ప్రభుత్వ సహకారం ఉంటుంది
యువత, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి :
సమాఖ్య బిజినెస్ సమ్మిట్లో సీఎం ఏ రేవంత్రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రాష్ర్టంలోని పారిశ్రామికవేత్తలు ఇప్పటి వరకు కార్పొరేట్ కంపెనీలకు సర్వీస్ చేసే వైపు మాత్రమే ఉన్నారనీ, కానీ ఇప్పుడు వారంతా గ్లోబల్ ఇన్వెస్టర్లుగా ఎదగాలని సీఎం ఏ రేవంత్రెడ్డి దిశానిర్దేశం చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించేలా స్వరాష్ర్ట, స్వదేశీ పెట్టుబడుదారులు తమ వ్యాపార సామ్రాజ్య వ్యూహాలను బలపర్చుకోవాలన్నారు. ఇప్పటి వరకు ప్రపంచగమనాన్ని పరిశీలిస్తే మహిళల భాగస్వామ్యం ఉన్న దేశాలే ఆర్థికంగా బలపడ్డాయని చెప్పారు. అందువల్ల స్వరాష్ర్టంలో పారిశ్రామికరంగంలో మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. దానిలో భాగంగానే తమ ప్రభుత్వం తెలంగాణలో మహిళలకు రూ.61 వేల కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందించిందని గుర్తుచేశారు. బుధవారం హైదరాబాద్ హైటెక్స్ లో రెండ్రోజుల సమాఖ్య బిజినెస్ సమ్మిట్-2026 ను ఆయన ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కే రఘు రామరాజు, ఎంపీలు డాక్టర్ కే లక్ష్మణ్, వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వీ హనుమంతరావు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాస రావు, దానం నాగేందర్, మున్నూరు కాపు ఫౌండేషన్ చైర్మెన్ బొమ్మ శ్రీరాం చక్రవర్తి, జస్టిస్ భవానీ ప్రసాద్, కరీంనగర్ గ్రంథాలయ చైర్మెన్ సత్తు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఆధునిక యుగంలోనూ సమాఖ్యల అవసరం చాలా ఉందన్నారు. కొత్త తరం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. సినిమా, రాజకీయ రంగాల్లో యువతరం రాణించాలని చెప్పారు. సమాఖ్యలో పెద్దల సక్సెస్ స్టోరీస్ ను నిక్షిప్తం చేసి కొత్త తరానికి అందించాలని సూచించారు.
తెలంగాణ రైజంగ్ 2047 విజన్ డాక్యుమెంట్ గురించి వివరించారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు సమాఖ్య స్ఫూర్తితోనే పనిచేయాలన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు ఉండాలనీ, ఆ తర్వాత అభివృద్ధిపై ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు పరస్పరం సహాకారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని చెప్పారు. 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. దానికోసమే రాష్ర్టాన్ని క్యూర్, ప్యూర్, రేర్ జోన్లుగా విభజించి, భవిష్యత్ ప్రణాళికల్ని అమల్లోకి తెస్తున్నామన్నారు. తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా తీర్చిదిద్దాలన్నదే తమ సంకల్పమని తెలిపారు. ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ 5 శాతం భాగస్వామ్యం కలిగి ఉన్నదనీ, దాన్ని 10 శాతానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తున్నామన్నారు. 400 ఏండ్ల క్రితమే దేశ విదేశాల నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలకు చార్మినార్ ల్యాండ్ మార్క్ గా మారిందనీ, ఆ తర్వాత బిజినెస్ కు హైటెక్ సిటీ ల్యాండ్ మార్క్ అయ్యిందన్నారు. నూతన పారిశ్రామిక విధానంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం కోసమే వారిని ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్స్ కు యజమానుల్ని చేశామని వివరించారు. పారిశ్రామికరంగంలో యువతతో పాటు మహిళలను ప్రోత్సహించాలనీ, దానికి ప్రభుత్వం నుంచి కావాల్సిన సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. రాష్ర్టంలో పెట్టుబడులకు కచ్చితంగా భరోసా ఉంటుందనీ, తెలంగాణ రైజింగ్ లక్ష్యంగా ముందుకు వెళ్దామని పిలుపునిచ్చారు.






కామెంట్లు (0)