Monday, June 16, 2025
E-PAPER
Homeదర్వాజవాదాలు ధోరణులు అర్థమైతేనే పరిశోధనకు పురోగతి

వాదాలు ధోరణులు అర్థమైతేనే పరిశోధనకు పురోగతి

- Advertisement -

సాహిత్యంలో భిన్న వాదాలు (Different Isms), భిన్నధోరణులు (Different Trends) ఎందుకు సంభవిస్తాయి అనే ప్రశ్నకు సమాధానం తెలియకుండా విద్యార్థులు ఆయా వాదాల్లో ఆవిష్కతమైన కవులను రచయితలను రచనలను సరిగ్గా అర్థం చేసుకోలేరు. అధ్యయనం ద్వారా సాహిత్యం పట్ల రావాల్సిన అవగాహనకు రాకుండా విద్యార్థులకే కాదు అధ్యాపకులకూ సాహిత్యం యొక్క ఉద్దేశం(Intention), సారం (Essence) బోధపడవు. సాహిత్య ఉద్దేశం సారం రెండిటి లోతులు తెలిసివుండటం వల్ల అధ్యాపకులు తరగతిగదిలో రాణించగలుగుతారు. ఈ రాణింపుతో అనుసంధానమైన అభ్యాసకుల ద్వారానే సమాజానికి కొత్త ఆలోనలు (New Thoughts) ప్రోది అవుతుంటాయి. ఫలితంగా విద్యార్థులు నవనవోన్మేశంగా స్పందిస్తుంటారు.

రచనా ఉద్దేశం, రచనా సారం బోధపడని చోట్ల రచనల ప్రాసంగికత (Relevance) సైతం అవగాహన చేసుకోవడం కష్టం. అందుకే బోధించే అధ్యాపకులైనా నేర్చుకునే విద్యార్థులైనా అభిరుచి కలిగిన పాఠకులుగా సమగ్ర అధ్యయనం కొనసాగిస్తూ వుండాలి. సాహిత్యంలో పాఠకుడి పాత్ర (Role of the reader) ను గురించి ”A reader should assume that a writer communicates for a certain purpose(s) to a certain audience’’ ( Robert J. Tierney and Jill LaZansky- The Rights and Responsibilities of Readers and Writers: A Contractual Agreement- 608) అనే మాట ఒకటుంది. దీన్ని సాధారణ పాఠకులతోపాటు సాహిత్య అధ్యాపకులు, విద్యార్థులు సదా గుర్తుపెట్టుకోవాల్సి వుంది. పఠనం అంటే కేవలం ఒక పుస్తకాన్ని తీసుకొని పుటలను తిప్పేయడం కాదు. చదువుతున్నప్పుడు పాఠకుడు రచయితతో ఒక ఒప్పందం చేసుకుంటుండాలి. ఈ ఒప్పందం రచయిత చదువరిని నిర్బంధించే దానికి మించి విముక్తిని ప్రసాదించగలదు. ఏ రకమైన విముక్తిని సాహిత్యం ప్రసాదించగలదు అనే ప్రశ్నకు పాఠకులకు అనుభవం మీద తెలియగలదు. ఒక్కొక్కరిది ఒక్కోరకమైన ఒక్కో విముక్తి. నా వరకు నాకైతే ఆ కవిత, ఆ కథ, ఆ నవల, ఆ నాటకం చదవక ముందటి అభిప్రాయాలు విశ్వాసాలు భావన పూర్తిగా దిద్దుబాటు (Correction) జరిగి మనసులో కొత్త ఆలోచనలు ఆచరణలు అంకురిస్తాయి. అసంగత భౌతిక, మానసిక ప్రపంచాల నుండి సాహిత్యం సంపూర్ణ విముక్తి కల్పించగలదు.
సాహిత్యంలో కవులు రచయితలను వాదాలే రూపొందిస్తాయనేది ఒక పార్శ్వమైతే, వాదాలు ధోరణులను కవులు రచయితలు అనుసరించే కొత్త పంథాలు, మార్గాలు ఆధారంగా నడుస్తుంటాయనేది మరో పార్శ్వం. వాదాలను ధోరణులను సష్టించిన కవులు రచయితలు ఉన్నట్టే, వాదాలు ధోరణుల్లో రాసిన వాళ్లూ ఉన్నారు, ఉంటారు. వాదాలు, ధోరణుల సష్టించిన పెద్దలను ‘యుగకర్తలు, వైతాళికులు(Epoch makers)’ అని సంబోధించుకుంటున్నాం. వాదాల్లో ధోరణుల్లో కొనసాగిన వాళ్లను ‘అనుయాయులు (Followers)’ అంటున్నాం. సాహిత్యంలోనే కాదు ఏ రంగంలోనైనా అనుయాయుల కొనసాగింపు ప్రత్యేక కషి మూలంగానే వీటికి తమదైన ప్రచారం గుర్తింపు లభిస్తాయి. ఇందుకు విశ్వ సాహిత్యంలోనే కాదు, మన తెలుగు సాహిత్యంలోనే ఉదాహరణలు అనేకం. అయితే వీటికి సంబంధించి సహేతుకమైన ప్రశ్నలను వేసుకోవడం, తత్సబంధ సమధానాల కోసం సమగ్ర పరిశోధన సాహిత్య విమర్శలో ఒక కీలకమైన అంశం. ఇందుకు సాహిత్యాన్ని బోధించే అధ్యాపకులు విద్యార్థులకు ఎప్పటికప్పుడు మెంటారింగ్‌ చేస్తుండాలి. అప్పుడే విద్యార్థులు ఉత్తమ పరిశోధకులుగా తయారవుతారు. పరిశోధకుల ఆసక్తిని బట్టే పరిశోధనా క్షేత్రంలో వినూత్న పరిశోధనాంశాలు (Research Topics) రిజిస్టర్‌ అవుతాయి. సావధానం కనబరిచే విద్యార్థుల సమకాలీన చైతన్యం ఫలించి ఆయా వాదాల ధోరణుల ఆవిర్భావానికి కారణభూతమైన విషయాలన్నీ సాహిత్య చరిత్రలో నమోదవుతాయి. యుగాల నిడివి, యుగకర్తల కంట్రిబ్యుషన్‌, అనుయాయులు వాదాలు ధోరణులకు కల్పించిన విస్తతి స్పష్టంగా తెలుస్తాయి. ఇందుగురించే ఆయా విశ్వవిద్యాలయాల్లో యుగకర్తల పేరుమీద, వాదాల ధోరణుల పేరుమీద ప్రత్యేక అధ్యయన కేంద్రాలు, పీఠాలు ఏర్పడ్డాయి, మరిన్ని ఏర్పడాల్సి వుంది కూడా. సాహిత్య సాంస్కతిక అధ్యయనాలు లేదా పరిశోధనలు (Literature and Cultural Studies) విద్యార్థులను కళలు, మతం, రాజకీయాలు, పాలనా వ్యవహారాలు, ప్రాపంచిక మార్పులు, చారిత్రక సంప్రదాయాలు, సైన్సు ప్రభావాలు వ్యవస్థీకత సంక్లిష్టతలను విశ్లేషించేందుకు ఆయా స్పెషలైజేషన్లు పూనికనిస్తాయి. ఇదే క్రమంలో చరిత్ర వర్తమానానికి, వర్తమానం భవిష్యత్తకు అందివ్వగల చోదకశక్తిని సాహిత్య అధ్యయనాలు విడమరిచెబుతాయి.
వివిధ సాహిత్య ఉద్యమాల నుండి భావనలు, ఆచరణలకు సైద్ధాంతిక మూలాలను జోడించి బహుళ దక్కోణాలను అనుసరిస్తూ, ఆయా యుగాల కాలాల సాహిత్య గమనాన్ని మూల్యాంకనం చేసేందుకు కూడా స్పెషలైజేషన్లు ఉపయోగపడతాయి. సాహిత్య రంగానికి ప్రపంచ పరిణామాలకు మధ్యగల సమ్మతి వైరుధ్యాలకు ప్రజాక్షేత్రంలో పెల్లుబికిన ప్రతిస్పందనను అంచనా వేయడానికి వీలు కలుగుతుంది.
భిన్నవాదాలు ధోరణుల్లో కొత్త ఇతివత్తాలు, ఆ ఇతివత్తాల్ని మోసే పాత్రలు ఆవిష్కతమవుతూ వుండటం పరిపాటి. నిజానికి ఇతివత్తాలు పాత్రలే నవ్యతకు ప్రాతినిథ్యం వహిస్తాయి. అప్పటిదాకా పాతుకుపోయిన కులం, మతం, వర్గం, జెండర్‌ ఇత్యాది అంశాల్లోగల నిరంకుశత్వాన్ని వెనక్కి నెట్టి ఆధునికతకు పట్టం కడతాయి. ఇక్కడే కొత్త గొంతులను వాదాలు ధోరణులు సమీకరిస్తాయి. రాచరికం, భూస్వామ్యం, పారిశ్రామికీకరణ, పెట్టుబడిదారి వ్యవస్థలు శాసిస్తూ చెబుతూవచ్చిన తమ అనుకూల భావజాలం (Ideology) పైన, కథనాల (Narratives) మీద తిరుగుబాటుగా కలాలు ఉద్యమోన్ముఖంగా విజృంభిస్తాయి. ప్రజలు- స్వేచ్ఛ కేంద్రబిందువుగా రచనలు వెల్లువెత్తుతాయి.
అయితే, ఇతివత్తం ఏదైనా, ఇతివత్తాన్ని లీడ్‌ చేసే పాత్రలు ఏవైనా ప్లేటో మహాశయుడు చెప్పినట్టు»In respect of character there are four things to be aimed at. First, most important, it must be good. Second thing to aim at is propriety. Thirdly, Character must be true to live. Fourth point is consistency (Aristotle, POETICS-XV, Page 51)” అనే నాలుగు సద్గుణాలుంటేనే కొత్త వాదాలు ధోరణులకు ఆదరణ లభిస్తుంది. సద్గుణం కొరవడితే అవి కేవలం వివాదాస్పదం అవుతాయి. వివాదాస్పద రచనలు పాపులర్‌ అయిన సందర్భాలు మనకు తెలుసు. విలువల సముద్ధరణ (Values Setting) లో వివాదాస్పదం అవడం వేరు, విలువల ధ్వంసం (Values Breaking) లో వివాదాస్పదం అవడం వేరు. విలువల సముద్ధరణ కోసం ఆవిర్భవించిన వాదాలు ధోరణులే తమవైన సాహిత్య విలువలనూ నిలబెడతాయి. అప్పుడే వాదాలు ధోరణులు ఉద్యమ స్థాయికి చేరుకుంటాయి. ఇటాలియన్‌ మార్క్సిస్టు తత్వవేత్త ఫ్రాంకో బెరార్డి వ్యాఖ్యానించినట్టు ‘ఆధునిక యుగం అనేది మానవులు ఒంటరిగా లేదా ఉమ్మడిగా, తమ సంకల్పం అనే సుత్తితో చరిత్ర పాలరాయిని చెక్కగలిగే సమయం’ అయితే ఇప్పుడిది కనుచూపు మేరలో కనిపించకుండా పోయిన పరిస్థితి. ఇకమీదట ప్రపంచంలో ప్రగతిశీల లౌకిక కోణం లేదు, చరిత్ర ముగిసిందనే వాదన ముందుకు వచ్చిన నేపథ్యంలో దశ్యగత అంశాలనే కాకుండా ఆలోచనల గురించి ఆలోచించే కొత్త సాహిత్యం కోసం, సామ్యవాద లౌకిక ప్రజాస్వామిక ప్రాదేశిక సాహిత్యాల పునరుజ్జీవం గురించి అధ్యాపకులు విద్యార్థులతో విపులంగా చర్చించాలి. ఉభయులకు తరగతిగది మంచి వనరు. విద్యార్థులకు సమ్యక్‌ దష్టి, నిశిత దక్కోణం ఏర్పడేది లోతైన అధ్యయనంతోనే. ఇందుకు భిన్న వాదాలు ధోరణుల ఉద్దేశం, సారం తెలిసిన అధ్యాపకుడే ఆలంబన, నిర్దేశకుడు. అప్పుడే పరిశోధనకు పురోగతి.

– డా.బెల్లి యాదయ్య,
98483 92690

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -