నవతెలంగాణ-హైదరాబాద్: దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ఆయా రాష్ట్రాల్లో కొన్ని జిల్లాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్‌ను ప్రకటిస్తున్నట్లు వెల్లడించింది. రియాసి, జమ్మూ, సాంబ, కతువా, ఉదమ్‌పూర్, దోడా జిల్లాలకు ఐఎండి రెడ్ అలర్ట్ జారీ చేసింది. వీటితో పాటు మంగళవారం ఉదయం కిష్త్వార్ జిల్లాకు కూడా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్‌ను ప్రకటించింది. జమ్మూకాశ్మీర్‌లోని భారీ వర్షాలకు రోడ్లనీ జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కాగా, హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక చాంబా, మండి, కాంగ్రా జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నందున ఐఎండి ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడి వరదలు సంభవించే అవకాశం ఉంది. దీంతో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అప్రమత్తంగా ఉండమని అధికారులు నివాసితులను కోరారు. అలాగే పంజాబ్‌లో లుథియానా, సంగ్రూర్, బర్నాలా, మాన్సా జిల్లాలో ఉరుమలు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.