Sunday, May 4, 2025
Homeఆటలుథ్రిల్లర్‌లో ఆర్‌సీబే విన్నర్‌

థ్రిల్లర్‌లో ఆర్‌సీబే విన్నర్‌

- Advertisement -

– 2 పరుగుల తేడాతో బెంగళూర్‌ గెలుపు
– ఛేదనలో అయుశ్‌, జడేజా పోరాటం వృథా
– రొమారియో షెఫర్డ్‌ 14 బంతుల్లో ఫిఫ్టీ
– బెంగళూర్‌ 213/5, చెన్నై 211/5
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ అదరగొట్టింది. థ్రిల్లర్‌లో మరోసారి సూపర్‌కింగ్స్‌పై పైచేయి సాధించి, 2 పరుగుల తేడాతో మెరుపు విజయం సాధించింది. 214 పరుగుల ఛేదనలో అయుశ్‌ మాత్రె (94), రవీంద్ర జడేజా (77 నాటౌట్‌) మెరిసినా సూపర్‌కింగ్స్‌ గెలుపు గీత తాకలేదు. రొమారియో షెఫర్డ్‌ 14 బంతుల్లో అర్థ సెంచరీ బాదగా తొలుత రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ భారీ స్కోరు సాధించింది. సీజన్లో ఎనిమిదో విక్టరీతో పాయింట్ల పట్టికలో బెంగళూర్‌ అగ్రస్థానానికి చేరుకుంది
నవతెలంగాణ-బెంగళూర్‌

ఐపీఎల్‌లో లెక్కలేనన్ని పీడకలలు మిగిల్చిన చెన్నై సూపర్‌కింగ్స్‌పై రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ తీయని ప్రతీకారం తీర్చుకుంది. ఐపీఎల్‌లో తొలిసారి ఆ జట్టుపై ఓ సీజన్లో రెండు సార్లు విజయ ఢంకా మోగించింది. 214 పరుగుల ఛేదనలో సూపర్‌కింగ్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 211 పరుగులు చేసింది. యువ ఓపెనర్‌ అయుశ్‌ మాత్రె (94, 48 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లు), రవీంద్ర జడేజా (77 నాటౌట్‌, 45 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధనాధన్‌ అర్థ సెంచరీలతో కదం తొక్కినా.. ఆఖర్లో బెంగళూర్‌ బౌలర్లు అద్భుతం చేశారు. షేక్‌ రషీద్‌ (14), శామ్‌ కరణ్‌ (5), డెవాల్డ్‌ బ్రెవిస్‌ (0), ఎం.ఎస్‌ ధోని (12) నిరాశపరిచారు. శివం దూబె (8 నాటౌట్‌) ఆఖర్లో సిక్సర్‌తో ఆశలు రేపినా.. 3 బంతుల్లో 6 పరుగులు చేయాల్సిన దశలో యశ్‌ దయాల్‌ కండ్లుచెదిరే యార్కర్లతో జడేజా, దూబెలను కట్టడి చేశాడు. జడేజా, అయుశ్‌ జోడీ మూడో వికెట్‌కు 64 బంతుల్లోనే 114 పరుగులు జోడించింది. దీంతో చెన్నై గెలుపు దిశగా సాగింది. కానీ వరుస బంతుల్లో అయుశ్‌, బ్రెవిస్‌ నిష్క్రమణతో సూపర్‌కింగ్స్‌ ఒత్తిడిలో పడింది. ధోని, జడేజా జోడీ 18 బంతుల 29 పరుగుల భాగస్వామ్యం సూపర్‌కింగ్స్‌ను రేసులో వెనక్కి నెట్టింది!. బెంగళూర్‌ పేసర్‌ లుంగిసాని ఎంగిడి (3/30) మూడు వికెట్ల మెరువగా.. యశ్‌ దయాల్‌ ఆఖరు ఓవర్లో అద్భుత ప్రదర్శన చేశాడు. భువనేశ్వర్‌ కుమార్‌ (0/55), సుయాశ్‌ శర్మ (0/43)లు అంచనాలు అందుకోలేదు.
రొమారియో ధనాధన్‌ : తొలుత బ్యాటింగ్‌ చేసిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ 213 పరుగులు చేస్తుందని ఎవరూ అనుకోలేదు. 18 ఓవర్లలో 159/5తో నిలిచిన బెంగళూర్‌కు రొమారియో షెఫర్డ్‌ (53 నాటౌట్‌) భారీ స్కోరు అందించాడు. ఆరు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 14 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించిన రొమారియో.. సూపర్‌కింగ్స్‌ బౌలర్లు ఖలీల్‌ అహ్మద్‌, మతీశ పతిరణలపై విరుచుకుపడ్డాడు. చివరి రెండు ఓవర్లలో 54 పరుగులు పిండుకున్న బెంగళూర్‌.. సూపర్‌కింగ్స్‌కు నైరాశ్యంలోకి నెట్టివేసింది. తొలుత ఓపెనర్లు జాకబ్‌ బెతెల్‌ (55, 33 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), విరాట్‌ కోహ్లి (62, 33 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో రాణించారు. తొలి వికెట్‌కు 97 పరుగులు జోడించినా.. మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్లు తడబాటుకు గురయ్యారు. దేవదత్‌ పడిక్కల్‌ (17), రజత్‌ పాటిదార్‌ (11), జితేశ్‌ శర్మ (7) విఫలమయ్యారు. దీంతో బెంగళూర్‌ స్వల్ప స్కోరుకే పరిమితం అయ్యేలా కనిపించింది. 14 బంతుల్లో రొమారియో ఇన్నింగ్స్‌ స్వరూపాన్నే మార్చివేశాడు. సూపర్‌కింగ్స్‌ పేసర్‌ మతీశ పతిరణ (3/36) మూడు వికెట్లు పడగొట్టాడు. ఖలీల్‌ అహ్మద్‌ మూడు ఓవర్లలోనే 65 పరుగులు సమర్పించుకున్నాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -