Saturday, July 19, 2025
E-PAPER
Homeజాతీయంతొక్కిసలాటకు ఆర్సీబీనే కారణం..సంచలన నివేదిక

తొక్కిసలాటకు ఆర్సీబీనే కారణం..సంచలన నివేదిక

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఐపీఎల్‌లో తొలి ట్రోఫీ నెగ్గిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) నిర్వహించతలపెట్టిన విజయోత్సవ ర్యాలీలో తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. సుమారు 50 మంది వరకూ గాయపడ్డారు. ఇక ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం సంచలన నివేదికను హైకోర్టుకు సమర్పించింది. ఈ రిపోర్ట్‌లో ఆర్సీబీని సిద్ధరామయ్య ప్రభుత్వం నిందించింది.

తొక్కిసలాటకు ఆర్సీబీనే కారణమని పేర్కొంది. విజయోత్సవ పరేడ్‌ విషయంలో ఆర్సీబీ యాజమాన్యం ఏకపక్షంగా వ్యవహరించిందని ఆరోపించింది. పోలీసులను సంప్రదించకుండా పెద్ద ఎత్తున అభిమానులను ఈవెంట్‌కు ఆహ్వానించినట్లు పేర్కొంది. ఈ మేరకు హైకోర్టులో నివేదిక సమర్పించింది. అయితే, ఈ రిపోర్ట్‌ను గోప్యంగా ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. ఈ నివేదిక గోప్యతకు ఎలాంటి చట్టపరమైన కారణాలు లేవని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వం సమర్పించిన రిపోర్ట్‌ను కోర్టు ఆదేశాల మేరకు బహిరంగంగా విడుదల చేశారు.

విజయోత్సవ పరేడ్‌ కోసం ఆర్సీబీ యాజమాన్యం కేవలం సమాచారం మాత్రమే ఇచ్చిందని ప్రభుత్వం పేర్కొంది. నిబంధనల ప్రకారం ఈవెంట్‌కు ఎలాంటి అనుమతులూ కోరలేదని తెలిపింది. ఐపీఎల్‌లో విజయం అనంతరం ఆర్సీబీ తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో విక్టరీ పరేడ్‌ గురించి పోస్టు పెట్టినట్లు తెలిపింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఈ వేడుకకు ఉచిత ప్రవేశమని ప్రకటించింది. దీంతో స్టేడియం సామర్థ్యానికి మించి 3 లక్షల మందికి పైగా హాజరయ్యారు. ఇలాంటి ఈవెంట్‌ల కోసం కనీసం ఏడు రోజుల ముందే అనుమతులు తీసుకోవాలని ప్రభుత్వం తన నివేదికలో పేర్కొంది. నిర్వాహకులు సరైన ప్రణాళికలు లేకపోవడం, సంబంధిత అధికారులకు ముందస్తు సమాచారం అందించడంలో విఫలం కావడం వల్లే తొక్కిసలాట జరిగిందని ప్రభుత్వం వెల్లడించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -