దుఃఖాల శిఖరాగ్రాన్ని చుట్టుకుని
ఓ సంతోషపు రేణువు
వేళ్లాడుతూనే వుంటుంది
అందిపుచ్చుకుని ఆవలితీరం చేరేందుకు..
నిలువెల్లా నిర్వీర్యం అయ్యిందనుకున్న చోట
కంటికి కానరాని ఓ ఆశల అంకురం
చిగురిస్తూ వుంటుంది
పాతాళం వైపు పయనిస్తున్న బాటలోనే
ఓ కొత్త చరిత్రకు దారి దాగుంటుంది
కళ్ళముందు శూన్యం తచ్చాడు తున్నప్పుడే
గతితార్కిక భౌతికవాద స్ఫూర్తి
నిన్ను కదిలిస్తూ వుంటుంది
గాయపడ్డ మనసేప్పుడూ
ఓ సుందర మహీరుహం క్రింద
సేదతీరుతూ వుంటుంది
అహరహం భగ్గుమంటున్న
వ్యధాగ్నిని చల్లార్చేందుకు
ఓ చిరుజల్లుల కళ సిద్ధంగా వుంటుంది
నీ చూపుల ముందు
ఎన్ని అద్భుత వస్తు రాశులున్నా
పారదర్శకపు ముసుగేసుకున్న
ఒంపుసొంపుల జ్యూయిష్ స్త్రీ ప్రతిరూపం
నిన్ను మోహిస్తూ మైకంలో పడేయోచ్చు
కాలంతోపాటు కరిగిపోతున్న శిలల మధ్య
ఓ దశ్యం ఎప్పటికీ జీవించే
ఉంటుందనేది సత్యం
అది ఒకానొక ప్రపంచ ప్రసిద్ధ
రెబెక్కా శిల్పం కావచ్చు..!
– డా.కటుకోఝ్వల రమేష్, 9949083327
రెబెక్కా…
- Advertisement -