నవతెలంగాణ-హైదరాబాద్ : నకిలీ మద్యం తయారీ కేసులో అరెస్టయిన 11 మంది నిందితులకు విజయవాడ కోర్టులో చుక్కెదురైంది. వారి రిమాండ్‌ను ఈ నెల 13వ తేదీ వరకు పొడిగిస్తూ విజయవాడ ఆరో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ జి.లెనిన్‌బాబు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.
కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దనరావుతో పాటు తిరుమలశెట్టి శ్రీనివాసరావు, డి.శ్రీనివాసరెడ్డి, అంగులూరి వెంకట కల్యాణ్, నకిరికంటి రవి, తాండ్ర రమేశ్‌బాబు, షేక్ అల్లాబక్షు, చెక్కా సతీష్‌కుమార్ నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్నారు. మరో ముగ్గురు నిందితులు అద్దేపల్లి జగన్మోహనరావు, బాదల్ దాస్, ప్రదీప్ దాస్ విజయవాడ జిల్లా జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు.
మరోవైపు ఈ కేసులో అద్దేపల్లి సోదరులు, జోగి సోదరులతో సహా తొమ్మిది మంది దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. నిందితుల బెయిల్ పిటిషన్లపై ఎక్సైజ్ శాఖ అధికారులు గురువారం కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. దీంతో ఈ పిటిషన్లపై తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది.



