నవతెలంగాణ-హైదారాబాద్: గోవా ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపదిముర్ము విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలోని మృతులకు వారు సంతాపం తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆమె ప్రార్థించారు. ఈ మేరకు ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. అలాగే ప్రధాని మోడీ కూడా గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతులకు ఆయన సంతాపం వ్యక్తం చేశారు.
గోవాలోని శ్రీగావ్‌లోని లైరాయ్ దేవి ఆలయంలో శనివారం జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించగా, 60 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం గోవా మెడికల్ కాలేజీ (జిఎంసి), మాపుసాలోని నార్త్ గోవా జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. నిప్పుల మీదుగా చెప్పులు లేకుండా నడిచే ఆచారం ఈ ఉత్సవం ప్రత్యేకత. ఒకేసారి ఎక్కువమంది నడిచేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగి ఆరుగురు మృతి చెందగా, 60మందికి పైగా గాయపడ్డారు. ఈ సంఘటన తర్వాత గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పరిస్థితిని సమీక్షించడానికి ఉత్తర గోవా జిల్లా ఆసుపత్రిని సందర్శించారు.