Friday, October 10, 2025
E-PAPER
Homeజాతీయంరిటైర్డ్ ఇంజనీర్ ఇంట్లో సోదాలు.. కట్టలకొద్దీ నోట్లు, కిలోల కొద్దీ బంగారం..17 టన్నుల తేనె..!

రిటైర్డ్ ఇంజనీర్ ఇంట్లో సోదాలు.. కట్టలకొద్దీ నోట్లు, కిలోల కొద్దీ బంగారం..17 టన్నుల తేనె..!

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: మధ్యప్రదేశ్‌లో ఓ రిటైర్డ్ ప్రభుత్వ అధికారి ఇంట్లో జరిగిన లోకాయుక్త దాడులు పెను సంచలనం సృష్టించాయి. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పీడబ్ల్యూడీ) రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ జి.పి.మెహ్రా నివాసాలు, ఇతర ఆస్తులపై గురువారం అధికారులు జరిపిన సోదాల్లో కుప్పలుతెప్పలుగా అక్రమాస్తులు బయటపడ్డాయి. నగదు, బంగారం మాత్రమే కాదు, ఏకంగా 17 టన్నుల తేనె నిల్వలను చూసి అధికారులు విస్తుపోయారు.

ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న పక్కా సమాచారంతో లోకాయుక్త డీఎస్పీ ర్యాంక్ అధికారుల నేతృత్వంలో బృందాలు ఏకకాలంలో భోపాల్, నర్మదాపురంలోని నాలుగు ప్రాంతాల్లో దాడులు ప్రారంభించాయి. భోపాల్‌లోని మణిపురం కాలనీలో ఉన్న మెహ్రా నివాసంలో రూ.8.79 లక్షల నగదు, సుమారు రూ.50 లక్షల విలువైన ఆభరణాలు, రూ.56 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ పత్రాలను గుర్తించారు. సమీపంలోని ఓపల్ రీజెన్సీ అపార్ట్‌మెంట్‌లోని మరో ఇంట్లో సోదాలు చేయగా, రూ.26 లక్షల నగదు, రూ.3.05 కోట్ల విలువైన 2.6 కిలోల బంగారం, 5.5 కిలోల వెండి లభించాయి. లభించిన నగదును లెక్కించేందుకు కౌంటింగ్ మెషీన్లను వినియోగించాల్సి వచ్చింది.

అయితే, అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన విషయం నర్మదాపురం జిల్లా సోహాగ్‌పూర్‌లోని ఆయన ఫామ్‌హౌస్‌లో వెలుగుచూసింది. అక్కడ అధికారులు ఏకంగా 17 టన్నుల తేనె నిల్వలను కనుగొన్నారు. అంతేకాకుండా, అదే ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న 32 కాటేజీలు, ఇప్పటికే పూర్తయిన ఏడు కాటేజీలు, ఆరు ట్రాక్టర్లు, చేపల పెంపకానికి ఓ చెరువు, గోశాల, ఒక గుడి కూడా ఉన్నట్లు గుర్తించారు. ఫోర్డ్ ఎండీవర్, స్కోడా స్లావియా, కియా సోనెట్, మారుతి సియాజ్ వంటి లగ్జరీ కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.

మెహ్రా బినామీ సంస్థగా భావిస్తున్న గోవింద్‌పురాలోని కేటీ ఇండస్ట్రీస్‌లోనూ సోదాలు జరిపి, రూ.1.25 లక్షల నగదుతో పాటు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మీద ఇప్పటివరకు రూ.36 లక్షలకు పైగా నగదు, 2.6 కిలోల బంగారం, 5.5 కిలోల వెండితో పాటు పలు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఇన్సూరెన్స్ పత్రాలు, షేర్ డాక్యుమెంట్లను గుర్తించినట్లు లోకాయుక్త అధికారులు తెలిపారు. ఆస్తుల విలువ ఇంకా లెక్కిస్తున్నామని, దీని విలువ అనేక కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -