్రకాశం జిల్లాకు చెందిన కొండూరి శేషులు, ప్రకాశం జిల్లాకు చెందిన వినోద్ కుమార్, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కుచరకంటి ప్రవీణ్, పశ్చిమ బెంగాల్ బారక్‌పూర్‌కు చెందిన అవి డే అలియాస్ ఓబి, బీర్బల్ షా, నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన ఉప్పుతొల్ల మల్లికార్జున్ ఉన్నారు.






కామెంట్‌లు (0)