నవతెలంగాణ-హైదరాబాద్: రేపు ఢిల్లీ వేదికగా జరగనున్న పంద్రాగష్టు వేడుకలకు సర్వం సిద్దమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. స్వాతంత్ర దినోత్సవ సన్నాహాల్లో భాగంగా ఈ కార్యక్రమంలో సుమారు 2,500 మంది మహిళా, పురుష క్యాడెట్లు, మై భారత్ వాలంటీర్లు న్యూ ఇండియా లోగోను తయారు చేస్తూ అద్భుతమైన దృశ్యాన్ని సృష్టిస్తారు.
79వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని దేశవ్యాప్తంగా 140కి పైగా ప్రదేశాల్లో సైనిక, పారామిలిటరీ దళాలు ఆపరేషన్ సిందూర్ విజయం పేరుతో అద్భుతమైన ప్రదర్శనలు ఇవ్వబోతున్నాయి. ఈ వేడుకలు మన దేశ ఐక్యత, అభివృద్ధి, స్వావలంబన స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయి. ఇంకా స్పెషల్ విషయం ఏంటంటే, ఈ గ్రాండ్ ఈవెంట్ కోసం 5000 మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు.
భారత సైన్యం, నేవీ, వైమానిక దళం, కోస్ట్ గార్డ్, NCC, CRPF, BSF, ITBP, CISF, SSB, RPF, అస్సాం రైఫిల్స్ వంటి దళాల బ్యాండ్‌లు దేశవ్యాప్తంగా 96 నగరాల్లో సంగీత ప్రదర్శనలు ఇవ్వబోతున్నాయి. ఈ బ్యాండ్‌ల సంగీతం దేశ బలం, ఐక్యతను చాటి చెబుతుంది. ఈ క్రమంలో ఢిల్లీలోని ఇండియా గేట్, కర్తవ్య పథ్, విజయ్ చౌక్, పురానా ఖిలా, నిజాముద్దీన్, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ల వంటి ఐకానిక్ ప్రదేశాలు ఈ వేడుకలతో కళకళలాడనున్నాయి.