నవతెలంగాణ-హైదరాబాద్ : కమ్యూనిస్టు మిత్రులను స్ఫూర్తిగా తీసుకొని గత అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడి.. పాశవికంగా వ్యవహరించిన ప్రభుత్వాలను పడగొట్టామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. దేశాన్ని పట్టి పీడిస్తున్న పాశవిక శక్తులను ఓడించడానికి ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరముందన్నారు. సీపీఐ శతాబ్ది ముగింపు ఉత్సవాలు ఖమ్మంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఖమ్మంలోని ఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు రేవంత్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు, సీపీఐ అగ్రనేతలు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన సీపీఐ శ్రేణులతో ఖమ్మం నగరం ఎరుపెక్కింది.
ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్, కమ్యూనిస్టు సోదరులు కొట్లాడితేనే దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. దున్నివాడిదే భూమి అని కమ్యూనిస్టు పార్టీ నినాదం ఇస్తే.. దానికి చట్టరూపం కల్పించింది కాంగ్రెస్ సర్కారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. రజాకార్లకు, నిజాంకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పోరాడారు. ఆనాడు జరిగిన సాయుధ రైతాంగ పోరాటంలో 4 వేల మంది వీరులు అమరులయ్యారు. మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా ఎర్రజెండా తలెత్తి నిలబడుతుంది. కమ్యూనిస్టుల కంచుకోట ఖమ్మంలో ఈ సభ జరగడం హర్షణీయం.
బ్రిటీషర్ల కంటే ఎక్కువ ప్రమాదం బీజేపీతోనే. బీజేపీ అంటే బ్రిటీష్ జనతా పార్టీ. విభజించు, పాలించు, పేదవాళ్లను అణగదొక్కాలని బ్రిటీషర్ల నుంచి వచ్చిన ఆలోచనతోనే… ఇవాళ మనల్ని అణచివేయాలని చూస్తోంది. ఆనాడు కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ కలిసి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొస్తే.. ఇవాళ ఆ పథకాన్ని రద్దు చేశారు. నరేంద్ర మోదీ కార్పొరేట్ కంపెనీల చేతిలో కీలుబొమ్మగా మారి ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడిచి.. మల్టీ నేషనల్ కంపెనీలకు మన హక్కులను తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఉపాధి హామీ పథకం రద్దుతో మళ్లీ వలసలు మొదలవుతాయి. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చడానికి, పేదల హక్కులు కొల్లగొట్టడానికి భాజపా 400 సీట్లు అడిగింది. కానీ, రాహుల్ గాంధీ, కమ్యూనిస్టులు ప్రజల దగ్గరకు వెళ్లి చెప్పడంతో.. 240 సీట్ల వద్దే ఆ పార్టీ ఆగింది. రాజ్యాంగాన్ని దెబ్బ తీసేందుకు మళ్లీ ఎస్‌ఐఆర్ (SIR) తీసుకొచ్చారు. ఎస్‌ఐఆర్ ద్వారా పేదల ఓటు హక్కును కేంద్రం రద్దు చేస్తోంది’’ అని సీఎం ఆరోపించారు.



