Magazines

రైతన్నకు 22ఏ చిక్కులు

1 గంట క్రితం

Troubles for farmers under Section 22A
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 13, 2026 | 2 నిమిషాల చదవడం

నిషేధిత జాబితాలో ప్రయివేటు భూములు

రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి భూ యజమానుల అవస్థలు

పెండింగ్ దరఖాస్తులతో రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు

సర్వే నంబర్ల వారీగా స్పష్టత కరువు..భూమిపై హక్కున్నా..అమ్ముకోలేని దుస్థితి

తప్పుగా నమోదైన భూములను తొలగించాలని బాధితుల డిమాండ్‌

నవతెలంగాణ – రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి

‘భూమి ఉంది.. పట్టాదారు పాస్‌బుక్కూ ఉంది.. రెవెన్యూ రికార్డుల్లో పేరుంది.. కానీ అవసరానికి భూమిని అమ్ముకునే అవకాశం లేదు. పిల్లల చదువులకు, కుటుంబ అవసరాలకు, వ్యవసాయ పెట్టుబడులకు భూమిని ఉపయోగించుకునే పరిస్థితి లేదు. కారణం.. రిజిస్ట్రేషన్ల చట్టంలోని 22ఏ నిషేధిత భూముల జాబితా. ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు రూపొందించిన నిబంధనల అమలులో చోటుచేసుకున్న పొరపాట్లు కొందరు ప్రయివేటు భూ యజమానులకు సమస్యగా మారాయి. సర్వే నంబర్లను పూర్తిగా నిషేధిత జాబితాలో చేర్చడంతో చట్టబద్ధమైన పట్టాలు ఉన్నవారు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని దరఖాస్తులు చేసుకున్నా పరిష్కారం లభించకపోడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ, అసైన్డ్‌, భూదాన్‌, దేవాదాయ, ఇతర నిషేధిత కేటగిరీలకు సంబంధించిన భూముల గుర్తింపులో సమస్యలు తలెత్తుతున్నాయి. ఒకే సర్వే నంబరులో కొంత భూమి ప్రభుత్వానికి లేదా ఇతర నిషేధిత కేటగిరీకి చెందినదైతే, మొత్తం విస్తీర్ణాన్ని నిషేధిత జాబితాలో చేర్చిన ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో అదే సర్వే నంబర్‌లో చట్టబద్ధమైన హక్కులు కలిగిన ప్రయివేటు భూ యజమానులకూ రిజిస్ట్రేషన్‌ సమస్యలు ఎదురవుతున్నాయి. ఇటీవల నిర్వహించిన సమీక్షలో రంగారెడ్డి జిల్లాలోని ఒక సర్వే నెంబర్‌‌లో 12 ఎకరాల విస్తీర్ణాన్ని 22ఏ జాబితాలో చేర్చగా, అందులో రెండు ఎకరాలు మాత్రమే భూదాన్‌ భూమిగా గుర్తించిన ఉదంతాన్ని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రస్తావించారు. ఇలా జిల్లాలో వేల ఎకరాల్లో ఇదే పరిస్థితి ఉంది.

Troubles for farmers under Section 22Aసర్వే నంబర్ల చిక్కుముడి

రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి మండలం ఖానామెట్‌ గ్రామంలో సర్వే నంబర్లు 41/8, 41/9కు సంబంధించిన భూముల రిజిస్ట్రేషన్‌ వివాదం హైకోర్టు వరకు వెళ్లింది. ఈ భూములను నిషేధిత జాబితాలో చేర్చడాన్ని సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. 2026 ఏప్రిల్‌ 17న వెలువడిన తీర్పులో సంబంధిత రిజిస్ట్రేషన్‌ నిరాకరణకు ఆధారమైన పాత రెవెన్యూ లేఖల చట్టబద్ధతను న్యాయస్థానం పరిశీలించింది. చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్‌ పత్రాలను స్వీకరించాలని ఆదేశించింది. ఈ వ్యవహారం నిషేధిత భూముల జాబితా తయారీలో రికార్డుల కచ్ఛితత్వం ఎంత కీలకమో తెలుస్తోంది. 22ఏ జాబితాలో భూమి నమోదైతే సాధారణంగా అమ్మకం, బదిలీ, తనఖా వంటి లావాదేవీల రిజిస్ట్రేషన్లకు అడ్డంకులు ఏర్పడతాయి. భూమి యాజమాన్యంపై వివాదం లేకపోయినా, రెవెన్యూ రికార్డుల్లో నిషేధిత కేటగిరీ కొనసాగితే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లావాదేవీలు నిలిచిపోయే పరిస్థితి ఉంటుంది. ఫలితంగా భూమిని విక్రయించాలనుకునే యజమానులు, ఆస్తిని తనఖా పెట్టి రుణం పొందాలనుకునేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

​రెవెన్యూ రికార్డుల సవరణ జరిగేనా?

నిషేధిత భూముల జాబితాలో పొరపాట్లను సరిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టు ప్రకటించింది. పాత జాబితాలను ఉపయోగించడం వల్ల కొన్ని ప్రయివేటు ఆస్తులు నిషేధిత కేటగిరీలోకి వెళ్లినట్టు రెవెన్యూ మంత్రి అంగీకరించారు. ప్రభుత్వ భూములకు రక్షణ కల్పిస్తూనే చట్టబద్ధమైన ప్రయివేటు భూముల విషయంలో అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జియో ట్యాగింగ్‌, సర్వే నంబర్ల విభజన, రికార్డుల పరిశీలన ద్వారా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అయితే ఈ చర్యలు క్షేత్రస్థాయిలో ఎంతవరకు అమలయ్యాయనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. భూమిపై హక్కులను నిర్ధారించే పత్రాలున్నా రిజిస్ట్రేషన్‌ చేసుకోలేని పరిస్థితి భూ యజమానులను ఆందోళనకు గురిచేస్తోంది. నిషేధిత జాబితాలో పొరపాటున నమోదైన భూములను గుర్తించి తొలగించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్