నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమాసియా యుద్ధంతో ఒక్కసారిగా దేశంలో గ్యాస్, పెట్రోల్, డీజీల్ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. రోజుల తరబడి గ్యాస్ ఏజెన్నీల ముందు సామాన్య జనాలు బారులుతీరుతున్నారు. పెట్రోల్, డీజిల్ కోసం బంకుల ఎదుట ఆటోలు, కారులు, తదితర వాహనాలు కిలోమీటర్ల మేర క్యూలైన్లో పడిగాపులు కాస్తున్నాయి. గ్యాస్ కొరతతో డొమిస్టిక్, కమర్షియల్ సిలిండర్ల పై మోడీ సర్కార్ రేట్లు పెంచింది. అదే విధంగా బుకింగ్ గడువును కూడా పెంచింది. ఇటీవల ప్రీమియర్ పెట్రోల్, ఇండస్ట్రియల్ డీజిల్ పై బీజేపీ ప్రభుత్వం రేట్లలను సవరించింది. అయితే అన్నింటిమీద రేట్లు పెంచిన బీజేపీ ప్రభుత్వం తాజాగా పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటర్‌కు రూ.10 చొప్పున తగ్గిస్తూ ఈరోజు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ తాజా తగ్గింపుతో లీటర్ పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం కేవలం రూ.3కు చేరగా, డీజిల్‌పై సుంకాన్ని పూర్తిగా రద్దు చేసి సున్నాకు తగ్గించింది.
ఈ నిర్ణయంపై బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సెటైర్లు వేశారు. బట్టల దుకాణంలో చీరలు కొనడానికి వెళ్లనప్పుడు షాప్ యాజమాని చీర రేట్ ఎక్కువ చేసి చేపుతాడని, సదురు చీరపై బేరం ఆడగానే..రూ.1000 చీర, నాలుగు వందల రూపాయలకు ఇస్తాడని ఆమె వివరించింది. అదే విధంగా ప్రస్తుతం చమురుపై మోడీ సర్కార్ ఎక్సైజ్ సుంకం తగ్గించడం కూడా ఇదే కోవలోకి వస్తుందని సీఎం మమతా బెనర్జీ ఎద్దేవా చేశారు. యుద్ధం సాకుతో గ్యాస్ రేట్లు పెంచి వాటిపై పన్నులు తగ్గిస్తే..ధరల్లో తగ్గుదల ఎలా ఉంటుందని, ఈ నిర్ణయం పేదలకు ఏలా మేలు చేస్తుందని మోడీ సర్కార్‌ను ఆమె ప్రశ్నించారు.



